వార్నర్ బ్రదర్స్ అమ్మకం, CEOకు రూ.5,400 కోట్లు? ఏం జరిగింది?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
హాలీవుడ్లో ఇటీవల సరికొత్త హిస్టరీ క్రియేట్ అయింది. మనందరికీ సుపరిచితమైన హ్యారీ పోటర్, సూపర్‌మ్యాన్, బార్బీ వంటి ఐకానిక్ సినిమాలను అందించిన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని ‘పారామౌంట్ స్కైడాన్స్’ కొనుగోలు చేసింది. సంస్థను స్వతంత్ర కంపెనీగా కొనసాగించలేకపోయిన మాజీ CEO డేవిడ్ జాస్లావ్ సైతం ఈ డీల్‌తో సుమారు 600 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.5,400 కోట్లకు పైగా) సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో అసలు ఎంతకు వార్నర్ బ్రదర్స్ స్టూడియో అమ్ముడైంది.. కంపెనీని అమ్మేస్తే ఆ డబ్బు మొత్తం యాజమాన్యానికి కాకుండా ఓ సీఈఓకి రూ.5,400 కోట్లు ఎలా వెళ్తాయి? అప్పులు, షేర్లు, స్టాక్ ఆప్షన్లు అంటే అసలు కథేంటో చూద్దాం?
రూ.9.9 లక్షల కోట్ల డీల్: అసలు లెక్కలు ఇవే!
ముందుగా మనం ఈ భారీ డీల్‌లోని రెండు ముఖ్యమైన అంకెల గురించిన తేడా మాట్లాడుకోవాలి. ఒకటి, మొత్తం డీల్ విలువ (Enterprise Value) 110 బిలియన్ డాలర్లు (రూ.9.9 లక్షల కోట్లు) అయితే అందులో షేర్‌హోల్డర్ల వాటా విలువ (Equity Value) 81 బిలియన్ డాలర్లు (రూ.7.29 లక్షల కోట్లు).
ఈ రెండింటి మధ్య తేడా ఎందుకొచ్చిందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. ఒక వ్యక్తి దగ్గర రూ.10 లక్షల విలువైన ఇల్లు ఉందనుకుందాం, కానీ ఆ ఇంటిపై రూ.3 లక్షల రుణం కూడా ఉంది. ఇప్పుడు ఆ ఇంటిని కొనేవారు ఆస్తి మొత్తం విలువను రూ.10 లక్షలుగా చూసినప్పటికీ, బ్యాంకు అప్పు తీర్చేస్తే ఆ ఇంటి యజమానికి మిగిలే నికర విలువ రూ.7 లక్షలు మాత్రమే. బిజినెస్ ప్రపంచంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.
110 బిలియన్ డాలర్లు అనేది వార్నర్ బ్రదర్స్ కంపెనీ యొక్క మొత్తం అప్పులతో కలిపిన వ్యాపార విలువ కాగా, 81 బిలియన్ డాలర్లు అనేది కేవలం షేర్‌హోల్డర్ల వాటాకు సంబంధించిన నికర విలువ.
సీఈఓ చేతికి రూ.5,455 కోట్లు ఎలా వచ్చాయి?
అంతర్జాతీయ పత్రిక ‘ది ర్యాప్’ వెల్లడించిన ఫైలింగ్ వివరాల ప్రకారం, ఈ డీల్ తర్వాత.. మాజీ సీఈఓ డేవిడ్ జాస్లావ్కు చేరిన $606.1 మిలియన్ల (రూ.5,455 కోట్ల) విలువలో రెండు భాగాలు ఉన్నాయి. అందులో మొదటిది ఆయనకు కంపెనీలో సొంతంగా ఉన్న షేర్ల విలువ, ఇది సుమారు $224.4 మిలియన్లు (రూ.2,020 కోట్లు). ఇక రెండోది, ఆయనకు ఇచ్చిన స్టాక్ ఆప్షన్ల విలువ, ఇది సుమారు $381.7 మిలియన్లు (రూ.3,435 కోట్లు).
