నాగిని పాటకు డ్యాన్స్ చేస్తుంటే.. నిజంగానే వచ్చేసిన పాము! కాటేసి వెళ్లిపోయింది
నాగిని పాట వినిపిస్తే చాలు.. డ్యాన్స్ చేయకుండా ఉండలేరు కదా! అందులోనూ పెళ్లి వేడుకలో డీజే పెట్టి మరీ నాగిని పాటలు వేస్తే సందడే వేరు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఓ పెళ్లింట్లో మాత్రం నాగిని పాటకు డ్యాన్స్ చేస్తుండగా నిజంగానే ఓ పాము ప్రత్యక్షమైంది. మొదట్లో అదేదో సరదాగా జరుగుతున్న వ్యవహారమే అనుకున్నారు. కానీ అది నిజమైన పాము అని తెలిసేసరికి అక్కడున్న వాళ్లకు వెన్నులో వణుకు పుట్టింది. ఇంతలో ఓ యువకుడు పామును బయటకు పంపించేందుకు ప్రయత్నించగా, అది అతడి చేతిపై కాటు వేసింది. చివరకు ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కలేదు. అప్పటివరకు పెళ్లి సందడితో కళకళలాడిన ఇల్లు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.
పెళ్లింట్లో డీజే సందడి.. నాగిని పాటకు యువకుల డ్యాన్స్!
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా అజ్గైన్ పట్టణానికి చెందిన దేవరాజ్ ద్వివేది ఇంట్లో ఆయన కుమార్తె పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి హల్దీ, మెహందీ వేడుకలతో పాటు లేడీస్ సంగీత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్లతో ఇల్లంతా సందడిగా మారిపోయింది. డీజే పాటలకు అందరూ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ పెళ్లి వేడుకను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదే సమయంలో డీజేలో నాగిని పాట వినిపించడంతో 25 ఏళ్ల అర్జున్ ద్వివేదీతో పాటు మరికొందరు నాగిని డ్యాన్స్ మొదలుపెట్టారు. అందరూ పాటలో లీనమై చిందులు వేస్తున్న సమయంలోనే అనుకోని ఘటన చోటుచేసుకుంది. డ్యాన్స్ చేస్తున్న ప్రదేశానికి సమీపంలో ఓ పాము నెమ్మదిగా పాకుతూ వచ్చింది.
ఇవి కూడా చదవండి
నిజమైన పామును చూసి పరుగులు పెట్టిన జనం!
మొదట్లో అక్కడున్న వాళ్లు అది నిజమైన పాము అని గుర్తించలేకపోయారు. ఏదో సరదాగా చేస్తున్నారేమో అనుకున్నారు. కానీ అది నిజంగానే పాము అని తెలియడంతో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. అప్పటివరకు పాటలు, కేరింతలతో మారుమోగిన ఇల్లు కేకలు, అరుపులతో నిండిపోయింది. పాము నుంచి తప్పించుకునేందుకు అందరూ అటూఇటూ పరుగులు తీశారు.
అయితే అర్జున్ మాత్రం పామును చూసి భయపడకుండా దాన్ని బయటకు పంపించాలని అనుకున్నాడు. అది అక్కడే ఉంటే మరెవరికైనా ప్రమాదం జరుగుతుందని భావించి, దాని తోక పట్టుకుని బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.
బయటకు తీసుకెళ్తుండగా చేతిపై కాటు!
అర్జున్ పామును చేత్తో పట్టుకుని బయటకు తీసుకెళ్తుండగా అది ఒక్కసారిగా తిరిగి అతడి చేతిపై కాటు వేసింది. దీంతో అతడి పరిస్థితి క్రమంగా విషమించింది. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సమీపంలోని స్థానిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. అయితే అర్జున్ పరిస్థితి తీవ్రంగా ఉండటంతో పెద్ద ఆసుపత్రికి తరలించాలని వైద్యుడు సూచించారు.
దీంతో కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన లక్నోకు తీసుకెళ్లారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. అక్కడి వైద్యులు పరీక్షించి అర్జున్ మృతి చెందినట్లు ప్రకటించారు.
ఆరుగురు తోబుట్టువుల్లో పెద్దవాడు.. కుటుంబానికి తీరని విషాదం!
అర్జున్‌కు కేవలం 25 ఏళ్లే. ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు కలిపి ఆరుగురు తోబుట్టువుల్లో అతడే పెద్దవాడు. కుటుంబ బాధ్యతల్లోనూ తన వంతు సహాయం చేస్తూ ఇంటికి అండగా ఉంటున్నాడు. అలాంటి అర్జున్ హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ముఖ్యంగా తల్లి గీత తన కుమారుడి మరణాన్ని తట్టుకోలేకపోతోంది.
కూతురి పెళ్లి వేడుకతో ఆనందంగా ఉండాల్సిన ఇంట్లో ఇప్పుడు విషాదం అలుముకుంది. కాసేపటి క్రితం వరకు నాగిని పాటకు చిందులు వేసిన ఆ కుటుంబం, ఇప్పుడు అర్జున్ మరణంతో కన్నీటి పర్యంతమైంది. సరదాగా సాగాల్సిన పెళ్లి వేడుకలో జరిగిన ఈ ఘటన అందరినీ కలచివేసింది.
ఒక చిన్న జాగ్రత్త: పాము కనిపించినప్పుడు దాన్ని పట్టుకోవడం లేదా బయటకు పంపించే ప్రయత్నం చేయడం ప్రమాదకరం. వెంటనే దూరంగా వెళ్లి పాములను పట్టుకునే నిపుణులకు సమాచారం ఇవ్వాలి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







