డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ వైఖరి స్పష్టం.. తెలంగాణ ప్రయోజనాలు, సమాఖ్య స్ఫూర్తి పరిరక్షణే ముఖ్యం: మహేష్ బిగాల!
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వెల్లడించిన స్పష్టమైన వైఖరికి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాలను 50 శాతం పెంచాలన్న ప్రతిపాదన అమలైతే లోక్‌సభలో మొత్తం ఎంపీ స్థానాల సంఖ్య పెరుగుతుందని, అయితే అదే సమయంలో 2051 వరకు రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని కాపాడే రాజ్యాంగపరమైన రక్షణ ఉండటం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రకారం తెలంగాణ లోక్‌సభ స్థానాలు ప్రస్తుతమున్న 17 నుండి 26కు పెరిగే అవకాశం ఉందని, తద్వారా జాతీయ రాజకీయాల్లో తెలంగాణకు మరింత ప్రాతినిధ్యం లభించి, రాష్ట్ర గళాన్ని బలంగా వినిపించే అవకాశం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా, చెన్నైలో దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యం, డీలిమిటేషన్ అంశంపై జరిగిన చర్చలు, సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణ కోసం గళం వినిపించిన విషయాన్ని మహేష్ బిగాల గుర్తుచేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా, అత్యంత న్యాయబద్ధంగా ముందుకు సాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఎంపీ స్థానాలు పెరిగే ఈ పరిణామం జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు అవకాశం కల్పిస్తుందని, తెలంగాణ రాజకీయాల్లో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మరోసారి ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి, రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటినుంచో సంపూర్ణ మద్దతు ఇస్తోందని, వాటిని సమర్థవంతంగా అమలు చేయాలన్నదే తమ పార్టీ నిబద్ధత అని మహేష్ బిగాల స్పష్టం చేశారు. డీలిమిటేషన్ అనేది కేవలం నియోజకవర్గాల సంఖ్యకు సంబంధించిన సాంకేతిక అంశం మాత్రమే కాదని, ఇది దేశ సమాఖ్య వ్యవస్థ, రాష్ట్రాల మధ్య సమానత్వం, ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం, భవిష్యత్ తరాల హక్కులకు సంబంధించిన కీలకమైన అంశమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలే తమకు ప్రథమ ప్రాధాన్యమని, పార్లమెంటులో దక్షిణ భారత రాష్ట్రాల గొంతుక మరింత బలంగా వినిపించాలని, దేశ సమాఖ్య స్ఫూర్తిని కాపాడటమే మనందరి బాధ్యత అని మహేష్ బిగాల పిలుపునిచ్చారు.







