SRPCC సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పాయింట్స్..
నా రాష్ట్రం తరఫున ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గౌరవనీయులైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లు, దక్షిణాది రాష్ట్రాల సీనియర్ పోలీసు అధికారులు, వివిధ కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు, ప్రతినిధులకు హృదయపూర్వక స్వాగతం ..
మన హైదరాబాద్ నగరానికి మీ అందరికీ సాదర స్వాగతం.
SRPCC సదస్సు మన రాష్ట్రంలో, మన హైదరాబాద్‌లో జరుగుతుండటం మనకు గర్వకారణం.
ఈ సదస్సు ద్వారా రాష్ట్రాల పోలీసు విభాగాలు, ప్రత్యేక విభాగాల మధ్య మెరుగైన సమన్వయం సాధించేందుకు అవకాశం కలుగుతుంది.
సమాజానికి భద్రత, రక్షణ అనేవి పునాదుల వంటివి.
సమర్థవంతంగా, నైతిక విలువలతో, నిష్పక్షపాతంగా పనిచేసే పోలీసు వ్యవస్థను అందించాలని ప్రజలు కోరుకుంటారు..
నేరాల స్వరూపం మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో SRPCC వంటి వేదికలు ఎంతో కీలకం. పోలీసింగ్ విధానాలు మారాలి. సంస్కరణలు నిరంతరం కొనసాగాలి.
నేను సంస్కరణలను విశ్వసిస్తాను. పోలీసు వ్యవస్థకు మనం అందించే వనరులు ఖర్చు మాత్రమే కాదు. మెరుగైన సమాజ నిర్మాణానికి, పౌరుల భద్రతకు చేసే పెట్టుబడిగా నేను భావిస్తున్నాను.
హైదరాబాద్ పోలీసు వ్యవస్థను మూడు కమిషనరేట్లుగా విభజించాం. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లను ఏర్పాటు చేశాం.
దీంతో ప్రతి పోలీసు కమిషనర్ పరిమిత ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి, మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం కలుగుతుంది.
వివిధ రకాల నేరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించేందుకు HYDRAA, EAGLE, T-Safe వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశాం.
ప్రస్తుతం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ట్రాఫిక్ సమస్యలు అత్యంత కీలకంగా మారాయి. ప్రతి విభాగం, ప్రతి ప్రత్యేక విభాగం సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణపై దృష్టి సారించి అత్యుత్తమ ఫలితాలు సాధించాలి.
మనం చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి.
మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల నివారణ, నక్సలిజం నిర్మూలన వంటి అన్ని రంగాల్లో తెలంగాణ పోలీసు శాఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ప్రశంసలు పొందుతోంది.
గౌరవనీయులైన ప్రధానమంత్రి నిర్వహించిన PRAGATI సమీక్ష సందర్భంగా సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
తెలంగాణను పూర్తిగా నక్సల్స్ రహిత రాష్ట్రంగా మార్చడంలో కృషి చేసిన మన పోలీసు అధికారులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు.
మాదకద్రవ్యాల నియంత్రణలో EAGLE విభాగం కేంద్ర ప్రభుత్వం నుంచి 80 శాతానికి పైగా మార్కులు సాధించింది.
బాధితులకు సైబర్ నేరాల ద్వారా పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఇప్పించే విషయంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది.
అమెరికాలోని FDA తరహాలో ఆహార కల్తీని అరికట్టడం, ఔషధాల నియంత్రణ కోసం వివిధ విభాగాల ప్రయత్నాలను సమన్వయం చేసేందుకు TG-SAFE అనే కొత్త విభాగాన్ని ప్రారంభించాం.
మన HYDRAA చెరువులు, సరస్సులు, ఇతర జలవనరులను పరిరక్షించడం, పునరుద్ధరించడం, వాటికి పూర్వ వైభవం తీసుకురావడం ద్వారా ప్రజల మన్ననలు పొందుతోంది.

అలాగే ప్రభుత్వ ఆస్తులు, ప్రజా ఆస్తుల రక్షణకు కూడా HYDRAA కృషి చేస్తోంది.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లను నియమించిన దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
పోలీసుల సంక్షేమం కూడా మనకు అత్యంత ముఖ్యమైన అంశం.
పోలీసులు రాష్ట్రం కోసం పోరాడుతారు. ప్రజల భద్రత కోసం నిరంతరం పనిచేస్తారు. అవసరమైతే విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తారు.
వారి సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తు నా అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటి.
పోలీసు సిబ్బంది తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటారు.
వారి పిల్లలకు దేశంలోని అత్యుత్తమ సైనిక్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య అందించేందుకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ఏర్పాటు చేశాం.
హోంగార్డు నుంచి డీజీపీ వరకు పోలీసు సిబ్బంది పిల్లలు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించవచ్చు.
పోలీసులు ధైర్యసాహసాలతో విధులు నిర్వహిస్తూ, తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారు. అయితే వారి కుటుంబాల భవిష్యత్తుకు కూడా మనం భరోసా కల్పించాలి.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బందికి, కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు, వారి హోదా, సర్వీసు ఆధారంగా కనీసం రూ.1 కోటి నుంచి గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాం.
అటువంటి కుటుంబాలకు గృహ నిర్మాణ స్థలాలు కేటాయిస్తున్నాం. అర్హులైన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం.
నేటి పరిస్థితుల్లో ఏ ఒక్క రాష్ట్రం తన ప్రయత్నాలతో మాత్రమే నేరరహితంగా మారడం సాధ్యం కాదు.
అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయం ఎంతో అవసరం.
ఈ అంశాలపై సమావేశంలో చర్చిస్తారని నేను విశ్వసిస్తున్నాను. సమగ్ర చర్చల అనంతరం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారని ఆశిస్తున్నాను.
దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీపై ఉంది.
వివిధ రాష్ట్రాల పోలీసు ప్రధాన కార్యాలయాల మధ్య సరిహద్దులు దాటి సమన్వయాన్ని పెంపొందించే పటిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేయండి.
మన పొరుగు రాష్ట్రాలతో సాంకేతిక మౌలిక సదుపాయాలను, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) వ్యవస్థను పంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.
మనమందరం కలిసి పనిచేస్తూ సురక్షితమైన దక్షిణ భారతదేశాన్ని నిర్మిద్దాం.









