ఏఐతో మొండి రోగాలకు చెక్.. ఆంథ్రోపిక్ సీఈవో జోస్యం..!
కృత్రిమ మేధ… ప్రస్తుతం అందరి దృష్టి దీనిపైనే. ఈ రంగం, ఆరంగం అని తేడా లేదు అన్నిరంగాలను ఇది కంట్రోల్ చేస్తోంది. ఖర్చు తడిసిమోపెడవుతున్నా.. దీన్ని ఆపే పరిస్థితి లేదు. ఇది ప్రమాదకరమని..మనుషులకు హానికరమని.. వాటి నిర్వాహకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఇది నాణేనికి ఓవైపు మాత్రమే.. రెండో వైపు చూస్తే.. అనంత ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
కృత్రిమ మేధ వైద్య రంగంలో అద్భుతాలు సృష్టిస్తుందని, అందులో భాగంగా క్యాన్సర్, అల్జీమర్స్, హృద్రోగం, మానసిక సమస్యలు వంటివి మరో పదేళ్లలో అంతరించిపోతాయని ఆంథ్రోపిక్ సంస్థ సీఈవో డారియో అమోడెయ్ ఆశాభావం వ్యక్తంజేశారు. ‘‘కృత్రిమ మేధ జీవశాస్త్ర పరిశోధనల్ని, ఔషధ ఆవిష్కరణల్ని, వైద్యరంగ విజయాలను ఊహించనంత స్థాయిలో వేగవంతం చేస్తుంది. మరో దశాబ్దం లోగా క్యాన్సర్, అల్జీమర్స్, హృద్రోగం, మానసిక సమస్యలు అంతరించి గతకాల జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అదే జరిగితే ఎలా ఉంటుందో ఊహించండి. శతాబ్దాలుగా మానవాళిని పీడించిన సమస్యలకు మనం పరిష్కారం చూపినట్టవుతుంది’’ అని అమోడెయ్ అన్నారు.
ఇది కేవలం అమోడెయ్ ఒక్కరి అభిప్రాయమే కాదు. కృత్రిమ మేధ రంగంలో దిగ్గజాలుగా పేరు గడించిన ఎలాన్ మస్క్, డెమిస్ హస్సాబిస్లదీ ఇదే అభిప్రాయం. పదేళ్లలో జరిగే ఔషధ పరిశోధనలు కృత్రిమ మేధ సాయంతో కొన్ని వారాల్లో పూర్తి చేయవచ్చు. ఇది పదేళ్లలో అన్ని వ్యాధులకూ పరిష్కారం చూపుతుందని హస్సాబిస్ చెబుతున్నారు. 20 కోట్ల ప్రొటీన్ల నిర్మాణాలను నిర్ధారించిన ఆల్ఫాఫోల్డ్ వంటి కృత్రిమమేధ ఆవిష్కరణలు వివిధ రకాల ప్రొటీన్ల నిర్మాణాలను, అవి పనిచేసే విధానాన్ని, వ్యాధి దశలో వాటిలో కలిగే పరివర్తనలను విడమర్చి చెబుతున్నాయి.
సాధారణ పద్ధతుల్లో ప్రొటీన్ నిర్మాణాన్ని నిర్ధారించేందుకు కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల వరకూ పడుతుంది. అలాంటిది ఆల్ఫాఫోల్డ్ కొన్ని నిమిషాల్లో ప్రొటిన్ 3డీ ఆకృతుల్ని మన ముందుంచుతోంది. ఆల్ఫాఫోల్డ్ అనేది ఒక గొప్ప శాస్త్రీయ విజయమని హస్సాబిస్ వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే కృత్రిమ మేధ మరో పదేళ్లలో క్యాన్సర్ వంటి వ్యాధులకు పరిష్కారం చూపుతుందని అమోడెయ్ చెబుతున్నారు. అయితే ఔషధ ఉత్పత్తి సంస్థలు ఈ వాదనను తిరస్కరిస్తున్నాయి. వ్యాధులు పదేళ్లలో అంతమవుతాయనడం అత్యుత్సాహమేనంటున్నాయి.







