ట్రంప్ రాజకీయాలకు హద్దులులేవా? వివేక్ రామస్వామి వివాదం వెనుక అసలు కథ!
అమెరికా రాజకీయాల్లో ప్రత్యర్థిని తిట్టడం, బహిరంగంగా అవమానించడం, సోషల్ మీడియాలో అవతల వాళ్లని ఉతికి ఆరేయడం.. ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ హయాంలో చాలా సాధారణంగా మారిపోయాయి. ఇలాంటి దూకుడు రాజకీయాలే ట్రంప్‌కు బలంగా మారాయి కూడా. దీంతో రిపబ్లికన్ పార్టీలో చాలామంది నాయకులు కూడా అదే దారిలో నడిస్తే తమకూ తిరుగుండదని భావిస్తున్నారు. కానీ, ట్రంప్ స్టైల్‌ను అనుకరించిన ప్రతిసారీ ఫలితం అలాగే ఉంటుందా? ఒహాయో గవర్నర్ ఎన్నికల్లో వివేక్ రామస్వామి ఎదుర్కొంటున్న తాజా వివాదం చూస్తే ఈ అనుమానం కలగకమానదు.
డెమోక్రటిక్ అభ్యర్థి అమీ ఆక్టన్ను దెబ్బతీయడానికి రామస్వామి ప్రచార టీమ్ విడుదల చేసిన ఓ ప్రకటన ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రత్యర్థిపై విమర్శలు చేయడం వరకు బాగానే ఉన్నా, ఆమె కుటుంబంలోని అత్యంత సున్నితమైన విషయాలను ఎన్నికల ప్రచారంలోకి లాగడమే అసలు సమస్యగా మారింది. విచిత్రమేమిటంటే, ఈ ప్రకటనపై డెమోక్రాట్లు మాత్రమే కాదు.. రిపబ్లికన్ పార్టీకి చెందిన కీలక నాయకులు కూడా మండిపడుతున్నారు.
ప్రత్యర్థిని దెబ్బతీయాలనుకుంటే.. కుటుంబాన్ని కూడా వదలరా?
అమీ ఆక్టన్ తల్లి తన కుమార్తెను ‘అబద్ధాలకోరు’ అంటూ విమర్శిస్తున్న దృశ్యాలతో ఈ ప్రకటనను రూపొందించారు. అయితే, అమీ చిన్నతనంలో ఎదుర్కొన్న పరిస్థితులు తెలిసినవారికి ఈ ప్రకటన మరింత వివాదాస్పదంగా కనిపిస్తోంది. చిన్నతనంలో అమీ, ఆమె సోదరుడిని తల్లి ఇంటి నుంచి తొలగించినట్లు పేపర్లు సూచిస్తున్నాయి. ఇందుకు కారణం.. అమీ సవతి తండ్రి… ఆమెపై అత్యాచారం చేసినట్లు వచ్చిన ఆరోపణలు.
ఇలాంటి బాధాకరమైన కుటుంబ నేపథ్యాన్ని ఇప్పుడు రాజకీయ ప్రచారంలో ఉపయోగించుకోవడం ఎంతవరకు సరైనదన్నదే అసలు ప్రశ్న. ఎన్నికల్లో గెలవాలంటే ప్రత్యర్థి బలహీనతలను బయటపెట్టడం ఒక వ్యూహం కావచ్చు. కానీ, ఆ బలహీనతలు వ్యక్తిగత జీవితానికి, చిన్నతనంలో ఎదురైన బాధాకరమైన అనుభవాలకు సంబంధించినవైతే పరిస్థితి మరోలా మారుతుంది. విమర్శలు చేయడం వేరు.. ఒక వ్యక్తి కుటుంబ విషాదాన్ని ఓట్ల కోసం ఉపయోగించుకోవడం వేరు అనే అభిప్రాయం ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.
అయితే, వివాదం మొదలైనా రామస్వామి వెనక్కి తగ్గలేదు. తన ప్రకటనను సమర్థించడమే కాకుండా, దాని ప్రచారం కోసం మరో 4 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని ఆయన బృందం నిర్ణయించింది. అంటే, విమర్శలు వస్తున్నా ఈ ప్రకటన తమకు రాజకీయంగా ఉపయోగపడుతుందనే నమ్మకంతోనే ఆయన ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉన్నట్లు?
ఈ వివాదంలో అత్యంత ఆసక్తికరమైన విషయం రామస్వామిని విమర్శిస్తున్నది ప్రత్యర్థి పార్టీ మాత్రమే కాకపోవడం. ఒహాయో ప్రస్తుత గవర్నర్ మైక్ డివైన్ గతంలో రామస్వామికి మద్దతు ప్రకటించారు. అలాంటి నాయకుడే ఇప్పుడు ఈ ప్రకటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకటనను చూస్తేనే చాలా ఆందోళన కలుగుతోందని, ఇలాంటి ప్రకటన విడుదల చేయడం తప్పని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
రిపబ్లికన్ సెనేటర్ జాన్ హస్టెడ్ కూడా ఇదే తరహాలో స్పందించారు. తాను అయితే అలాంటి ప్రకటనను విడుదల చేసేవాడిని కాదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు పైకి చూస్తే సాధారణ రాజకీయ విమర్శల్లా అనిపించవచ్చు. కానీ, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన సమయంలో సొంత పార్టీ నాయకులే బహిరంగంగా దూరం జరుగుతుండటం మాత్రం రామస్వామికి ఇబ్బందికరమైన పరిణామమే.
