Nike పై నిషేధం: కొనకూడదు, అమ్మకూడదు, ధరించకూడదు! ఎక్కడ, ఎందుకు?
నైక్ షూస్ వేసుకోవడం అంటే స్టైల్‌కు సింబల్‌గా చాలా మంది భావిస్తారు. జిమ్‌కు వెళ్లినా, క్రికెట్ ఆడినా, రోజువారీ ఫ్యాషన్‌లో భాగంగా ధరించినా.. నైక్ లోగో కనిపిస్తే చాలు, అది ఒక బ్రాండ్ స్టేట్‌మెంట్‌లా ఫీలవుతారు. అయితే ఇప్పుడు ఇదే లోగో ఒక దేశంలో మతపరమైన వివాదానికి కారణమైంది. నైక్ పేరు ఉన్న దుస్తులు కొనొద్దు, అమ్మొద్దు, చివరకు వాటిని ధరించొద్దు అంటూ లిబియాలోని లో ఫత్వా జారీ చేసారు. ఇంతకీ ఒక స్పోర్ట్స్ బ్రాండ్ లోగోకు, మత విశ్వాసాలకు మధ్య వచ్చిన గొడవేంటి?
నైక్ లోగో పై వివాదం ఇదే!
లిబియా రాజధాని ట్రిపోలీ కేంద్రంగా పనిచేసే దార్ అల్ ఇఫ్తా (Dar al-Ifta) అనే ఇస్లామిక్ మత సంస్థ ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. బీబీసీ సహా అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ ఫత్వాకు లిబియా గ్రాండ్ ముఫ్తీ సాదిక్ అల్-ఘరియానీ ఆమోదం తెలిపారు. నైక్ బ్రాండ్ పేరు, దాని లోగో వెనుక ఉన్న చరిత్రే ఈ నిర్ణయానికి కారణమని సంస్థ చెబుతోంది.
నిజానికి నైక్ అనే పేరు గ్రీకు పురాణాల్లో విజయానికి ప్రతీకగా భావించే దేవత పేరు నుంచి వచ్చింది. కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన స్వూష్ (Swoosh) లోగో కూడా ఆ దేవత రెక్కల ఆకృతి నుంచి స్ఫూర్తి పొందిందని చెబుతారు. ఈ విషయాన్నే లిబియాలోని మత సంస్థ తప్పుబడుతోంది. ప్రాచీన గ్రీకు దేవతకు సంబంధించిన చిహ్నాన్ని తమ దుస్తులపై పెట్టుకుని తిరగడం అంటే, ఆ దేవతకు సంబంధించిన గుర్తును ప్రోత్సహించినట్లేనని వాదిస్తోంది.
ఇస్లాం మతం ఏకదైవారాధనను నమ్ముతుంది. అల్లాహ్ తప్ప మరే ఇతర దేవుళ్లను ఆరాధించడాన్ని అంగీకరించదు. అలాంటప్పుడు మరో మతానికి, ముఖ్యంగా బహుదైవారాధనకు సంబంధించిన చిహ్నాన్ని ఉపయోగించడం ఎలా సమర్థనీయమని దార్ అల్ ఇఫ్తా ప్రశ్నిస్తోంది. అందుకే నైక్ లోగో ఉన్న ఉత్పత్తులను కొనడం, అమ్మడం, ధరించడం కూడా అనుమతించరాదని ఫత్వా ఇచ్చింది.
ఇజ్రాయెల్ అంశాన్ని కూడా తెరపైకి తెచ్చిన మత సంస్థ
నైక్‌పై అభ్యంతరాలు కేవలం గ్రీకు పురాణాల దగ్గరే ఆగలేదు. ఈ కంపెనీ ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తోందని కూడా దార్ అల్ ఇఫ్తా ఆరోపించింది. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చే కంపెనీల ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. అయితే నైక్ ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తోందన్న ఆరోపణకు సంబంధించి ఎలాంటి నిర్దిష్ట ఆధారాలను సంస్థ బయటపెట్టలేదు.
నైక్ మాత్రమే కాదు.. మరో లగ్జరీ బ్రాండ్ కూడా ఈ జాబితాలో ఉంది!
ఇలాంటి వివాదం లిబియాలో ఇప్పుడే మొదలైందనుకోవద్దు. గతేడాది నవంబర్‌లో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ వాన్ క్లీఫ్ అండ్ ఆర్పెల్స్ (Van Cleef & Arpels) విషయంలోనూ ఇదే తరహా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఆ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపుగా ఉండే నాలుగు ఆకుల క్లోవర్ డిజైన్‌ను ధరించడం కూడా ఇస్లామిక్ సిద్ధాంతాలకు విరుద్ధమని అప్పట్లో దార్ అల్ ఇఫ్తా ప్రకటించింది. క్రైస్తవ సంప్రదాయంలో ఈ నాలుగు ఆకులు విశ్వాసం, ఆశ, ప్రేమ, అదృష్టానికి ప్రతీకలుగా భావిస్తారని పేర్కొంది. ముఖ్యంగా అదృష్టం కలిసిరావాలని కోరుకోవడం ఇస్లామిక్ బోధనలకు విరుద్ధమని వాదించింది.
ఫత్వా ఇచ్చారంటే అరెస్ట్ చేస్తారా? శిక్షలు ఉంటాయా?
ఫత్వా అంటే ప్రభుత్వం తీసుకునే చట్టపరమైన నిర్ణయం కాదు. ఇస్లామిక్ మత సిద్ధాంతాల ఆధారంగా మతపరమైన సంస్థ ఇచ్చే తీర్పు లేదా మార్గదర్శకం మాత్రమే. కాబట్టి నైక్ లోగో ఉన్న టీషర్ట్ వేసుకున్నారని పోలీసులు అరెస్ట్ చేస్తారని, దుకాణాల్లో నైక్ వస్తువులు అమ్మితే శిక్షలు పడతాయని ఇప్పుడే అనుకోవాల్సిన అవసరం లేదు.
అయితే లిబియా సమాజంలో మత సంస్థల నిర్ణయాలకు గణనీయమైన ప్రభావం ఉంటుంది. అందుకే చట్టపరమైన నిషేధం లేకపోయినా, ఈ ఫత్వా స్థానిక వ్యాపారులు, వినియోగదారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ వివాదంపై నైక్ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







