బిలాంగింగ్ కాదు..వైట్ వాషింగ్ .. బీజేపీ ఫైర్..!
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా అధికశాతం కాంగ్రెస్ శ్రేణులు… ఈపుస్తకాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ప్రజలు కూడా ఇందిర సమయంలో ఏం జరిగింది.. అన్న అంశంపై ఆసక్తితో పుస్తకాన్ని ఆసక్తిగా చదవుతున్నారు. అయితే ఈ పుస్తకంపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని అంశాల్లో తప్పులు దొర్లడం జరిగిందన్న ఆరోపణలున్నాయి.
అయితే బిలాంగింగ్.. ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకంపై .. బీజేపీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. ఈ పుస్తకం నెహ్రూ-గాంధీ కుటుంబం చేసిన చారిత్రక తప్పిదాలను కప్పిపుచ్చి, వారి పాపాలను శుభ్రపరిచే ఒక ‘వైట్వాషింగ్’ ప్రయత్నమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తన అత్త, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ ఒక పొరపాటని, చివరికి ఆమె కూడా అదే అభిప్రాయానికి వచ్చారని సోనియా తన పుస్తకంలో పేర్కొన్నారు. ఆ సమయంలో ఇందిర తన చిన్న కుమారుడు సంజయ్ గాంధీని అదుపులో ఉంచి ఉంటే, జరిగిన నష్టంలో చాలా వరకు నివారించి ఉండేవారని ఆమె అభిప్రాయపడ్డారు.
అయితే, ఈ వ్యాఖ్యలను బీజేపీనేతలు తోసిపుచ్చారు. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలను అంగీకరించకుండా, దాన్ని ఒక సాధారణ పొరపాటుగా చిత్రీకరించి, సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
పుస్తకంలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన గురించి ప్రస్తావిస్తూ తాను ఏడ్చానని సోనియా చెప్పడాన్ని బీజేపీ నేతలు తప్పుబట్టారు. “బాబ్రీ మసీదు కోసం కన్నీళ్లు పెట్టుకున్న సోనియా గాంధీ, కాంగ్రెస్ హయాంలో 1984లో జరిగిన సిక్కుల ఊచకోతలో వేలాది మంది అమాయకులు చనిపోయినప్పుడు కనీసం ఒక్క కన్నీటి చుక్కైనా కార్చారా?” అని ప్రశ్నించారు. 26/11 ముంబై ఉగ్రదాడులు, బాట్లా హౌస్ ఎన్కౌంటర్ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి గురించి ఎప్పుడైనా బాధపడ్డారా అని నిలదీశారు.







