ట్రంప్ ‘ఓవర్ యాక్షన్’ రిపబ్లికన్ల కొంప ముంచిందా? అసలేం జరిగింది?
అమెరికా రాజకీయాల్లో ట్రంప్ అంటే నిన్న మొన్నటి వరకూ రిపబ్లికన్లకు తిరుగులేని బ్రాండ్! ఆయన ఒక్కసారి ప్రచారంలోకి దిగితే చాలు.. ప్రత్యర్థులకు టెన్షన్ మొదలయ్యేది. ఆయన మద్దతు ఉందంటే గెలుపుపై ధీమా పెరిగేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోందా? ట్రంప్ పేరు చెప్పుకుని ఎన్నికల బరిలోకి దిగిన రిపబ్లికన్లకే ఓటర్లు షాకివ్వటం, షాకింగ్ గా మారింది. 2026 మధ్యంతర ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ట్రంప్ బ్రాండ్ కు ఎక్కడ దెబ్బబడిందో ఎవరికీ అర్దం కావటం లేదు.
ఓడిపోవటం అంటే అలా ఇలా కాదు…దాదాపు వందేళ్లుగా రిపబ్లికన్లకు కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాల్లో డెమొక్రాట్లు పాగా వేయడం మామూలు విషయం కాదు. ఒకటి కాదు.. వరుసగా కీలక రాష్ట్రాల్లో రిపబ్లికన్ల ఆధిపత్యానికి గండి పడింది. దీనికి ట్రంప్ ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత ఒక కారణమైతే, అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ట్రంప్ చేసిన ఓవర్ ఇంటర్వెన్షన్ మరో కారణమని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రజలు తమ జేబులకు చిల్లులు పడుతున్నాయని ఆందోళన చెందుతుంటే.. ట్రంప్ మాత్రం తన విదేశాంగ విజయాల గురించి డప్పు కొట్టుకోవడంలో బిజీగా ఉన్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
94 ఏళ్ల రికార్డుకు డెమొక్రాట్లు చెక్ పెట్టారు!
ఈ ఎన్నికల్లో కాన్సాస్ ఫలితం ఒక పెద్ద సర్ప్రైజ్. 1932 తర్వాత ఆ రాష్ట్రం నుంచి డెమొక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తి సెనేటర్‌గా ఎన్నిక కాలేదు. అంటే దాదాపు 94 ఏళ్లుగా అక్కడ రిపబ్లికన్లదే హవా. అలాంటి చోట ఇప్పుడు ఆడమ్ హామిల్టన్ రిపబ్లికన్ సిట్టింగ్ సెనేటర్ రోజర్ మార్షల్‌ను ఓడించారు. ఒక్క కాన్సాస్లోనే కాదు.. టెక్సాస్‌లో 34 ఏళ్ల తర్వాత, సౌత్ కరోలినాలో 28 ఏళ్ల తర్వాత డెమొక్రాట్లు విజయాలు నమోదు చేశారు.
ఒహియో, ఐవోవా, నార్త్ కరోలినాలోనూ రిపబ్లికన్లకు ఎదురుదెబ్బలు తగిలాయి. మొత్తంగా ఆరు కీలక సెనేట్ స్థానాల్లో పార్టీ ఆధిపత్యం దెబ్బతిన్నట్లు ఈ విశ్లేషణ చెబుతోంది. డెమొక్రాట్లకు సెనేట్ను తమ చేతుల్లోకి తీసుకోవడానికి నాలుగు రాష్ట్రాల్లో విజయం సరిపోయేది. కానీ అంతకంటే ఎక్కువ స్థానాల్లో పట్టు సాధించడం రిపబ్లికన్లకు ఊహించని షాక్‌గా మారింది.
ట్రంప్ ఎవరికి సపోర్ట్ చేస్తే.. వాళ్లకే మైనస్ అయిందా?
