AP Politics: ఏపీలో కూటమి సీట్ల పంచాయితీ.. వరుసగా రెండో రోజు చంద్రబాబు, పవన్ భేటీ..
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ (TDP), జనసేన (Jana Sena), బీజేపీ (BJP) కలిసి ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో స్థానాల కేటాయింపుపై ఏకాభిప్రాయం కుదరకపోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల విషయంలో నేతల మధ్య పోటీ పెరగడంతో కూటమి అగ్రనేతలు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరుసగా రెండు రోజుల పాటు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గురువారం సీఎంతో దాదాపు గంటపాటు చర్చించిన పవన్ కల్యాణ్, శుక్రవారం మరోసారి ముఖ్యమంత్రిని కలిశారు. జడ్పీటీసీ (ZPTC) , ఎంపీటీసీ (MPTC) ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కీలక దశకు చేరుకోవడంతో ఈ భేటీలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించి, మూడు పార్టీల మధ్య సమన్వయం సాధించడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశమని కూటమి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి సీట్ల పంపకంపై జిల్లా, నియోజకవర్గ స్థాయిలోనే చర్చలు జరిపి పరిష్కారం కనుగొనాలని కూటమి పెద్దలు భావించినట్లు సమాచారం. అయితే కొన్ని ప్రాంతాల్లో ఒకే స్థానానికి పలువురు నాయకులు పోటీ పడుతుండటంతో సమస్యలు తలెత్తాయి. తమకు అవకాశం కల్పించాలని ఆశిస్తున్న నేతలు వెనక్కి తగ్గకపోవడం, ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేయడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చినట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కూడా బరిలోకి దిగేందుకు సిద్ధపడటంతో స్థానిక నాయకత్వానికి అభ్యర్థులను ఒప్పించడం కష్టంగా మారిందని సమాచారం. దీంతో జిల్లా స్థాయిలో పరిష్కారం కాని అంశాలపై రాష్ట్రస్థాయి నాయకత్వం దృష్టి సారించాల్సి వస్తోంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పంపకం కూడా కూటమిలో చర్చకు వచ్చే అంశంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 28 జిల్లా పరిషత్లు ఉండటంతో ఈ పదవుల కేటాయింపు విషయంలో జనసేన తన ప్రాధాన్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎనిమిది జిల్లాల్లో జడ్పీ చైర్మన్ పదవులు, మరో ఎనిమిది జిల్లాల్లో వైస్ చైర్మన్ పదవులు తమకు ఇవ్వాలని జనసేన ప్రతిపాదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కుతాయో స్పష్టమైన తర్వాతే పదవుల పంపకంపై నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ముందుగానే పదవుల విషయంలో హామీలు ఇవ్వడం కంటే, ఎన్నికల ఫలితాలు, స్థానికంగా పార్టీల బలాబలాలను పరిగణనలోకి తీసుకోవడం సముచితమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జనసేన ప్రతిపాదనలు, టీడీపీ వైఖరి మధ్య ఏకాభిప్రాయం ఎలా కుదురుతుందనేది ఆసక్తికరంగా మారింది.








