పవన్ హస్తిన పర్యటనలో బిగ్ ట్విస్ట్..!
దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ (NDA) ముఖ్య నేతల కీలక సమావేశం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాల వల్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఢిల్లీ ప్రయాణాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. దీంతో అమరావతిలో రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని ముగించుకున్న వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కరే ప్రత్యేక విమానంలో హస్తినకు బయలుదేరి వెళ్లారు.
ఇవి కూడా చదవండి
నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ బిల్లు మరియు మహిళా రిజర్వేషన్ల అమలుపై చర్చించేందుకు ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో బిల్లు ఆమోదానికి అనుసరించాల్సిన వ్యూహాలు, దక్షిణాది రాష్ట్రాలు మరియు ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే అంశాలపై ఎన్డీఏ నేతలు ప్రధానంగా చర్చించనున్నారు.
మరోవైపు, ఎన్డీఏ ముఖ్య నేతల సమావేశం ముగిసిన తర్వాత శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు, డీలిమిటేషన్ బిల్లుపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు, అలాగే దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా 50 శాతం సీట్ల పెంపు ఫార్ములా వంటి కీలక అంశాలపై చంద్రబాబు ఈ ప్రెస్ మీట్లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు ఢిల్లీ మీడియా సమావేశంలో ఎలాంటి సంచలన విషయాలు వెల్లడిస్తారోనని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.







