జెన్సన్ పై గూఢచర్యం ఆరోపణలు.. ఎన్వీడియా, అమెరికా విచారణ..!
అమెరికా చిప్ దిగ్గజం ‘ఎన్విడియా’ సీఈఓ జెన్సన్ హువాంగ్ (Jensen Huang)- అలిస్ హువాంగ్ వ్యవహారం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అలిస్ హువాంగ్‌పై చైనా ‘గూఢచారి’ అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జెన్సన్ హువాంగ్ను ఇరికించేందుకు చైనా గూఢచర్య కుట్ర పన్నిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. వీటిని చైనా (China) ఖండించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, బీజింగ్‌పై బురద చల్లేందుకే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జియాకున్ స్పష్టం చేశారు.
చైనా కోసం సమాచారం సేకరిస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు నిర్ధారించిన ఓ వాణిజ్య అధికారితో తనకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు ఎన్విడియా బోర్డు ముందు జెన్సన్ హువాంగ్ అంగీకరించినట్లు ‘ది న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనాన్ని వెలువరించింది. ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభిస్తున్నట్లు ఎన్విడియా ప్రకటించిందని తెలిపింది. అడ్వాన్స్డ్ చిప్‌లను చైనాకు అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అలిస్ హువాంగ్ అనే చైనా పౌరురాలితో జెన్సన్ హువాంగ్ సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారని, ఆమె బీజింగ్‌కు గూఢచారిగా వ్యవహరిస్తున్నారని ఇటీవల ఇదే వార్తాసంస్థ ప్రచురించిన ఓ కథనాన్ని చైనా ఇప్పటికే ఖండించింది.
మరోవైపు.. చైనా మీడియా ప్రస్తుతం అలిస్ హువాంగ్‌తో జెన్సన్ హువాంగ్ తన సంబంధాన్ని అంగీకరించిన అంశంపైనే ఎక్కువగా దృష్టి సారించింది. అధికారిక మీడియా సంస్థలు కూడా ప్రభుత్వ వాదననే సమర్థిస్తున్నాయి. జెన్సన్పై గూఢచర్య ఆరోపణలకు సంబంధించి వచ్చిన కథనాలు.. అమెరికా- చైనా సంబంధాలను అస్థిరపరిచే లక్ష్యంతో ఉన్నాయని పేర్కొన్నాయి. ‘‘ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటం ప్రారంభమైనప్పుడల్లా.. తెరవెనుక నుంచి ఇలాంటి విమర్శలు వస్తుంటాయి’’ అని చైనా ప్రభుత్వ మీడియా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’ తెలిపింది.