ఇవి కూడా చదవండి
ఒహాయోలో రిపబ్లికన్లు ఇప్పటికే కొన్ని కీలక ఎన్నికల విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో మరో వివాదం పార్టీకి నష్టం కలిగించవచ్చనే భయాలు పెరుగుతున్నాయి. గతంలో గవర్నర్, సెనేట్ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ కాంగ్రెస్ సభ్యుడు జేమ్స్ రెనాచీ కూడా ఈ ప్రకటన రిపబ్లికన్ గవర్నర్ ప్రచారాన్ని తీవ్రంగా దెబ్బతీయవచ్చని హెచ్చరించారు. ఈ వివాదం నుంచి దూరంగా ఉండని ఇతర రిపబ్లికన్ నాయకులు కూడా రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ట్రంప్ మాత్రం ‘వివేక్ వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు’ అంటున్నారు!
సొంత పార్టీ నుంచి విమర్శలు వస్తున్నా, డొనాల్డ్ ట్రంప్ మాత్రం రామస్వామికి మద్దతుగా నిలిచారు. గురువారం సోషల్ మీడియాలో స్పందిస్తూ ఆ ప్రకటనను చాలా శక్తివంతమైనదిగా అభివర్ణించారు. రిపబ్లికన్ అభ్యర్థిని దెబ్బతీయడానికి, అవమానించడానికి విమర్శకులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
ఇక్కడే ట్రంప్ రాజకీయాల అసలు స్వభావం కనిపిస్తుంది. ప్రత్యర్థిని ఇబ్బందుల్లోకి నెట్టేంత ఘాటుగా మాట్లాడటం, వివాదాన్ని పెద్దది చేయడం, ఆ వివాదం చుట్టూ తన మద్దతుదారులను సమీకరించడం.. ట్రంప్ రాజకీయ ప్రయాణంలో ఇవన్నీ కీలకంగా పనిచేశాయి. అందుకే ఆయన శైలిని అనుసరించడం వల్ల తమకూ అదే స్థాయిలో గుర్తింపు, మద్దతు వస్తాయని చాలామంది రిపబ్లికన్ నాయకులు భావిస్తున్నారు.
కానీ ఒక చిన్న చిక్కు ఉంది. ట్రంప్ ఏం చేసినా ఆయన మద్దతుదారులు దాన్ని ఎలా స్వీకరిస్తారన్నది ఒక అంశం. అదే పని మరో నాయకుడు చేస్తే ప్రజలు ఎలా స్పందిస్తారన్నది పూర్తిగా వేరే అంశం. ట్రంప్‌కు ఉన్న వ్యక్తిగత రాజకీయ ప్రభావం, ఆయనను అనుకరించే ప్రతి ఒక్కరికీ ఉంటుందని చెప్పలేం. ఇప్పుడు రామస్వామి ఎదుర్కొంటున్న సమస్య కూడా అదే.
జేడీ వాన్స్ స్పందన కూడా కొత్త తలనొప్పే!
ఈ వివాదంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందన కూడా చర్చనీయాంశమైంది. రామస్వామి ప్రకటనపై రిపబ్లికన్లు ఎక్కువగా విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. డెమోక్రాట్లు అమెరికాకు ఏమి చేయాలనుకుంటున్నారనే అంశాలపై దృష్టి పెట్టకుండా, ఒక ప్రకటన గురించే ఇంతగా ఆందోళన చెందడం ఏమిటన్నది ఆయన ప్రశ్న.
అయితే, 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్న నాయకుల్లో వాన్స్ కూడా ఒకరు కావడంతో ఆయన వ్యాఖ్యలకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటన సరైనదా కాదా అన్నది తనకు పట్టనట్లుగా వాన్స్ వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ప్రచారాన్ని సమర్థించడం వల్ల అమెరికా రాజకీయాల్లో ఇప్పటికే ఉన్న సమస్య మరింత తీవ్రమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ట్రంప్ తొలి ప్రభుత్వంలో పనిచేసిన జాన్ బోల్టన్ కూడా ఒక కీలకమైన విషయాన్ని ప్రస్తావించారు. ట్రంప్ అమెరికా రాజకీయాల్లో ఒక అసాధారణ వ్యక్తి అని, ఆయనకు పనిచేసిన వ్యూహాన్ని ఇతర నాయకులు అనుసరించినంత మాత్రాన అదే ఫలితాలు సాధించలేరని అన్నారు. ట్రంప్ రాజకీయాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో ఆయన వ్యక్తిగత శైలే ప్రధానంగా ఉందని, దాన్ని ఇతరులు అనుకరించడం తప్ప అందరూ అంగీకరించే ఒక ప్రత్యేక సిద్ధాంతం లేదని బోల్టన్ అభిప్రాయపడ్డారు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








