తెలంగాణలో జనగణన.. ఈసారి మీరే నమోదు!
దశాబ్దన్నర నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. దేశవ్యాప్తంగా జరగబోయే జనగణనకు రూట్ క్లియర్ అయింది. కేంద్ర హోంశాఖ ఇచ్చిన తాజా గైడ్‌లైన్స్ ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మొత్తం కసరత్తును 2027 మార్చి 1 నాటికి పూర్తి చేయాలని కేంద్రం డెడ్‌లైన్ ఫిక్స్ చేసింది. 2014లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయిలో జరుగుతున్న తొలి జనగణన ఇదే కావడం విశేషం. ఇప్పటివరకు మనం 2011 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాత లెక్కల ఆధారంగానే బడ్జెట్లు, పథకాలు నడిపిస్తున్నాం. అందుకే ఈ తాజా లెక్కలు రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారబోతున్నాయి.
ఈసారి జనాభా లెక్కల సేకరణలో సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు. మొట్టమొదటిసారిగా మన వివరాలను మనమే నమోదు చేసుకునే ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ అవకాశాన్ని తీసుకొచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన మొబైల్ యాప్ ద్వారా 2027 జనవరి 10 నుంచి జనవరి 24 వరకు ప్రజలు తమ కుటుంబ సభ్యుల వివరాలన్నీ స్వయంగా ఫోన్ నుంచే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక ఈ ఆన్లైన్ గడువు ముగిసిన వెంటనే, అంటే జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఎన్యూమరేటర్లు నేరుగా ప్రతి ఇంటి తలుపూ తడతారు. సొంతంగా వివరాలు నమోదు చేసుకోని వారి వివరాలు తీసుకోవడంతో పాటు, ఇప్పటికే ఆన్లైన్లో ఎంటర్ చేసిన వివరాలను కూడా సరిచూసి యాప్‌లో అప్డేట్ చేస్తారు.
లెక్కల్లో ఎలాంటి తేడాలు రాకుండా పక్కా పారదర్శకత కోసం 2027 మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు రీ వెరిఫికేషన్ లేదా రివిజనల్ రౌండ్ నిర్వహిస్తారు. ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగి, ర్యాండమ్‌గా ఇళ్లకు వెళ్లి సమాచారాన్ని క్రాస్ చెక్ చేస్తారు. ఒకవేళ సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యం చూపించినా, తప్పుడు వివరాలు రాసినా కఠిన చర్యలు తప్పవని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు.
ఇక ఈ దఫా జనగణనలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం కులం కాలమ్. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, వివిధ ప్రజాసంఘాల నుంచి వచ్చిన భారీ డిమాండ్‌తో కేంద్రం రెండో దశలో కులం కాలమ్‌ను చేర్చింది. ప్రతి పౌరుడిని నేరుగా అడిగి వారి కులం పేరును స్పష్టంగా నమోదు చేస్తారు. కులాల పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా, పేర్లు తారుమారు కాకుండా ఉండేందుకు ఎన్యూమరేటర్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నారు.
తొలిదశలో భాగంగా 2026 మే, జూన్ నెలల్లోనే ఇళ్లు, భవనాలు, యజమానుల పేర్ల సమాచారాన్ని విజయవంతంగా సేకరించారు. ఆ సమయంలో సుమారు 80 వేల మంది ఉద్యోగులు పనిచేశారు. ఇప్పుడు రెండో దశ మరింత లోతుగా జరగాల్సి ఉన్నందున మరో 5 వేల మందిని అదనంగా తీసుకుంటున్నారు. మొత్తం 85 వేల మంది క్షేత్రస్థాయిలోకి దిగుతున్నారు. సగటున ప్రతి గణకుడికి 250 కుటుంబాల బాధ్యతలు అప్పగించారు. గత కొన్నేళ్లలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా పట్టణీకరణ పెరిగింది, అంతర్గత వలసలు విపరీతంగా పెరిగాయి. ఈ తాజా లెక్కలు బయటకు వస్తేనే రాష్ట్రంలో అసలైన సామాజిక, ఆర్థిక ముఖచిత్రం తెలుస్తుంది. భవిష్యత్ సంక్షేమ పథకాలు, బడ్జెట్ కేటాయింపులకు ఈ డేటానే నిజమైన పునాది కానుంది.







