TDP: ఎమ్మెల్సీ ఎన్నికలు.. టీడీపీ దారెటు?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 2027 మార్చిలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకోసం హడావిడి మొదలైపోయింది. ముఖ్యంగా నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గం ఎన్నికపై ఎన్డీయే కూటమిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది. అయితే తెలంగాణలో మాత్రం ఈ పార్టీల మధ్య పొత్తు లేదు. ఈ స్థానంలో పోటీ చేసేందుకు ఆయా పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.
ఏపీలో కలిసి ప్రయాణిస్తున్న ఈ మూడు పార్టీల మధ్య సఖ్యత తెలంగాణ రాజకీయాల్లోనూ ప్రతిఫలిస్తుందా లేదా అనేదానిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. స్థానిక రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తెలంగాణలో ఇవన్నీ వేర్వేరుగా ఉంటున్నాయి. వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సి స్థానాన్ని దక్కించుకోవాలని జనసేన ఇప్పటికే పావులు కదిపింది. ఆ పార్టీ తరఫున గడల శ్రీనివాసరావును అభ్యర్థిగా కూడా ప్రకటించేసింది. మరోవైపు, బీజేపీ కూడా ఈ స్థానంలో పోటీ పడేందుకు గట్టి పట్టుదలతో ఉంది. కాషాయ పార్టీ నుంచి పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సుంకರಿ బిక్షం గౌడ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీ, జనసేన రెండు పార్టీలు బరిలోకి దిగాలని నిశ్చయించుకోవడంతో కూటమిలో అసలు చిక్కు వచ్చిపడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ వైఖరి అత్యంత కీలకంగా మారింది. ఇక్కడ టీడీపీ మద్దతు ఎవరికి దక్కుతుందనే అంశం ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో తనదైన క్యాడర్, ఓటు బ్యాంక్ కలిగి ఉన్న టీడీపీ మాత్రం ఇప్పటివరకు వరంగల్ ఎమ్మెల్సి ఎన్నికలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. బరిలోకి దిగే అవకాశాలు లేవు. అయితే మిత్రపక్షాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై ఇంకా స్పష్టతనివ్వకుండా వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఒకవేళ టీడీపీ గనుక ఒక పార్టీ వైపు మొగ్గుచూపితే, ఆ పార్టీ విజయావకాశాలు మెరుగవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అలా కాకుండా టీడీపీ కనుక తటస్థంగా ఉండి, సొంత బాటలో నడవాలని భావిస్తే మాత్రం కూటమి పార్టీల మధ్య ఓట్ల చీలిక తప్పకపోవచ్చు. ఏపీలో బలమైన బంధంలో ఉన్న ఈ పార్టీలు, తెలంగాణలో మాత్రం తమ స్థానిక ప్రయోజనాల కోసం భిన్నమైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి.
మొత్తానికి.. మార్చి 2027లో జరగబోయే ఈ ఎమ్మెల్సి పోరు కేవలం రెండు పార్టీల మధ్యే కాకుండా, భవిష్యత్ రాజకీయ మనుగడకు, కూటమి సమన్వయానికి ఒకరకమైన బెంచ్‌మార్క్‌గా మారనుంది. జనసేన అభ్యర్థిని ముందే ప్రకటించి దూకుడు ప్రదర్శిస్తుండగా, బీజేపీ తన అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలో టీడీపీ అధిష్ఠానం తీసుకోబోయే నిర్ణయం ఇరు పార్టీల రాజకీయ భవితవ్యాన్ని, ఎమ్మెల్సీ ఎన్నికను ఏమేరకు ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.








