సౌత్‌పై ప్రేమా.. విమర్శల భయమా?
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్(Jahnvi kapoor) మరోసారి సౌత్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కామెంట్స్ తో వార్తల్లో నిలిచింది. ఇటీవల సౌత్ సినిమా డైరెక్టర్ల పనితీరుపై ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పెద్ది(Peddi) సినిమా ప్రస్తావన సందర్భంగా సౌత్ సినిమాల నిర్మాణ విధానం గురించి ఆమె చేసిన కామెంట్స్ తెలుగు ఆడియన్స్ కు కోపం తెప్పించాయి. సౌత్ సినిమాల్లో ముందుగానే పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసుకోరని, టెక్నికల్ అంశాల విషయంలోనూ కొన్ని లోపాలు ఉంటాయన్నట్లుగా ఆమె మాట్లాడటంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో తాజాగా తన పిన్ని, నటి మహేశ్వరి(Maheswari)తో కలిసి ఓ తమిళ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల చూసిన తమిళ సినిమా గురించి ప్రశ్న ఎదురవగా మొదట పేరు గుర్తుకు రాకపోయినా, మహేశ్వరి సహాయంతో ప్రీతి ముకుందన్(Preethy mukundan) నటించిన బ్లాస్ట్(Blast) సినిమాను ప్రస్తావించింది. అంతేకాకుండా విజయ్(Vijay) నటించిన పోకిరి(Pokiri) తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. ప్రముఖ డైరెక్టర్ వెట్రిమారన్(Vetrimaran) సినిమాలపై ప్రశంసలు కురిపించిన జాన్వీ, తన తండ్రి బోనీ కపూర్(Boney kapoor) నిర్మించిన రీమేక్ సినిమాలను కూడా చూస్తానని, సిద్ధార్థ్(Siddharth), జెనీలియా(Genelia) నటించిన బొమ్మరిల్లు(Bommarillu) సినిమా కూడా తనకు గుర్తుందని చెప్పింది.
అయితే జాన్వీ తాజా కామెంట్స్ పై నెటిజన్ల నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే సౌత్ డైరెక్టర్ల పనితీరుపై విమర్శలు చేసిన ఆమె ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం వెనుక కారణమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. సౌత్ ఆడియన్స్ లో ఏర్పడిన అసంతృప్తిని తగ్గించుకునే ప్రయత్నమా? లేక నిజంగానే సౌత్ సినిమాలపై తనకున్న అభిరుచిని వెల్లడించిందా? అంటూ మాట్లాడుకుంటున్నారు.







