జగ్గారెడ్డి ఇంటికి హరీశ్ రావు.. ఎందుకంటే..?
తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీశ్ రావు, జగ్గారెడ్డి ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే వీళ్లిద్దరూ ఒకే వేదికపై, అదీ ఒకరి ఇంటికి మరొకరు వెళ్లి ఆప్యాయంగా పలకరించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సంగారెడ్డిలో జగ్గారెడ్డి నివాసానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావు విచ్చేయడం అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల్లో ఆసక్తిని రేకెత్తించింది.
జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయిరెడ్డి, కోడలు పాలక్ పటేల్‌ల సత్యనారాయణ వ్రతం సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించేందుకు హరీశ్ రావు నేరుగా జగ్గారెడ్డి ఇంటికి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, డీసీఎంఎస్ ఛైర్మన్ శివకుమార్‌లతో కలిసి వచ్చిన హరీశ్ రావుకు జగ్గారెడ్డి సాదర స్వాగతం పలికారు. దంపతులకు ఆశీస్సులు అందించిన అనంతరం, ఇరువురు నేతలు కాసేపు అత్యంత ఆత్మీయంగా సంభాషించుకున్నారు. సుమారు 21 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరూ ఇలా వ్యక్తిగతంగా కలుసుకోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
ఈ భేటీ అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 21 ఏళ్ల క్రితం నాటి రాజకీయ పరిస్థితులను, తమ మధ్య ఉన్న పాత స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. 2004లో హరీశ్ రావు తొలిసారి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో తాను ఆయన ఛాంబర్‌కు వెళ్లి కలిసి భోజనం చేసేవాడినని జగ్గారెడ్డి వివరించారు. ఆ తర్వాత తాను కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రాజకీయ సమీకరణాలు మారాయని, గత పదేళ్లు హరీశ్ రావు మంత్రిగా, తాను ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశం రాలేదని ఆయన తెలిపారు. తన కుమార్తె వివాహానికి హరీశ్ రావును ఆహ్వానించలేకపోయానని, అందుకే ఈసారి కుమారుడి వేడుకకు తప్పకుండా రావాలని ప్రత్యేకంగా పిలిచినట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో, ఇద్దరు కీలక నేతల కలయికపై సహజంగానే అనేక రాజకీయ ఊహాగానాలు మొదలయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాపై పట్టు కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా పోటీపడుతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే, ఈ కలయిక వెనుక ఎలాంటి రాజకీయ మతలబులు లేవని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ సిద్ధాంతాలు వేరైనప్పటికీ, తాము ఎన్నడూ వ్యక్తిగత దూషణలకు దిగలేదని ఆయన గుర్తుచేశారు. బీఆర్ఎస్లో హరీశ్ రావు ఒక అగ్రనేత అని, కాంగ్రెస్‌లో తాను ఒక స్థాయి నాయకుడినని చెబుతూనే, ప్రజాస్వామ్యంలో రాజకీయ వైరం వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరని ఆయన సంకేతాలిచ్చారు.
రాజకీయ విభేదాలు వ్యక్తిగత శత్రుత్వాలుగా మారుతున్న తరుణంలో, జగ్గారెడ్డి – హరీశ్ రావుల కలయిక ఒక భిన్నమైన వాతావరణాన్ని ఆవిష్కరించింది. అధికారం ఉన్నా లేకపోయినా, పార్టీలు వేరైనా శుభకార్యాలలో కలుసుకోవడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆరోగ్యకరమైన సంప్రదాయానికి వీరిద్దరూ మళ్లీ తెరలేపారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ భేటీ భవిష్యత్తులో ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.







