రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపనకు భారత్ వ్యూహం..!
ఓవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపనకు అమెరికా ,యూరప్ దేశాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అబుదాబిలో చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో భారత్ కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు న్యూఢిల్లీ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపింది. రష్యా, ఉక్రెయిన్‌తో పాటు ఈ వ్యవహారంలో భాగస్వాములైన ఇతర దేశాలతోనూ అత్యున్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం కనుగొనే దిశగా భారత్ నిరంతరం ప్రయత్నిస్తోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. మాస్కో, కీవ్‌తో పాటు ఇతర సంబంధిత పక్షాలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని, ఈ చర్చలు అత్యున్నత స్థాయిలో జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
మరోవైపు..ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో చర్చలు జరపగా, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సంప్రదింపులు జరిపారు. ఈ పరిణామాలు శాంతి ప్రయత్నాలకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చాయి.
శాంతి ఒప్పందంలో కీలక అంశాలు
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నిలిపివేసేందుకు నల్ల సముద్రంలో నౌకల రాకపోకలను పునరుద్ధరించడం, ధాన్యం, ఇంధన ఎగుమతులకు ఆటంకాలు లేకుండా చూడటం, పరస్పర దాడులకు పాల్పడకుండా ఒప్పందం కుదుర్చుకోవడం వంటి అంశాలు కీలకంగా మారాయి. ఈ అంశాలపై ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరేలా భారత్ ప్రయత్నిస్తోంది.
2022 ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి సైనిక దాడి ప్రారంభించడంతో ఈ యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ఇప్పటివరకు కనీసం 17,968 మంది పౌరులు మరణించారు. యూఎన్‌హెచ్‌సీఆర్, ఐఓఎం గణాంకాల ప్రకారం సుమారు 95 లక్షల మంది ఉక్రేనియన్లు నిరాశ్రయులయ్యారు. వీరిలో 59 లక్షల మంది ఇతర దేశాల్లో శరణార్థులుగా ఉండగా, మరో 36 లక్షల మంది దేశంలోనే సొంత నివాసాలను కోల్పోయారు.







