పవన్ కళ్యాణ్ విడాకులపై ఐటీడీపీ కీలక ప్రకటన..!
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా విభాగమైన ఐటీడీపీ (iTDP) అత్యంత కీలకమైన ప్రకటన విడుదల చేసింది. పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న చర్చలపై ఐటీడీపీ స్పష్టమైన దిశా నిర్దేశం చేసింది. నాయకుల వ్యక్తిగత జీవితాలపై వచ్చే ఎలాంటి వ్యాఖ్యలకైనా ఐటీడీపీ పూర్తిగా దూరంగా ఉంటుందని స్పష్టం చేసింది.
సోషల్ మీడియా వేదికలపై ఎవరైనా సరే వ్యక్తిగత జీవితాలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు లేదా పోస్టులు చేస్తే వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని ఐటీడీపీ గట్టిగా హెచ్చరించింది. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ, ప్రతి ఒక్కరూ అత్యంత గౌరవం, సంయమనం మరియు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు మరియు సోషల్ మీడియా సైనికులకు సూచించింది. నెట్టింట భావోద్వేగాలకు లోనవకుండా హుందాతనాన్ని ప్రదర్శించాలని కోరింది. ఇదే క్రమంలో ఇంటర్నెట్లో కొందరు వ్యక్తులు చేసే వ్యక్తిగత అభిప్రాయాలతో లేదా వ్యక్తిగత అకౌంట్ల నుండి వచ్చే పోస్టులతో ఐటీడీపీకి ఎలాంటి సంబంధం లేదని ఈ ప్రకటనలో స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
కూటమిలోని పార్టీల మధ్య ఉన్న సఖ్యతను దెబ్బతీసేలా ప్రవర్తించవద్దని, కేవలం ప్రభుత్వ సాధించిన విజయాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనే దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేతను కించపరిచేలా సొంత శ్రేణుల నుండి ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా చూసుకోవడానికే ఐటీడీపీ ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. రాజకీయ ప్రత్యర్థులు ఈ వ్యక్తిగత వ్యవహారాన్ని కూటమిలో విభేదాలు సృష్టించడానికి వాడుకోకుండా ఉండాలనే వ్యూహంతోనే ఈ కఠిన నిబంధనలను విధించినట్లు తెలుస్తోంది.







