అమెరికా రక్షణమంత్రి హెగ్సెత్ ను మందలించిన గార్డ్..!
ఎక్కడైనా ఓ మంత్రిని.. ఓ సాదాసీదా సైనికుడు మందలించగలడా.. కనీసం సూచన అయినా చేయగలడా.. మంత్రి వస్తే సెల్యూట్ చేసే సైనికుడికి అంత ధైర్యం ఉంటుందా.. అంటే ఫారిన్ కంట్రీస్ లో ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ.. ప్రతీ ఒక్కరికి వారి బాధ్యత మీద అంత శ్రద్ధ ఉంటుంది. అదే స్థాయిలో వ్యవస్థ కూడా వారికా ధైర్యాన్నిస్తుంది. అది ఎంతలా అంటే అమెరికా రక్షణ మంత్రిని ఓ సైనికుడు హెచ్చరించేంతగా…
అర్లింగ్టన్లోని నేషనల్ సెమిట్రీలో వెటరన్స్డే కార్యక్రమం జరిగింది. దీనిలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఆయన సతీమణి జెన్నిఫర్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ రికీబురియా, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ప్యాట్రిక్ వీవర్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా కలిసి అమరవీరుడి సమాధి వద్ద నివాళి అర్పించి గ్రూప్ ఫొటో దిగారు. ఆ తర్వాత వారు ఏదో మాట్లాడుకొంటూ బిగ్గరగా నవ్వారు. దీంతో అక్కడ గార్డ్‌గా ఉన్న సైనికుడు స్పందించాడు. ‘‘సందర్శకులు అందరూ నిశ్శబ్దాన్ని, గౌరవప్రదమైన వాతావరణాన్ని కొనసాగించాలి’’ అని చాలా బిగ్గరగా చెప్పాడు. దీంతో ఒక్కసారిగా పీట్ హెగ్సెత్ బృందం నివ్వెరపోయింది. ఆ తరువాత సైలెంట్‌గా అక్కడి నుంచి నిష్క్రమించింది.
సైనికుడిని సమర్థించిన పెంటగాన్
ఈ ఘటనపై పెంటగాన్ ప్రతినిధి సియాన్ పార్నెల్ స్పందించారు. ‘‘ఈ పవిత్రమైన రోజును గుర్తు చేస్తూ.. ఆ సైనికుడు అక్కడి గౌరవాన్ని కొనసాగించాలని సరిగ్గా.. బాధ్యతాయుతంగా చెప్పాడు’’ అని పేర్కొన్నారు.
పీట్ హెగ్సెత్ సందర్శించిన సమాధి మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు, కొరియన్ వార్‌లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన గుర్తు తెలియని సైనికులది. దీనిని అమెరికాలో అత్యంత పవిత్రమైన యుద్ధ స్మారకాల్లో ఒకటిగా భావిస్తారు. దీనికి 1948 నుంచి అమెరికా ఆర్మీలోని 3వ ఇన్ఫాంట్రీ రెజిమెంట్‌లోని గార్డ్లు ఎల్లవేళలా పహారా కాస్తుంటారు. ఈ రెజిమెంట్‌ను అమెరికాలో ‘ది ఓల్డ్ గార్డ్’ అని వ్యవహరిస్తారు. వాస్తవానికి ఈ ఘటనకు ఒక రోజు ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఈ సమాధిని సందర్శించారు.







