సక్రమంగా వస్తే ఓకే.. అక్రమ వలసదారులను వదలమన్న ట్రంప్..!
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఓటమితో తలబొప్పి కట్టిన ట్రంప్ సర్కార్.. ఇప్పుడిప్పుడే కాస్త ఆలోచనలు మొదలుపెట్టింది. వలసదారులపై బహిష్కరణ ఖడ్గం ప్రయోగిస్తూ వస్తున్న ట్రంప్… ఇప్పుడు కొత్త ప్రతిపాదన చేశారు.ఈ అంశంపై డెమోక్రాట్లతో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే అక్రమ వలసదారులకు ఎలాంటి క్షమాభిక్ష ఉండబోదని స్పష్టం చేశారు. సరైన విధానంలోనే దేశంలోకి రావాలని, నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు.
వలసల అంశంపై ఎలాంటి ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని విలేకరులు ప్రశ్నించగా.. డెమోక్రాట్లతో కలిసి పనిచేయడానికి సిద్ధమేనని చెప్పారు. అయితే క్షమాభిక్షకు మాత్రం అవకాశం లేదన్నారు. ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు, గడువు, అర్హతలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి
ఈ సందర్భంగా తన సలహాదారు స్టీఫెన్ మిల్లర్‌ను ట్రంప్ ప్రశంసించారు. ఆయన తెలివైన వ్యక్తి అని, కఠినంగా వ్యవహరిస్తూనే న్యాయంగా నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. డెమోక్రాట్లతోనూ ఆయన కలిసి పనిచేయగలరని అభిప్రాయపడ్డారు.
వెనెజువెలా, ఇరాన్లలో సైనిక చర్యలపై కూడా ట్రంప్ మాట్లాడారు. వెనెజువెలాలో చేపట్టిన ఆపరేషన్ 48 నిమిషాల్లో ముగిసిందని, ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా విజయం సాధించిందని, ఆ దేశ నౌకాదళం, వైమానిక దళం ధ్వంసమయ్యాయని చెప్పారు. ఇరాన్ ఒప్పందానికి సిద్ధంగా ఉందని అన్నారు. అయితే ఈ వాదనలకు స్వతంత్ర ఆధారాలను ఆయన వెల్లడించలేదు.







