అల్లూరి సీతారామరాజు, సి.వి. రామన్, ఎస్.వి. రంగారావు..ఈ ముగ్గరూ చదువుకున్న కాలేజీ గురించి తెలుసా?!
భారతదేశ చరిత్రలో మన్యం వీరుడిగా నిలిచిపోయిన అల్లూరి సీతారామరాజు, దేశానికి తొలి సైన్స్ నోబెల్ బహుమతి తెచ్చిపెట్టిన సర్ సి.వి. రామన్, వెండితెరపై నటనకు నిఘంటువుగా మారిన విశ్వనట చక్రవర్తి ఎస్.వి. రంగారావు… ఈ ముగ్గురు దిగ్గజాలకు ఒకే విద్యాసంస్థతో విడదీయరాని అనుబంధం ఉందని మీకు తెలుసా?
అవును, ఆ ముగ్గురు మహానుభావులు చదువుకుంది మన విశాఖపట్నంలోని 160 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక ‘మిస్సెస్ ఏవీఎన్ కాలేజ్’ (Mrs. A.V.N. College) లోనే! అయితే, ఆ కాలేజీ భవనాన్ని చూసిన చాలామంది, ఇది బ్రిటిష్ పాలకులు కట్టించిన కట్టడమని పొరబడుతూ ఉంటారు. కానీ అసలు నిజం వేరే ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం కుదరదని చేతులెత్తేస్తే, మన వాళ్లు సొంత డబ్బులతో, త్యాగాలతో నిర్మించిన గొప్ప విద్యాదేవాలయం ఇది.
ఇవి కూడా చదవండి
బ్రిటిష్ వారి నిరాకరణ.. స్థానికుల పట్టుదల
1860వ సంవత్సరంలో విశాఖ ప్రజలు తమ పిల్లల చదువుల కోసం ఒక స్కూల్ కావాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే అప్పటి ప్రభుత్వం అందుకు నిర్మొహమాటంగా నిరాకరించింది. దీంతో వెనక్కి తగ్గని స్థానిక జమీందారులు, ఊరి పెద్దలు, వారికి అండగా నిలిచిన కొందరు మంచి మనసున్న బ్రిటిష్ అధికారులతో కలిసి విరాళాలు సేకరించారు. అలా అందరి కృషితో 1860లో దీనిని ‘హిందూ స్కూల్’గా ప్రారంభించారు.
ఒక భర్త త్యాగం.. ‘మిస్సెస్ ఏవీఎన్’గా నామకరణం
కొన్నాళ్ల పాటు బాగానే నడిచినప్పటికీ, ఆ తర్వాత నిధుల కొరత ఏర్పడి కాలేజీ మూతపడే దుస్థితి వచ్చింది. సరిగ్గా ఆ క్లిష్ట సమయంలో, అంటే 1892లో అంకితం వెంకట నరసింహారావు గారు ఒక పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. దివంగతులైన తన భార్య జ్ఞాపకార్థం ఏకంగా 11 ఎకరాల విలువైన భూమి, ఒక పెద్ద భవనంతో పాటు లక్ష రూపాయల నగదును విరాళంగా అందించారు (ఆ రోజుల్లో లక్ష రూపాయలంటే ఇప్పుడు వందల కోట్లతో సమానం). ఆయన చేసిన ఆ మహోన్నత త్యాగానికి గుర్తుగా ఈ విద్యాసంస్థకు ‘మిస్సెస్ ఏవీఎన్ కాలేజ్’ అని పేరు పెట్టారు.
తరతరాలకు వెలుగులు పంచుతున్న చరిత్ర
ఒక వ్యక్తి తన భార్యపై ఉన్న ప్రేమతో చేసిన దానం, స్థానికుల పట్టుదల కలిసి ఒక చారిత్రక విద్యాసంస్థగా మారింది. అల్లూరి, సి.వి. రామన్, ఎస్వీఆర్ లాంటి ఎందరో లెజెండ్స్ నడిచిన ఆ నేల, నేటికీ విశాఖపట్నానికే గర్వకారణంగా నిలిచి తరతరాలకు విద్యాబుద్ధులు నేర్పిస్తోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







