డెమొక్రాట్లలో గెలుపు ఆశలు..!
ట్రంప్ ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత అమెరికా విపక్ష డెమొక్రాటిక్ పార్టీకి ఆశలు రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ప్రజా జీవనం స్థాయి దిగజారుతుండడం..పెరుగుతున్న ఖర్చులు, అప్పుల ఊబిలో కూరుకుపోతుండడంతో ప్రజల్లో ట్రంప్ ఆదరణ దారుణంగా పడిపోతోంది. ఇలాంటి తరుణంలో ట్రంప్ ను టార్గెట్ గా చేసుకోవడం కంటే.. ఆయన విధానాల్లోని లోపాలను ఎండగట్టడం ద్వారా తాము మధ్యంతర ఎన్నికల్లో గట్టెక్కవచ్చని డెమొక్రటిక్ వ్యూహకర్తలు భావిస్తున్నారు.
డెమొక్రటిక్ పార్టీ ప్రధాన లక్ష్యం కాంగ్రెస్‌లో రిపబ్లికన్ల ఆధిక్యాన్ని తగ్గించడం లేదా ముగించడం. ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆర్థిక అసంతృప్తిని ఎన్నికల మద్దతుగా మార్చుకోవడానికి పార్టీ ప్రయత్నిస్తోంది.
ధరల పెరుగుదలే ప్రధాన అస్త్రం…!
ఆహారం, ఇంధనం, ఇళ్లు, వైద్య ఖర్చులు పెరుగుతుండడాన్ని… విపక్షం ఎన్నికల్లో బలంగా ప్రచారం చేస్తోంది. ఇదంతా.. ట్రంప్ ఆర్థిక విధానాల్లోని లోపాల ఫలితమే అని ప్రస్తావిస్తోంది. సామాన్య కుటుంబాలపై పడుతున్న భారాన్ని డెమొక్రాట్లు ప్రచారంలో గట్టిగా వినిపిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులకు ఓటేస్తే… జీవన వ్యయం తగ్గించడాన్ని తమ ప్రధాన ప్రాధాన్యంగా చూపుతున్నారు.
రిపబ్లికన్ల నియోజకవర్గాల్లో పోటీ.. !
డెమొక్రాట్లు తమకు ఇప్పటికే మద్దతు ఉన్న ప్రాంతాలకే పరిమితం కాకుండా, రిపబ్లికన్లు గతంలో గెలిచిన నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నారు. అక్టోబర్‌లో ప్రతినిధుల సభ కోసం తమ లక్ష్య జాబితాను 66 రిపబ్లికన్ స్థానాలకు విస్తరించినట్లుతెలుస్తోంది.
ప్రచారం.. నిధుల సమీకరణ..!
డెమొక్రాట్లకు అనుకూలంగా పనిచేసే American Bridge 21st Century సంస్థ జూన్‌లో సుమారు 50 మిలియన్ డాలర్ల ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించింది. టెలివిజన్, డిజిటల్ మీడియా, రేడియో, ప్రత్యక్ష ప్రచారం ద్వారా ముఖ్యమైన హౌస్, సెనేట్ పోటీల్లో ఓటర్లను చేరుకోవడం దీని లక్ష్యం.
గ్రామీణ, మధ్యతరగతి ఓటర్లే టార్గెట్..
ఇంధన ధరలు, వ్యవసాయ ఖర్చులు, సుంకాల ప్రభావం వంటి స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మద్దతు పెంచుకోవాలని డెమొక్రాట్లు ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థులు టౌన్‌హాల్ సమావేశాలు, ఇంటింటి ప్రచారం, చిన్న విరాళాల సేకరణపై దృష్టి పెడుతున్నారు.
ఆరోగ్య సంరక్షణ, గర్భస్రావ హక్కులపై ప్రచారం
ఆరోగ్య బీమా, వైద్య ఖర్చులు, గర్భస్రావానికి సంబంధించిన హక్కులు వంటి అంశాలను కూడా పార్టీ ముందుకు తెస్తోంది. ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వ విధానాల వల్ల ఆరోగ్య సేవలకు ప్రభుత్వ సహాయం తగ్గే ప్రమాదం ఉందన్న అంశంపై విమర్శలు చేస్తోంది. యువత, పట్టణ ఓటర్లు, పార్టీకి మద్దతు ఇచ్చే వర్గాలు ఓటు వేయడానికి ముందుకొచ్చేలా ఇంటింటి ప్రచారం, ఫోన్ కాల్స్, స్థానిక సమావేశాలపై దృష్టి పెడుతున్నారు.
ప్రస్తుతం ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించడానికి డెమొక్రాట్లకు నికరంగా నాలుగు స్థానాలు పెరగాలి.
సెనేట్‌లోనూ మెజారిటీ సాధించేందుకు డెమొక్రాట్లు ప్రయత్నిస్తున్నారు. అయితే అక్కడ రాష్ట్రాల వారీగా పోటీ, అభ్యర్థుల బలం, స్థానిక రాజకీయ పరిస్థితులు కీలకంగా ఉంటాయి.








