పెళ్లి పీటలెక్కనున్న ప్రియా భవానీ శంకర్!
కోలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రియా భవానీ శంకర్(priya bhavani shankar) త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తన చిరకాల ప్రియుడు రాజ్‌వేల్ రాజ్(Rajvel raj)తో కలిసి పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్న ఈ బ్యూటీ ఇంట ప్రస్తుతం పెళ్లి వేడుకల సందడి మొదలైనట్లు సమాచారం. తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రియా షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. సంప్రదాయ దుస్తుల్లో ప్రియుడు రాజ్వేల్తో కలిసి దిగిన ఫోటోలతో పాటు, చేతులకు మెహందీ పెట్టుకున్న ఫొటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. దీంతో అభిమానుల్లో పెళ్లి సందడి మొదలైంది.
కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎలాంటి హడావుడి లేకుండా చాలా ప్రైవేట్‌గా వివాహ వేడుకలను నిర్వహించుకోవాలని ఈ జంట నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి డేట్, వెన్యూకు సంబంధించిన వివరాలను మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వెలువడకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రియా, రాజ్‌వేల్ ప్రేమకథ కాలేజీ రోజుల నుంచే మొదలైంది. దశాబ్దానికి పైగా తమ రిలేషన్ కొనసాగుతోందని 2024 ఆగస్టులో ఓ ఇంటర్వ్యూలో ప్రియా వెల్లడించింది. అప్పట్లోనే 2025లో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పిన ఆమె, 2022లోనే ఇద్దరూ కలిసి తమ డ్రీమ్ హౌస్ ను కొనుగోలు చేశారు. ఇప్పుడు తాజా పరిణామాలతో వీరి పెళ్లి వార్త మరోసారి తెరపైకి వచ్చింది. త్వరలోనే ఈ జంట తమ పెళ్లిపై అధికారికంగా స్పందిస్తుందేమో చూడాలి.







