హరీశ్ రావు కోటను రేవంత్ రెడ్డి బద్దలు కొట్టగలరా?
తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి సిద్ధిపేటపైనే ఉంది. బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావుకు తిరుగులేని కంచుకోటగా ఉన్న సిద్ధిపేట గడ్డపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నేపథ్యంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇందిరమ్మ బీమా, రూ. 544 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనలతో పాటు లక్షలాది మందితో భారీ బహిరంగసభ ద్వారా హరీశ్ రావును దెబ్బతీయాలని రేవంత్ రెడ్డి వ్యూహరచన చేశారు. సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్.. ఈ మూడు గులాబీ కోటలను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కైవసం చేసుకుంటామని సీఎం సవాల్ విసిరారు. అయితే నిజంగానే సిద్ధిపేటలో హరీశ్ రావును ఢీకొట్టే సత్తా రేవంత్ రెడ్డికి లేదా కాంగ్రెస్ పార్టీకి ఉందా అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
సిద్ధిపేట రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, అది సాధారణ నియోజకవర్గం కాదనే విషయం స్పష్టమవుతుంది. 2004 ఉపఎన్నికలో తొలిసారి గెలిచిన నాటి నుంచి 2023 వరకు హరీశ్ రావు ఇక్కడ వరుసగా ఏడుసార్లు విజయం సాధించారు. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, సిద్ధిపేటలోని ప్రతి ఇంటితోనూ ఆత్మీయ బంధం పెంచుకున్న వ్యక్తిగా ఆయన ముద్ర వేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా, సిద్ధిపేటలో హరీశ్ రావుకు 1,05,514 ఓట్లు (58.17 శాతం) పోలవగా, కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 23,206 ఓట్లకే (12.76 శాతం) పరిమితమయ్యారు. అంటే, సుమారు 82 వేలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో హరీశ్ రావు తన పట్టును నిరూపించుకున్నారు. అంతేకాదు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ గెలిచినప్పటికీ, సిద్ధిపేట అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం బీఆర్ఎస్కే ఆధిక్యం లభించింది.
ఇవి కూడా చదవండి
సిద్ధిపేటలో హరీశ్ రావును ఓడించడం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బరిలోకి దిగినా కష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడ జరిగిన మౌలిక సదుపాయాల కల్పన. రంగనాయక సాగర్ జలాశయం ద్వారా సాగునీరు, ఇంటింటికీ తాగునీరు, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఐటీ టవర్, కోమటిచెరువు సుందరీకరణ వంటివి సిద్ధిపేట ప్రజల జీవితాల్లో భాగమైపోయాయి. మరోవైపు, రేవంత్ సభకు ముందే హరీశ్ రావు బహిరంగ లేఖ అస్త్రాన్ని ప్రయోగించారు. సిద్ధిపేటకు రావాల్సిన రూ. 1,070 కోట్ల నిధుల నిలిపివేత, వెటర్నరీ కాలేజీ తరలింపు, రుణమాఫీ అసంపూర్తి అమలుపై ప్రశ్నలు సంధించి స్థానిక సెంటిమెంట్‌ను రగిలించారు.
గణాంకాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు హరీశ్ రావుకు ఇంత అనుకూలంగా ఉన్నా, రేవంత్ రెడ్డి సిద్ధిపేటపై ఎందుకు ఇంతలా దృష్టి సారించారన్నది ఆసక్తికరం. దీని వెనుక నిర్బంధ వ్యూహం దాగి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో హరీశ్ రావు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనను సొంత నియోజకవర్గంలోనే కట్టడి చేస్తే, రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ పోరాట పటిమను తగ్గించవచ్చనేది రేవంత్ ఆలోచన. అధికార యంత్రాంగం, సంక్షేమ పథకాల లబ్ధిదారుల మద్దతుతో సిద్ధిపేటలో కాంగ్రెస్ కేడర్‌కు కొత్త ఊపిరి పోయాలని ఆయన చూస్తున్నారు.
మొత్తంగా చూస్తే, అధికార బలం, భారీ బహిరంగ సభల హడావుడితో సిద్ధిపేట కోటను కదిలించడం అంత తేలిక కాదు. డబ్బుతోనో, తాత్కాలిక హామీలతోనో గెలవడానికి సిద్ధిపేట ఓటర్లు సిద్ధంగా లేరనేది గత ఎన్నికల ఫలితాలు చెబుతున్న సత్యం. హరీశ్ రావుకు దీటుగా నిలబడాలంటే, కేవలం రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా, ఆయన కంటే రెట్టింపు స్థాయిలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే బలమైన స్థానిక నాయకత్వాన్ని నిర్మించుకోవడం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద సవాలుగా మారనుంది.







