యూరప్ ను కమ్మేసిన హీట్ వేవ్… ఈ ఏడాది సమ్మర్ సీజన్ లో 50 వేల మంది మృతి..!
2026 వేసవి యూరప్ ను.. అగ్నిగోళంలా మార్చేసింది. యూరప్ చరిత్రలో కనీ,వినీ ఎరుగని రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో.. జనం తీవ్ర వేడి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. ఈ వేసవిలో రికార్డైన అధిక ఉష్ణోగ్రతల కారణంగా సుమారు 50,000 మంది మరణించారని, దాదాపు 19 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.79 లక్షల కోట్లు) ఆర్థిక నష్టం వాటిల్లిందని రెండు వేర్వేరు అధ్యయనాలు సంచలన విషయాలు వెల్లడించాయి. మరణాలు, ఆర్థిక నష్టాల పరంగా యూరప్ చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన వేసవిగా నిలిచింది.
వివిధ నగరాల్లో సంభవించిన మరణాలపై ఇంపీరియల్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తల నేతృత్వంలో ఒక అధ్యయనం జరిగింది. యూరోపియన్ యూనియన్, యూకే, స్విట్జర్లాండ్, నార్వే సహా 30 దేశాల్లోని 854 నగరాల్లో ఈ పరిశోధన నిర్వహించారు. ఈ ప్రాంతాల్లోని మొత్తం జనాభాలో ఇది 40 శాతానికి సమానం. ఈ అధ్యయనం ప్రకారం రికార్డు స్థాయిలో సుమారు 50,000 మంది వేసవి తాపానికి బలయ్యారు.
శిలాజ ఇంధనాల వాడకం వల్ల పెరిగిన వాతావరణ మార్పులు లేకపోయి ఉంటే, ఈ మరణాల్లో మూడింట రెండొంతుల మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదని నివేదిక స్పష్టం చేసింది. గతంలో 2022లో 29,000, 2003లో 28,000 మరణాలు సంభవించగా, ఈసారి ఆ సంఖ్యను మించిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఇవి కూడా చదవండి
‘బ్లూమ్‌బర్గ్ ఎకనామిక్స్’ చేసిన మరో విశ్లేషణలో ఆర్థిక నష్టాలపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో యూరప్ సమాఖ్య జీడీపీలో 0.17 శాతం నష్టం వాటిల్లిందని, దీని విలువ 17 బిలియన్ యూరోలు ($19 బిలియన్లు) ఉంటుందని అంచనా వేసింది. గత దశాబ్దంలో ఇదే కాలానికి సంబంధించిన సగటు నష్టంతో పోలిస్తే ఇది ఏకంగా రెండున్నర రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ వేడి కారణంగా ఫ్రాన్స్ జీడీపీ 0.2 శాతం, జర్మనీ 0.1 శాతం, స్పెయిన్ 0.05 శాతం మేర తగ్గుదల నమోదు చేశాయి.
ఈ ఏడాది యూరప్‌లో మే నెలలోనే వడగాల్పులు ప్రారంభమై సెప్టెంబర్ వరకు కొనసాగాయి. ముఖ్యంగా పశ్చిమ యూరప్‌లో 1991-2020 మధ్య కాలంలోని సగటు వేసవి ఉష్ణోగ్రతల కంటే దాదాపు 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. కొన్ని రోజులైతే సాధారణం కంటే 12 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.








