అధికారం కోసం పాత ఫార్ములాకు కేటీఆర్ కొత్త పదును!
తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో పాదయాత్ర అనేది కేవలం ఒక నిరసన కార్యక్రమం మాత్రమే కాదు, అది అధికారానికి దగ్గరి దారి చూపే ఒక శక్తివంతమైన సెంటిమెంట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన ఈ ఒరవడిని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నారా లోకేష్ విజయవంతంగా అనుసరించి అధికార పీఠాలను అధిరోహించారు. తెలంగాణలోనూ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కల పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించాయి. ఇప్పుడు సరిగ్గా అదే సెంటిమెంట్‌ను నమ్ముకుని, కోల్పోయిన అధికారాన్ని తిరిగి దక్కించుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారీ ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అధికారం కోల్పోయినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీతలతో బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. అయితే కేవలం సభలు, సమావేశాలతోనే కేడర్‌లో పూర్తిస్థాయి ఉత్సాహం నింపలేమని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. అందుకే 2027 ఫిబ్రవరి లేదా మార్చిలో కేటీఆర్ పాదయాత్రను ప్రారంభించేలా పార్టీ వర్గాల్లో కసరత్తు జరుగుతోంది. అప్పటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతుంది కాబట్టి, సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత మొదలవుతుందని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు.
పైగా 2027 మార్చి నాటికి నియోజకవర్గాల పునర్విభజనపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో, ఏ నియోజకవర్గంలో ఎవరిని ప్రోత్సహించాలనే దానిపై క్లారిటీ ఉంటుందని భావిస్తున్నారు. 2027 మార్చిలో మొదలై 2028 మార్చి వరకు, అంటే ఏకంగా ఏడాది పాటు ఈ యాత్ర సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. సాధారణ ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు పాదయాత్రను ముగించి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారంలోకి దిగాలన్నది కేటీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది.
గతంలో నేతలు అనుసరించిన పాదయాత్ర ఫార్ములాను ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మార్చి, మరింత ఆకర్షణీయంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ బృందం యోచిస్తోంది. కేవలం వేదికలపై నుంచి రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాకుండా.. గ్రామాలు, పట్టణాల్లోని రైతులు, నిరుద్యోగులు, మహిళలతో నేరుగా మమేకమై ‘మీకు నేనున్నాను’ అనే భరోసా కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యాత్ర ప్రారంభం కావడానికి ముందే పార్టీ కమిటీలన్నింటినీ పూర్తిస్థాయిలో నియమించి, కొత్త కమిటీల భుజాలపైనే పాదయాత్ర నిర్వహణ బాధ్యతలను పెట్టాలని చూస్తున్నారు. మరో నాలుగు నెలల్లో యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున, ఇప్పటి నుంచే షెడ్యూల్, రూట్ మ్యాప్‌లపై కసరత్తు వేగవంతమైంది. పార్టీ అధినేత కేసీఆర్ తుది ఆమోదముద్ర పడగానే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
మొత్తానికి సెంటిమెంట్ రాజకీయాలకు పెట్టింది పేరైన తెలంగాణ గడ్డపై.. గతంలో ఎందరో నేతలను సీఎం కుర్చీపై కూర్చోబెట్టిన ఈ ‘పాదయాత్ర’ అస్త్రం, కేటీఆర్‌కు ఏ మేరకు కలిసొస్తుందన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.