ఈ ఎన్నికల్లో ట్రంప్ జోక్యం ,సపోర్టు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు తమ రాష్ట్రంలోని సమస్యల గురించి మాట్లాడతారు. ప్రజలకు ఏం కావాలి? ధరలు ఎలా ఉన్నాయి? రైతుల పరిస్థితి ఏంటి? ఉద్యోగాల సంగతేంటి? ఇలాంటి విషయాలపై ఫోకస్ పెడతారు. కానీ ట్రంప్ మాత్రం ఈ ఎన్నికలను తన పర్సనల్ ఇమేజ్‌కు లింక్ చేసేశారు.
టెక్సాస్‌లో కెన్ పాక్స్టన్కు ట్రంప్ గట్టిగా మద్దతు ఇచ్చారు. అయితే పాక్స్టన్కు ఇప్పటికే రాజకీయ వివాదాలున్నాయి. 2023లో అవినీతి, అధికార దుర్వినియోగ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై అభిశంసన ప్రక్రియ కూడా మొదలైంది. అయినా ట్రంప్ అండతో ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. కానీ ట్రంప్‌కు విధేయుడిగా ఉండటం ఒక్కటే ఓటర్ల నమ్మకాన్ని సంపాదించడానికి సరిపోలేదు.
సౌత్ కరోలినాలోనూ ఇలాంటి సీనే కనిపించింది. సెనేటర్ లిండ్సే గ్రాహమ్ మరణం తర్వాత ఏర్పడిన ఖాళీ స్థానానికి ట్రంప్ తన సోదరి డార్లీన్ గ్రాహమ్‌కు మద్దతు ఇచ్చారు. రాజకీయ అనుభవం పెద్దగా లేని ఆమె జాతీయ భద్రత, విదేశాంగ విధానం వంటి అంశాలపై ప్రశ్నలు ఎదురైనప్పుడు తడబడ్డారని కథనం పేర్కొంది. దీంతో డెమొక్రాట్లకు అనూహ్యంగా ఛాన్స్ దక్కింది.
కాన్సాస్‌లో రోజర్ మార్షల్ కూడా ట్రంప్ ప్రభుత్వానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. తనకు ఓటు వేయడం అంటే ట్రంప్ అజెండాకు మద్దతు ఇవ్వడమేనన్న రీతిలో ప్రచారం చేశారు. కానీ వ్యవసాయంపై ఆధారపడిన రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి ఉన్న ఓటర్లకు ఈ ప్రచారం కనెక్ట్ కాలేదు. చివరకు అదే ఆయనకు మైనస్ అయిందని విశ్లేషణ చెబుతోంది.
అంటే స్థానిక సమస్యలను పక్కనపెట్టి ట్రంప్ బ్రాండ్ మీదే ఆధారపడటం కొందరు రిపబ్లికన్ అభ్యర్థులకు రివర్స్ అయింది. మద్దతు కోసం ట్రంప్ దగ్గరకు వెళ్లారు కానీ, ఓటర్లు మాత్రం తమదైన నిర్ణయం తీసుకున్నారు.
ప్రజలకు ధరల టెన్షన్.. ట్రంప్‌కు మాత్రం సెల్ఫ్ ప్రమోషన్!
ఒక సాధారణ అమెరికన్ కుటుంబానికి ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటి? ఇంటి అద్దె, కిరాణా ఖర్చులు, పెట్రోల్ ధరలు, గ్యాస్ బిల్లులు. నెలవారీ బడ్జెట్ ఎలా మేనేజ్ చేయాలన్నదే చాలామందికి పెద్ద టాస్క్‌గా మారింది. ఇలాంటి సమయంలో ఓటర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సహజం.
డెమొక్రాట్లు కూడా ఇదే పాయింట్‌ను పట్టుకున్నారు. పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణం, ఇంధన ధరలను ప్రచారంలో ప్రధాన అస్త్రాలుగా మార్చుకున్నారు. ఇరాన్‌తో కొనసాగుతున్న సంఘర్షణ, ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రభావం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పెరిగాయంటూ ప్రజల్లోకి వెళ్లారు.
