పేరు మార్చమన్న ట్రంప్… ‘నో’ చెప్పిన సుందర్ పిచాయ్, అసలు ఏం జరిగింది?!
పేర్ల మార్పుతోనూ వార్తల్లో నిలవాలనుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ఓ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఇప్పటికే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చిన ట్రంప్.. ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం పేరుపైనా కన్నేశారు. ఏకంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌నే సంప్రదించారట. కానీ ఈసారి ఆయనకు ఊహించని సమాధానం ఎదురైంది. ఇంతకీ ట్రంప్ ఏం అడిగారు? పిచాయ్ ఎందుకు నో చెప్పారు?
అట్లాంటిక్‌కు ‘ట్రంప్ ఓషన్’ పేరు పెట్టాలనుకున్నారా?
దక్షిణ కరోలినాలో జరిగిన ర్యాలీలో ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అట్లాంటిక్ మహాసముద్రం పేరును మార్చే ప్రతిపాదనపై గూగుల్ మ్యాప్స్‌ను సంప్రదించినట్లు చెప్పారు. గతంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మార్చే విషయంలో గూగుల్ సహకరించిందని గుర్తుచేస్తూ, ఈసారి కూడా తన ఆలోచనను పరిశీలించాలని కోరినట్లు వెల్లడించారు.
అయితే సుందర్ పిచాయ్ మాత్రం ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదని ట్రంప్ తెలిపారు. మహాసముద్రాలు అనేక దేశాలకు విస్తరించి ఉంటాయని, వాటి పేర్లను మార్చడం వేరే విషయమని పిచాయ్ చెప్పినట్లు ట్రంప్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు ర్యాలీలో నవ్వులు పూయించాయి.
చివరకు అట్లాంటిక్ మహాసముద్రం పేరును మార్చే ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
గల్ఫ్ ఆఫ్ అమెరికా దగ్గర ఒకలా.. అట్లాంటిక్ దగ్గర మరోలా!
2025 జనవరిలో ట్రంప్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మార్చాలని కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. 2026లో అమెరికా-కెనడా మధ్య వాణిజ్య వివాదం నేపథ్యంలో లేక్ ఒంటారియోను ‘లేక్ అమెరికా’గా పిలవాలనే ప్రయత్నం కూడా చేశారు.
గూగుల్ మ్యాప్స్‌లో ఈ పేర్ల మార్పులు అమెరికా వినియోగదారులకు కనిపిస్తున్నాయి. అయితే మెక్సికో, కెనడాలోని వినియోగదారులకు పాత పేర్లే కనిపిస్తున్నాయి. సెర్చ్ ఫలితాల్లో కొత్త పేర్లతో పాటు అసలు పేర్లను కూడా బ్రాకెట్ లలో చూపిస్తున్నారు.
ఏదైమైనా…
భౌగోళిక పేర్లను మార్చాలన్న ట్రంప్ ఆలోచనకు అట్లాంటిక్ మహాసముద్రం దగ్గర మాత్రం బ్రేక్ పడినట్లయింది. ఒక దేశం తీసుకునే నిర్ణయం ప్రపంచమంతా అనుసరించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని ఈ ఉదంతం మరోసారి గుర్తుచేస్తోంది. డిజిటల్ మ్యాప్స్‌లో కనిపించే పేరు వెనుక కూడా అంతర్జాతీయ గుర్తింపు, భౌగోళిక వాస్తవాలు ఎంత కీలకమో ఈ వివాదం స్పష్టం చేస్తోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








