గ్రెగ్ చాపెల్ టీమ్ ను సర్వనాశనం చేశాడు: హర్భజన్ సింగ్
భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పదవీకాలం నాటి చేదు జ్ఞాపకాలను టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరోసారి గుర్తుచేసుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన చాపెల్ 2005 జూన్‌లో భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ కాలం భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చీకటి రోజులని హర్భజన్ అభివర్ణించాడు. ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన హర్భజన్.. నాటి కోచ్ చాపెల్ డ్రెస్సింగ్ రూమ్‌లో “విభజించి పాలించు” విధానాన్ని అమలు చేసి జట్టు ఐక్యతను పూర్తిగా దెబ్బతీశాడని సంచలన ఆరోపణలు చేశాడు.
నాటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ పట్ల చాపెల్ ప్రవర్తించిన తీరు, భారత జట్టును ముక్కలు చేసిన విధానం అత్యంత ఘోరమైన అధ్యాయమని హర్భజన్ మండిపడ్డాడు. చాపెల్‌ను హెడ్ కోచ్‌గా నియమించడం భారత క్రికెట్ మేనేజ్మెంట్ తీసుకున్న అత్యంత దారుణమైన నిర్ణయాలలో ఒకటి అని స్పష్టం చేశాడు. క్రీడాకారుల మధ్య గొడవలు పెట్టి, తానొక్కడే పాలకుడిలా వ్యవహరించాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో కలిసికట్టుగా ఆడి, అద్భుతమైన బంధాన్ని పంచుకున్న ఆటగాళ్లు.. చాపెల్ వచ్చిన తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మానేసేలా పరిస్థితిని దిగజార్చాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ విభజన వెనుక చాపెల్‌కు ఒక పెద్ద వ్యూహం ఉండవచ్చని హర్భజన్ అనుమానం వ్యక్తం చేశాడు. ఆ రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా జట్టుకు గట్టి పోటీ ఇవ్వగల ఏకైక జట్టు భారతదేశం మాత్రమేనని, అందుకే భారత్‌ను మానసికంగా బలహీనపరిచి, మ్యాచ్‌ల్లో ఓడిపోయేలా చేయడానికి చాపెల్ ఈ కుట్ర పన్ని ఉండవచ్చని అన్నాడు. ఈ అంతర్గత విభేదాల ప్రభావం వల్లే 2007 వన్డే ప్రపంచకప్‌లో రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలోని బలమైన భారత జట్టు బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాజయం పాలై, కనీసం గ్రూప్ స్టేజ్ కూడా దాటకుండానే టోర్నమెంట్ నుండి అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చిందని హర్భజన్ వివరించాడు.