కానీ ట్రంప్ ఫోకస్ మాత్రం మరోవైపు ఉంది. భారత్, పాకిస్థాన్ మధ్య శాంతి కుదిర్చానంటూ గతంలో చేసిన ప్రకటనలతో సహా తన విదేశాంగ విజయాలను పదేపదే ప్రస్తావించారు. అంతర్జాతీయ స్థాయిలో తాను సాధించిన విజయాల గురించి గొప్పగా చెప్పుకున్నారు. ప్రజలు మాత్రం తమ రోజువారీ ఖర్చుల గురించి ఆలోచిస్తుంటే, ట్రంప్ తన విజయాల ప్రచారంలో ఉండటం రిపబ్లికన్లకు ఇబ్బందిగా మారిందన్నది విశ్లేషణ.
ఇక్కడే అసలు గ్యాప్ కనిపిస్తోంది. ఓటర్లకు కావాల్సింది తమ జీవితాల్లో మార్పు. కానీ ప్రచారంలో కనిపించింది మాత్రం ట్రంప్ పర్సనల్ బ్రాండింగ్. పైగా ఎన్నికలను తన నాయకత్వానికి రెఫరెండంగా మార్చడంతో రిపబ్లికన్ అభ్యర్థులందరూ ట్రంప్ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
అధ్యక్షుడిగా ఉన్నా.. ట్రంప్‌కు ఇక అసలైన టెన్షన్ మొదలైందా?
ఈ ఎన్నికల్లో ఎదురైన ఓటమి వల్ల ట్రంప్ వెంటనే అధ్యక్ష పదవిని కోల్పోరు. ఆయన పదవీకాలం మరో రెండేళ్లు కొనసాగుతుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మూడోసారి అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం కూడా లేదు. కానీ మిగిలిన రెండేళ్లు మాత్రం ఆయనకు అంత ఈజీగా ఉండకపోవచ్చు.
కాంగ్రెస్‌లో డెమొక్రాట్ల ఆధిపత్యం పెరగడంతో ట్రంప్ ప్రభుత్వంపై ప్రశ్నలు, విచారణలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతినిధుల సభ, సెనేట్ కమిటీలపై వారికి నియంత్రణ ఉండటం వల్ల ప్రభుత్వ నిర్ణయాలను నిశితంగా పరిశీలించవచ్చు.
ట్రంప్ కుటుంబ వ్యాపారాలు, క్రిప్టో డీల్స్, ఎలాన్ మస్క్‌కు సంబంధించిన DOGE వ్యవహారాలు, ఎప్స్టీన్ ఫైల్స్ నిర్వహణ వంటి అంశాలు విచారణల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని కథనం చెబుతోంది. ఈ అంశాలపై డెమొక్రాట్లు ఇప్పటికే ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషణ పేర్కొంది. విచారణలు మొదలైతే ట్రంప్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తప్పకపోవచ్చు.
ఇంకోవైపు వలసల నియంత్రణ, ప్రభుత్వ ఖర్చుల కోతలు, గ్రీన్ ఎనర్జీ సబ్సిడీల తొలగింపు వంటి ట్రంప్ ప్రభుత్వ ప్రణాళికలకు కూడా బ్రేకులు పడవచ్చు. కాంగ్రెస్ మద్దతు లేకుండా పెద్ద పెద్ద చట్టాలను ముందుకు తీసుకెళ్లడం అంత సులభం కాదు. సెనేట్‌లోనూ డెమొక్రాట్ల ఆధిపత్యం ఉండటంతో సంప్రదాయవాద న్యాయమూర్తుల నియామకాల విషయంలో కూడా ట్రంప్‌కు అడ్డంకులు ఎదురుకావచ్చు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







