హైదరాబాద్ ప్రతిష్ట మసకబారుతోంది!
మోస్ట్ లివబుల్ సిటీస్ లో హైదరాబాద్ పేరు ఒకప్పుడు అగ్రస్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు భాగ్యనగరం వెనకబడుతోంది. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026 తాజా నివేదికలో హైదరాబాద్ ర్యాంకింగ్ దిగజారింది. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో వెనుకబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెయ్యి నగరాలను విశ్లేషించగా, హైదరాబాద్ 421వ స్థానంలో నిలిచింది. మన దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై కంటే హైదరాబాద్ ఎంతో వెనుకబడి ఉంది. ఇది హైదరాబాద్ అభివృద్ధి, మౌలిక వసతులపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఆక్స్ ఫర్డ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ లో ఢిల్లీకి 268వ స్థానం, బెంగళూరుకు 311వ స్థానం, ముంబైకి 330వ స్థానం, చెన్నైకి 381వ స్థానం దక్కాయి. వీటన్నిటికంటే హైదరాబాద్ వెనుకబడి ఉంది. అయితే.. ఆర్థిక, మానవ వనరుల కేటగిరీలో హైదరాబాద్ తన సత్తా చాటింది. నగర ఆర్థిక వ్యవస్థ విభాగంలో 248వ స్థానాన్ని, హ్యూమన్ క్యాపిటల్ విభాగంలో 241వ స్థానాన్ని కైవసం చేసుకుంది. నగరంలో పెరుగుతున్న జీడీపీ తలసరి ఆదాయం, ఉపాధి వృద్ధి, బలమైన కార్పొరేట్ ఎకోసిస్టమ్ దీనికి ప్రధాన కారణాలు. అలాగే నగరంలోని విశ్వవిద్యాలయాలు, నిపుణులైన శ్రామిక శక్తి, నైపుణ్య ఆధారిత విద్య వలన హ్యూమన్ క్యాపిటల్ విభాగంలోనూ మంచి పురోగతి సాధించింది.
ఆర్థికంగా దూసుకుపోతున్న హైదరాబాద్, సామాన్య ప్రజల జీవన ప్రమాణాల విషయానికి వచ్చేసరికి తీవ్రంగా వెనుకబడింది. ఈ విభాగంలో నగరం ఏకంగా 818వ స్థానానికి పడిపోయింది. ఆదాయ అసమానతలు, తలసరి ఆదాయ వ్యత్యాసాలు, గృహ వసతి, యుటిలిటీ ఖర్చులు విపరీతంగా పెరగడం దీనికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అంతేకాకుండా, నగరంలో నేరాల రేటు, ఆరోగ్య రక్షణ సదుపాయాలు, వినోద, సాంస్కృతిక సౌకర్యాల లభ్యత వంటి అంశాలు నిరాశపరిచేలా ఉన్నాయి.
పర్యావరణ విభాగంలో హైదరాబాద్ 657వ స్థానాన్ని దక్కించుకుంది. ముంబై 782వ స్థానంలో, ఢిల్లీ 915వ స్థానాల్లో నిలిచాయి. అయితే 528వ స్థానంలో ఉన్న బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ చాలా వెనుకబడి ఉంది. గాలి నాణ్యత, ఉద్గారాల తీవ్రత, ప్రకృతి వైపరీత్యాల ముప్పు వంటి ప్రమాణాలను ఈ కేటగిరీ కింద అంచనా వేశారు. నగరంలో పెరుగుతున్న కాలుష్యం, దెబ్బతింటున్న రహదారులు, తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ వంటి సమస్యలు పౌరుల జీవన నాణ్యతను మరింత దిగజార్చుతున్నాయి.
నగర వేగవంతమైన విస్తరణ ప్రజల అవసరాలకు తగినట్లుగా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఆర్థికాభివృద్ధి మాత్రమే కాకుండా, దానికి తగినట్లుగా మౌలిక సదుపాయాలు, మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ, పర్యావరణ పరిరక్షణపై నిరంతరం పెట్టుబడులు పెట్టాలని అర్బన్ ప్లానర్స్ హెచ్చరిస్తున్నారు. నగరంలోని ఆర్థిక, మానవ వనరుల బలాలను ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలుగా మలచాలంటే ప్రభుత్వాలు, పట్టణాభివృద్ధి సంస్థలు సమన్వయంతో దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.








