‘డ్యూన్ 3’ కోసం మరో మాస్టర్ ప్లాన్? సినిమా పాత్రలతో సరికొత్త గేమ్!?
‘డ్యూన్’ సినిమా పేరు వినగానే గుర్తొచ్చేది అంతుచిక్కని ఎడారి ప్రపంచం, ఇసుక తుఫానులు, భారీ యుద్ధాలు, పాల్ అట్రీడెస్ చుట్టూ తిరిగే అధికార పోరాటం. డెనిస్ విలెనెవ్ సృష్టించిన ఈ ప్రపంచానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన అభిమానులున్నారు. అందుకే ఇప్పుడు అందరి చూపు ‘డ్యూన్: పార్ట్ త్రీ’ మీదే ఉంది. డిసెంబర్ 18న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుండటంతో అభిమానుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
అయితే హాలీవుడ్ సినిమా పబ్లిసిటీ కోసం ఎలాంటి మార్గాలు ఎంచుకుంటుందో కొన్నిసార్లు ఊహించడం కూడా కష్టమే. ట్రైలర్లు, పోస్టర్లు, ఇంటర్వ్యూలతో సరిపెట్టకుండా.. సినిమా ప్రపంచాన్నే ఇతర రంగాల్లోకి తీసుకెళ్లే ప్రయోగాలు చేస్తుంటుంది. ఇప్పుడు ‘డ్యూన్ 3’ కోసం కూడా అలాంటి మరో మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోందా? సినిమా పాత్రలను తీసుకుని ప్రత్యేకమైన గేమింగ్ కార్డులు రూపొందిస్తున్నారనే ప్రచారం మొదలైంది. ఆన్లైన్లో బయటపడిన ఎనిమిది కార్డుల చిత్రాలు ఇప్పుడు ఈ చర్చకు కారణమయ్యాయి.
పాల్ అట్రీడెస్ నుంచి షై-హులుద్ వరకు..
‘మ్యాజిక్: ది గ్యాదరింగ్’ (Magic: The Gathering) అనే ప్రముఖ కార్డ్ గేమ్‌లో భాగంగా డ్యూన్ ప్రత్యేక ఎడిషన్ రాబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. Redditలోని r/magicTCG ఫోరమ్‌లో ఎనిమిది డ్యూన్ నేపథ్య కార్డులతో కూడిన ప్రచార చిత్రం ప్రత్యక్షమైంది. ఈ చిత్రాలు తనకు Discord ద్వారా లభించాయని వాటిని పోస్ట్ చేసిన వ్యక్తి చెప్పినట్లు ComicBook.com నవంబర్ 12న వెల్లడించింది.
ఈ కార్డుల్లో డెనిస్ విలెనెవ్ తెరకెక్కించిన ‘డ్యూన్’, ‘డ్యూన్: పార్ట్ టూ’ సినిమాల్లోని ప్రముఖ పాత్రలు కనిపిస్తున్నాయి. పాల్ అట్రీడెస్, చానీ, బారన్ వ్లాదిమిర్ హార్కొన్నెన్, రెవరెండ్ మదర్ జెస్సికా, ప్రిన్సెస్ ఇరులాన్, చక్రవర్తి షద్దామ్ IV, మొహియమ్ పాత్రలకు ప్రత్యేక కార్డులు రూపొందించినట్లు తెలుస్తోంది. పాల్ అట్రీడెస్కు మరో రూపమైన ‘ముఆద్దిబ్’ పేరుతో రెండో కార్డు కూడా ఉందట.
కేవలం ఫొటోలు కాదు.. ప్రత్యేక గేమ్ పవర్స్ కూడా!
ఈ లీక్‌లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇవి ఇప్పటికే ఉన్న కార్డులపై డ్యూన్ పాత్రల బొమ్మలు ముద్రించిన సాధారణ రీప్రింట్లు కావని తెలుస్తోంది. ప్రతి పాత్రకు ప్రత్యేక గేమ్ సామర్థ్యాలు, సొంత మెకానిక్స్ ఉన్న కొత్త లెజెండరీ క్రియేచర్ కార్డుల్లా కనిపిస్తున్నాయి.
ఉదాహరణకు, ముఆద్దిబ్ కార్డును ల్యాండ్‌ఫాల్, డెలిరియం వంటి గేమ్ మెకానిక్స్ ఆధారంగా రూపొందించిన Temur కమాండర్‌గా చూపించారు. ఇక డ్యూన్ ప్రపంచంలో అత్యంత భయంకరమైన జీవిగా పేరొందిన షై-హులుద్కు కూడా ప్రత్యేక కార్డు ఉన్నట్లు మరో చిత్రం సూచిస్తోంది. తొమ్మిది మనా ఖర్చుతో వచ్చే 12/12 వార్మ్‌గా దీనిని రూపొందించారని, ట్రాంపుల్, ఇండెస్ట్రక్టిబుల్ సామర్థ్యాలు కూడా ఇచ్చారని MTG Insider పేర్కొంది.
