ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరుబాట!
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ అంశంపై ఇండీ కూటమితో పాటు సీజేపీ ఉద్యమిస్తోంది. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ కూడా ప్రత్యక్షంగా ఉద్యమించేందుకు సిద్ధమైంది. శనివారం ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అవసరమైతే ఢిల్లీలో కూడా పోరాడతామని ఆ పార్టీ నేతలుచెప్తున్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ ముసుగులో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను టార్గెట్ చేసి లక్షలాది ఓట్లను తొలగించారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక పార్టీ విజయావకాశాలను దెబ్బతీయడానికి, లేదా అధికార పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చడానికి ఎన్నికల యంత్రాంగం పావులు కదుపుతోందన్నది బీఆర్ఎస్ ప్రధాన వాదన. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 324, 325, 326 కల్పించిన స్వేచ్ఛాయుత ఎన్నికల భావనకు ఈ చర్య తూట్లు పొడుస్తోందని ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు.
స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం, పాలకుల చేతిలో కీలుబొమ్మగా మారుతుందనే ఆరోపణలు వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నాయకత్వంలోని ఈసీ తీరు పక్షపాత ధోరణిలో ఉందంటూ బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే మండిపడుతున్నారు. సీఈసీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలిపెట్టే ప్రసక్తే లేదని గులాబీ దళం స్పష్టం చేస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్లోని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం ఎదుట శనివారం భారీ ధర్నాకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర స్థాయి నుంచి ఈ నిరసనలను అవసరమైతే ఢిల్లీకి కూడా విస్తరించాలనుకుంటోంది. కేంద్ర ఎన్నికల సంఘం వైఖరిని దేశవ్యాప్తంగా ఎండగట్టాలని బీఆర్ఎస్ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.
ఎన్నికల సంఘంపై, అధికార యంత్రాంగంపై నమ్మకం సడలిన తరుణంలో న్యాయవ్యవస్థే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టి, సిట్టింగ్ జడ్జితో సమగ్రమైన, స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేయడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.








