తెలంగాణ – ఏపీ మధ్య పల్నాడు వాటర్ గ్రిడ్ రగడ
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదం నాగార్జునసాగర్ కేంద్రంగా మరోసారి భగ్గుమంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఇరు రాష్ట్రాల మధ్య కొత్త ఘర్షణకు తెరలేపింది. సాగర్ జలాశయం కుడివైపున ఏపీ నిర్మిస్తున్న ఇన్‌టేక్ వెల్స్ వ్యవహారం ఇప్పుడు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కోర్టులోకి చేరింది.
పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని గ్రామాల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కింద రూ. 1,200 కోట్ల భారీ వ్యయంతో ఏపీ ప్రభుత్వం పల్నాడు వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపట్టింది. రోజుకు 160 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో మూడు ఇన్‌టేక్ వెల్స్ నిర్మించి, ఏడాదికి సుమారు 1.86 టీఎంసీల నీటిని తరలించాలన్నది ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. దీనిపై ఇప్పటికే రూ. 95 కోట్ల మేర ఖర్చు చేసి పనులు వేగవంతం చేశారు.
ఇవి కూడా చదవండి
అయితే ఈ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఎలాంటి ముందస్తు అనుమతులు, డీపీఆర్ ఆమోదం, అపెక్స్ కౌన్సిల్ క్లియరెన్స్ లేకుండా ఏపీ ఈ పనులను చేపట్టిందని తెలంగాణ నీటిపారుదల శాఖ ఆరోపిస్తోంది. అంతకుమించి సాంకేతికంగా అత్యంత కీలకమైన అంశాన్ని తెలంగాణ తెరపైకి తెచ్చింది. నాగార్జునసాగర్ జలాశయం కనీస నీటి మట్టం 155.48 మీటర్లు కాగా, ఏపీ ప్రభుత్వం అంతకంటే దిగువన అంటే 150.45 మీటర్ల స్థాయి నుంచే నీటిని తోడేలా ఇన్‌టేక్ వెల్స్ నిర్మిస్తోందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎండీడీఎల్ కంటే దిగువన నీటిని తరలించడం రిజర్వాయర్ భద్రతకు, నిర్వహణ కట్టుబాట్లకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేస్తూ పనులను తక్షణమే నిలిపివేయాలని కేఆర్ఎంబీ, కేంద్ర జలశక్తి శాఖలకు లేఖలు రాసింది. అంతేకాకుండా, ఈ పనుల సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేయడంలో విఫలమైన సాగర్ ఎస్ఈ, ఈఈలకు తెలంగాణ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ అభ్యంతరాలను ఆంధ్రప్రదేశ్ అధికారులు, నేతలు తోసిపుచ్చుతున్నారు. తమకు గతంలోనే కేటాయించిన 2.55 టీఎంసీల వాటా నుంచే కేవలం 0.57 టీఎంసీల నీటిని మాత్రమే తాగునీటి అవసరాల కోసం వాడుకుంటున్నామని ఏపీ స్పష్టం చేస్తోంది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం తెలంగాణ సైతం సాగర్‌పై అనుమతులు లేకుండానే సుంకిశాల ఇన్‌టేక్ వెల్ నిర్మిస్తోందని ఏపీ వర్గాలు ఎదురుదాడికి దిగుతున్నాయి.
ఈ అంశం కాస్తా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ తుఫాను రేపింది. సాగర్ జలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోతుంటే తెలంగాణ సర్కార్ చోద్యం చూస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని అధికార కాంగ్రెస్ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు.
వాస్తవానికి పల్నాడు స్కీమ్ ఒక్కటే కాదు.. కృష్ణా బేసిన్లో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ఫిర్యాదుల చిట్టా చాలా పెద్దదిగా ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ లైనింగ్ పనులు, పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. మరోవైపు పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి అదనపు నీటి కేటాయింపులు, సుంకిశాల, నారాయణపేట-కొడంగల్, డిండి వంటి తెలంగాణ ప్రాజెక్టులను ఏపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
కృష్ణా జలాల వివాదాల పరిష్కారం కోసం జరగాల్సిన కేఆర్ఎంబీ సమావేశం వాయిదా పడటంతో ఈ ప్రతిష్టంభన మరింత ముదిరింది. సాగునీటి ప్రాజెక్టుల వివాదాల సరసన ఇప్పుడు తాగునీటి పథకాలు కూడా చేరడం రెండు రాష్ట్రాల మధ్య సంబంధాల్లో మరింత వేడిని రాజేస్తోంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువడే వరకు, కేంద్ర జలశక్తి శాఖ, కేఆర్ఎంబీ జోక్యం చేసుకుని శాస్త్రీయ, చట్టబద్ధమైన పర్యవేక్షణను అమలు చేస్తే తప్ప ఈ జల వివాదాలకు తెరపడే అవకాశం కనిపించడం లేదు.







