హైదరాబాద్ ప్రజారవాణాలో నవశకం.. ‘పాడ్ కార్స్’!
శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరానికి పెరుగుతున్న జనాభాతో పాటు ట్రాఫిక్ కష్టాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో నిత్యం లక్షలాది మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న నరకానికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్న, అత్యాధునిక ప్రజారవాణా వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. అదే పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS) లేదా ‘పాడ్ ట్యాక్సీ’ వ్యవస్థ. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు వేగంగా అడుగులు పడుతున్నాయి.
మెట్రో రైలు రాకతో హైదరాబాద్‌లో మూడు ప్రధాన మార్గాల్లో ప్రయాణం సులభతరమైనప్పటికీ, మెట్రో స్టేషన్ దిగిన తర్వాత గమ్యస్థానాలకు చేరుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. ఆటోలు, క్యాబ్‌ల అధిక ఛార్జీలు, ట్రాఫిక్ జామ్‌ల నుంచి విముక్తి కల్పించేందుకే ఈ పీఆర్టీఎస్ వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా భూమికి ఎత్తులో ప్రత్యేకంగా నిర్మించిన ఎలివేటెడ్ ట్రాక్‌లపై డ్రైవర్ లేని, పూర్తిగా ఆటోమేటిక్ గా నడిచే ఎలక్ట్రిక్ పాడ్ కార్లు ప్రయాణిస్తాయి.
ఇవి కూడా చదవండి
ఒక చిన్న కారు పరిమాణంలో ఉండే ఈ పాడ్ ట్యాక్సీలలో ఒకేసారి నలుగురి నుంచి ఆరుగురు వరకు ప్రయాణించవచ్చు. అంతేకాకుండా, రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో 15 నుంచి 20 మంది ప్రయాణించేలా గ్రూప్ ర్యాపిడ్ ట్రాన్సిట్ వాహనాలను కూడా అందుబాటులోకి తెచ్చే వీలుంది. ప్రయాణికులు పాడ్ కార్ ఎక్కిన తర్వాత, అందులో అమర్చిన టచ్‌ప్యాడ్ ద్వారా తమ గమ్యస్థానాన్ని ఎంచుకుంటే చాలు, కేంద్రీకృత కంట్రోల్ వ్యవస్థ సహాయంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా నేరుగా ఆ స్టేషన్‌కు చేరుకోవచ్చు. గంటకు 35 నుంచి 44 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బ్యాటరీ ఆధారిత వాహనాల వల్ల ఎలాంటి వాయు, శబ్ద కాలుష్యం ఉండదు.
ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం, మొదటి దశలో భాగంగా 35 కిలోమీటర్ల పొడవునా 64 స్టేషన్లతో పీఆర్టీఎస్ కారిడార్‌ను నిర్మించనున్నారు. కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ నుంచి ప్రారంభమై, దుర్గం చెరువు, రహేజా మైండ్‌స్పేస్, రాయదుర్గం, బయోడైవర్సిటీ మీదుగా నాలెడ్జ్ సిటీ వరకు విస్తరించి ఉంటుంది. దీనితో పాటు గచ్చిబౌలిలోని ఐకియా సమీపంలో ఒక మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయం, పీఆర్టీఎస్ డిపోను కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
కేవలం ఐటీ కారిడార్ మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ఎల్బీనగర్ – రాణిగంజ్, అసెంబ్లీ – బేగంపేట మార్గాల్లో కూడా ఈ పాడ్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిసెంబర్ నాటికి టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని మెట్రో రైలు అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ అంచనాల ప్రకారం, జంట నగరాల్లో పీఆర్టీఎస్ అందుబాటులోకి వస్తే 2030 నాటికి రోజుకు 3.94 లక్షల మంది, 2040 నాటికి 7.96 లక్షల మంది, 2050 నాటికి ఏకంగా 10 లక్షల మంది ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 6 ప్రధాన నగరాల్లో 8 విభిన్న సాంకేతికతలతో పీఆర్టీ వ్యవస్థలు నడుస్తున్నాయి. ముఖ్యంగా లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో విజయవంతంగా నడుస్తున్న యూకేకి చెందిన ‘అల్ట్రా పీఆర్టీ’ సాంకేతికత తరహాలోనే, హైదరాబాద్‌కు చెందిన ఒక సంస్థ అల్ట్రా పీఆర్‌టీతో కలిసి ఈ ప్రాజెక్టును చేపడుతోంది. మన దేశంలో ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లో 8.5 కిలోమీటర్ల మేర ఇలాంటి ప్రాజెక్టును చేపట్టగా, హైదరాబాద్‌లో ఏకంగా 35 కిలోమీటర్ల భారీ నెట్‌వర్క్‌కు శ్రీకారం చుట్టడం విశేషం.
మొత్తానికి, రహదారుల విస్తరణకు పరిమితులు ఉన్న నగరంలో, ఆకాశమార్గంలో తక్కువ స్థలంలో, తక్కువ ఖర్చుతో, పర్యావరణ హితంగా సాగే ఈ పాడ్ కార్ వ్యవస్థ విజయవంతమైతే.. హైదరాబాద్ ప్రజారవాణా చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.







