కళ్లు చెదిరే రేటుకు వారణాసి తెలుగు హక్కులు!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కిస్తున్న ప్రిస్టీజియస్ ప్రాజెక్టు వారణాసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) హీరోగా నటిస్తున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. ఇప్పటికే ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. మరోవైపు సినిమా బిజినెస్ వ్యవహారాలు కూడా వేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది ముగిసేలోగా అన్ని ఏరియాల రైట్స్ అమ్మకాలు పూర్తి చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.
తాజాగా వినిపిస్తున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) వారణాసి(Varanasi) తెలుగు థియేట్రికల్ రైట్స్ ను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లోని తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ కలిపి ఏకంగా రూ.290 కోట్లకు డీల్ కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమైతే తెలుగు సినిమా బిజినెస్ చరిత్రలో ఇదొక సంచలన డీల్‌గా నిలిచే అవకాశం ఉంది. మిగిలిన ఏరియాల హక్కుల విక్రయాలపై ప్రస్తుతం డిస్కషన్స్ కంటిన్యూ అవుతున్నట్లు సమాచారం.
ఇక డిజిటల్ రైట్స్ విషయంలోనూ రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థలతో డిస్కషన్స్ జరుపుతూనే, విదేశీ మార్కెట్లలో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఇంటర్నేషనల్ స్టూడియోలతో సంప్రదింపులు సాగిస్తున్నారట. ఇంగ్లీష్‌తో పాటు ఇతర అంతర్జాతీయ భాషల్లోనూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయాలని టీమ్ టార్గెట్ గా పెట్టుకుంది. ప్రియాంక చోప్రా(Priyanka chopra), పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj sukumaran) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ(KL Narayana) నిర్మిస్తున్నారు.







