ఎర్రవల్లి భూముల రీ సర్వే.. తెరపైకి సంచలన విషయాలు!
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి.. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన గ్రామం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ఈ గ్రామంతో పాటు పొరుగున ఉన్న వెంకటాపూర్‌లో ప్రస్తుతం రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగాలు చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ నెలలో ప్రారంభమైన ఈ సర్వే ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు ఆయా గ్రామాల్లోని రైతులకు నోటీసులు జారీ చేసి సుమారు 60 శాతం భూముల కొలతలను అధికారులు పూర్తి చేశారు. మిగిలిన 40 శాతం భూముల సర్వేను రానున్న 7 నుండి 10 రోజుల్లో పూర్తి చేసేందుకు యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.
అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ సర్వేకు అంకురార్పణ జరిగింది. తొలుత ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325లో ఉన్న 388 ఎకరాల ప్రభుత్వ భూమిపై అధికారులు దృష్టి సారించారు. అయితే, ఆ ప్రాథమిక సర్వేలో ఒక కీలక అంశం వెలుగులోకి వచ్చింది. మొత్తం 388 ఎకరాల ప్రభుత్వ భూమిలో 45 ఎకరాల భూమి క్షేత్రస్థాయిలో ఎక్కడ ఉందో కచ్చితమైన ఆచూకీ లభించలేదని అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ 45 ఎకరాల ‘మిస్సింగ్ ల్యాండ్’ మిస్టరీని ఛేదించేందుకే ప్రభుత్వం ఎర్రవల్లి, వెంకటాపూర్ గ్రామాల సమగ్ర రీ సర్వేకు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
ఈ సర్వేలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, అధికారులు అనుసరిస్తున్న వ్యూహం. తొలుత కేసీఆర్ కుటుంబ సభ్యుల భూములనే సర్వే చేయాలని భావించినప్పటికీ, సాంకేతిక చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు ముందుగా గ్రామంలోని ఇతర రైతుల భూముల కొలతలు పూర్తి చేసి, చివరగా మాజీ సీఎం కుటుంబ భూములను సర్వే చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ చివరి అంకానికి రంగం సిద్ధమైంది. జిల్లా కలెక్టర్ నుండి అధికారిక ఆదేశాలు వెలువడగానే నోటీసులు జారీ చేసేందుకు మర్కూక్ మండల రెవెన్యూ, సర్వే అధికారులు ఇప్పటికే పత్రాలను సిద్ధం చేశారు.
రికార్డుల ప్రకారం ఎర్రవల్లి, మర్కూక్ ప్రాంతంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, బంధువులు, వారి సంస్థల పేరిట ఉన్న భూముల వివరాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అధికారిక వర్గాల సమాచారం మేరకు ఈ ప్రాంతంలో కేసీఆర్ పేరిట 57.36 ఎకరాల భూమి ఉండగా, ఆయన సతీమణి శోభ పేరిట 7 ఎకరాలు ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరిట 49.14 ఎకరాలు, ఆయన సతీమణి శైలిమ పేరిట 74.21 ఎకరాలు, కుమారుడు హిమాన్షు పేరిట 46 ఎకరాలు, కుమార్తె అలేఖ్య పేరిట 9.38 ఎకరాల భూమి రిజిస్టర్ అయి ఉంది. వీటికి అదనంగా కేసీఆర్ బంధువు జోగినపల్లి రవీందర్ రావు పేరిట 26 ఎకరాలు, ఆయన కుమారుడు జోగినపల్లి సంతోష్ రావు పేరిట 18 ఎకరాలు ఉన్నాయి. అలాగే ‘టీ న్యూస్’ సంస్థ పేరిట 54.22 ఎకరాలు, ‘నమస్తే తెలంగాణ’ పత్రిక పేరిట 6.34 ఎకరాల భూములు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రముఖులందరికీ అతి త్వరలోనే నోటీసులు జారీ కానున్నాయి. మొత్తం గ్రామాల సర్వే పూర్తయితే తప్ప, ఆచూకీ లేకుండా పోయిన 45 ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్కడ కలిసిందో తేలదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాబోయే పది రోజుల్లో జరగబోయే ఈ సర్వే ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో వేచి చూడాలి.