ఇక్కడ మనమంతా ఒక పొరపాటు పడుతుంటాం. ఈ 5,455 కోట్లు ఆయనకు ఈ డీల్ వల్ల కొత్తగా వచ్చిన లాభం అనుకుంటారు, కానీ అది నిజం కాదు! ఇందులో ఆయన సంవత్సరాలుగా సంపాదించి ఇప్పటికే సొంతం చేసుకున్న షేర్ల విలువ కూడా ఉంది. దీనిని ఆయనకు వచ్చిన నికర లాభంగా కాకుండా, ఆ డీల్ సమయంలో ఆయనకు ఉన్న ఆస్తుల మొత్తం విలువగా చూడాలి.
ఇవి కూడా చదవండి
అసలు ఏంటీ ‘స్టాక్ ఆప్షన్లు’?
స్టాక్ ఆప్షన్ అనేది కంపెనీ తన ఉద్యోగులకు (ముఖ్యంగా టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు) ఇచ్చే ఒక ప్రత్యేకమైన హక్కు. భవిష్యత్తులో కంపెనీ షేర్లను ఒక నిర్ణీత ధరకు కొనుగోలు చేసే అవకాశం దీని ద్వారా లభిస్తుంది.
ఉదాహరణకు, ఒక కంపెనీ తన సీఈఓకి నాణ్యమైన పనితీరు కోసం “మీరు భవిష్యత్తులో ఈ షేరును రూ.100 కే కొనుగోలు చేయవచ్చు” అని ఒక ఆప్షన్ ఇచ్చిందనుకుందాం. సీఈఓ కష్టపడి కంపెనీని బాగా నడిపి, ఆ షేరు మార్కెట్ ధరను రూ.300కి తీసుకెళ్తే, ఆయన ఆ ఆప్షన్‌ను ఉపయోగించి రూ.100కే షేరు కొని రూ.200 లాభం పొందుతారు. అంటే కంపెనీ ఎదిగితే ఉద్యోగి కూడా దానితో పాటు ఎదుగుతారు. జాస్లావ్ విషయంలో కూడా ఈ స్టాక్ ఆప్షన్లే ఆయన సంపదను అంత భారీగా పెంచాయి.
ఇంత పెద్ద సంస్థను ఎందుకు కొనుగోలు చేశారు?
ఈ కొనుగోలుతో హాలీవుడ్‌లోని రెండు అతిపెద్ద సినిమా స్టూడియోలు ఒకే గొడుగు కిందకు వచ్చాయి. సినిమాలే కాకుండా HBO Max, Paramount+ లాంటి దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, అలాగే CNN, CBS లాంటి టాప్ టీవీ నెట్‌వర్క్‌లు కూడా ఇకపై ఈ కొత్త సంస్థ పరిధిలోనే నడుస్తాయి.
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ వంటి బిగ్ ప్లేయర్లతో స్ట్రీమింగ్ రేసులో పోటీ పడాలంటే విపరీతమైన కంటెంట్, భారీ బడ్జెట్ సినిమాలు, ప్రపంచవ్యాప్త హక్కులు అవసరం. ఈ రెండు సంస్థలు కలవడం వల్ల ఆ బలం రెట్టింపు అవుతుందని కొత్త యాజమాన్యం భావిస్తోంది.
అయితే, ఈ విలీనం తర్వాత కొత్త కంపెనీపై సుమారు 80 బిలియన్ డాలర్ల భారీ అప్పుల భారం కూడా పడనుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖర్చు తగ్గించుకుని, ఆదాయం పెంచడం కొత్త మేనేజ్మెంట్కు నిజమైన పరీక్ష అని చెప్పవచ్చు.
ఇంతటి భారీ విలీనం వెనుక ప్లాన్ ఏంటి?
ఇప్పుడు పారామౌంట్, వార్నర్ బ్రదర్స్ ఒకటైపోయాయి! దాంతో HBO Max + Paramount+ స్ట్రీమింగ్ సర్వీసులు, CNN + CBS లాంటి టీవీ నెట్‌వర్క్‌లు, బిగ్ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌లన్నీ ఒక్కటే పెద్ద పవర్ హౌస్‌గా మారబోతున్నాయి. బిగ్ స్క్రీన్ నుండి ఓటీటీ దాకా కంటెంట్‌ను ఏకధాటిగా ఏలడమే ఈ $110 బిలియన్ల మాస్టర్‌ప్లాన్!