ఇంతటితో ఆగలేదు. ఇప్పటికే గేమర్లకు పరిచయమైన కొన్ని కమాండర్ కార్డులకు కూడా డ్యూన్ ప్రపంచానికి సరిపోయే కొత్త పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. Darksteel Forge కార్డును ‘Pain Box’గా, Halo Fountain కార్డును ‘Water of Life’గా మార్చినట్లు సమాచారం. ప్రత్యేక Halo Foil ఎడిషన్‌తో పాటు ‘Desert Power Everything Bundle’ పేరుతో మరో కలెక్షన్ కూడా ఈ ప్రచార చిత్రాల్లో కనిపించాయి.
నిజంగానే ‘డ్యూన్’ కార్డులు వస్తున్నాయా?
ఇన్ని వివరాలు బయటకు వచ్చినా ఒక చిన్న సమస్య ఉంది. ఈ కార్డులు నిజంగా విడుదల కాబోతున్నాయనే విషయాన్ని Wizards of the Coast సంస్థ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి ఈ లీక్‌ను నిజమని నిర్ధారించలేం.
అయితే కొన్ని అంశాలు మాత్రం ఈ చిత్రాలు నిజమైనవే కావచ్చనే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ComicBook.com ప్రకారం, వీటి డిజైన్ గతంలో విడుదలైన Secret Lair ప్రచార చిత్రాలను పోలి ఉంది. ప్రతి కార్డుపై ఆర్టిస్టుల పేర్లు ఉండటం కూడా గమనించదగ్గ విషయం. MTG Insider సైతం కార్డుల ఫార్మాటింగ్, లెజెండరీ క్రియేచర్లకు ఇచ్చిన వరుస కలెక్టర్ నంబర్లు వంటివి నిజమైన ఉత్పత్తిని పోలి ఉన్నాయని పేర్కొంది.
మరోవైపు, ఈ చిత్రాలు మొదట ఎక్కడి నుంచి వచ్చాయో ఇప్పటికీ తెలియదు. నవంబర్ 12 నాటికి Wizards అధికారిక వెబ్సైట్లోనూ దీనికి సంబంధించిన ప్రకటన కనిపించలేదు. TechRaptor కూడా ఈ ఆర్ట్‌వర్క్ చాలా నమ్మదగిన రీతిలో తయారుచేసిన నకిలీ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి
‘డ్యూన్ 3’ రిలీజ్‌కు ముందే ప్రకటన ఉంటుందా?
ఈ లీక్ నిజమైతే, దీని వెనుక ఉన్న టైమింగ్ కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. ‘డ్యూన్: పార్ట్ త్రీ’ డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇలాంటి సమయంలో సినిమా పాత్రలతో ప్రత్యేక గేమింగ్ కార్డులను విడుదల చేయడం ద్వారా సినిమా అభిమానులతో పాటు గేమర్లను కూడా ఆకర్షించవచ్చు.
దీనికి మరో లింక్ ఉంది. నవంబర్ 13 నుంచి 15 వరకు MagicCon Atlanta కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలోనే Wizards of the Coast ఈ కార్డులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కూడా సంస్థ నుంచి ఎలాంటి సమాచారం లేదు.
నిజానికి Magic: The Gathering గేమ్‌కు ఇతర సినిమాలు, పాప్ కల్చర్ ప్రపంచాలను జోడించడం కొత్తేమీ కాదు. గతంలో Fallout, Warhammer 40,000 ఫ్రాంచైజీలతో ప్రత్యేక కమాండర్ డెక్స్ రూపొందించారు. ఇటీవల Star Trek క్రాస్ఓవర్ సెట్ కూడా వచ్చింది. Sonic the Hedgehog వంటి పాత్రలతో Secret Lair ప్రత్యేక డిజైన్లు కూడా విడుదలయ్యాయి.
సినిమా ప్రమోషన్‌కు మరో కొత్త దారి?
ఒకవేళ ఈ డ్యూన్ కార్డులు నిజమైతే, ఇది కేవలం మరో గేమింగ్ కలెక్షన్ మాత్రమే కాదు. ఒక సినిమా ప్రపంచాన్ని థియేటర్లకే పరిమితం చేయకుండా, గేమింగ్, కలెక్షన్లు, అభిమానుల హాబీల్లోకి తీసుకెళ్లే మరో ప్రయత్నం అవుతుంది. ముఖ్యంగా ‘డ్యూన్ 3’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది అదనపు ఆకర్షణగా మారొచ్చు.
అయితే ప్రస్తుతానికి ఈ ఎనిమిది కార్డులు లీకైన చిత్రాల రూపంలోనే ఉన్నాయి. అధికారిక విడుదల తేదీ, ధర, తుది కార్డుల సంఖ్యపై ఎలాంటి ప్రకటన రాలేదు. మరి నిజంగానే ‘డ్యూన్ 3’ ప్రమోషన్లో భాగంగా ఈ కొత్త గేమ్ ప్రయోగం రాబోతోందా? లేక అభిమానుల ఆసక్తిని పెంచిన మరో నకిలీ లీక్ మాత్రమేనా? దీనిపై Wizards of the Coast అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







