భారతీయులపై విషం చిమ్మారు.. చివరకు ఓటర్లే బుద్ధి చెప్పారు!
అమెరికాలో భారతీయులపై వ్యతిరేకతను రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలనుకున్న రిపబ్లికన్లకు ఈ ఎన్నికలు ఊహించని ఫలితాన్ని ఇచ్చాయి. H-1B వీసాలపై వచ్చే భారతీయ ఉద్యోగుల నుంచి అమెరికా యూనివర్సిటీల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల వరకు.. చాలామందిని లక్ష్యంగా చేసుకుని సాగిన విద్వేష ప్రచారం ఇప్పుడు ఆ పార్టీకి రాజకీయంగా పెద్ద దెబ్బ కొట్టింది. ముఖ్యంగా టెక్సాస్‌లో భారతీయులపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి బో ఫ్రెంచ్ ఓటమి ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది.
అమెరికా 2026 ఎన్నికల్లో డెమోక్రాట్లు సాధించిన విజయాల మధ్య మరో కీలక పరిణామం కనిపించింది. ఆసియా అమెరికన్ ఓటర్లు రిపబ్లికన్ల నుంచి దూరమై డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు పెంచిన ఈ ఓటర్లలో ఇప్పుడు వచ్చిన మార్పు రిపబ్లికన్ నాయకత్వానికి ఆలోచన కలిగిస్తోంది. అమెరికాలో అత్యంత వేగంగా పెరుగుతున్న జాతి సమూహాల్లో ఒకటైన ఆసియా అమెరికన్ల మద్దతు కోల్పోవడం ఆ పార్టీకి చిన్న విషయం కాదు.
భారతీయులపై కోపం.. రిపబ్లికన్లకు ఎందుకు?
అమెరికాలో గత రెండేళ్లుగా ఒక విచిత్రమైన రాజకీయ చర్చ నడుస్తోంది. అక్కడి కంపెనీలు అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా భారత్, చైనా వంటి దేశాల నుంచి ఉద్యోగులను తీసుకొస్తున్నాయన్నది కొందరు కన్జర్వేటివ్ నాయకుల ఆరోపణ. ముఖ్యంగా H-1B వీసాలపై వస్తున్న భారతీయ టెక్ ఉద్యోగులే వారి విమర్శలకు ప్రధాన లక్ష్యంగా మారారు. విదేశీ ఉద్యోగుల వల్ల అమెరికాలో పుట్టినవారికి అవకాశాలు తగ్గిపోతున్నాయని, కంపెనీలు స్థానిక ఉద్యోగులను పక్కన పెడుతున్నాయని ప్రచారం చేశారు.
ఈ వాదనకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా పలువురు రిపబ్లికన్ నాయకులు కూడా మద్దతుగా మాట్లాడారు. అయితే ఉద్యోగాల గురించి మొదలైన చర్చ కాస్తా భారతీయుల ఉనికినే ప్రశ్నించే స్థాయికి చేరింది. అమెరికా యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్థులు ఎక్కువగా కనిపించినా, వ్యాపారాల్లో భారతీయులు విజయాలు సాధించినా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. అంటే అమెరికాలో కష్టపడి ఎదగడం కూడా కొందరి దృష్టిలో తప్పయిపోయిందన్నమాట!
భారతీయ విద్యార్థులపై బో ఫ్రెంచ్ వ్యాఖ్యలు.. చివరకు ఓటమి!
ఈ విషయంలో టెక్సాస్ రిపబ్లికన్ అభ్యర్థి బో ఫ్రెంచ్ వ్యవహారం పెద్ద వివాదంగా మారింది. టెక్సాస్ రైల్వే కమిషనర్ పదవికి పోటీ చేసిన ఆయన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లోని దక్షిణాసియా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. యూనివర్సిటీలో విదేశీయుల సంఖ్యపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అమెరికన్ల అవకాశాలను విదేశీయులు ఆక్రమిస్తున్నారనే భావన కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్టులపై సొంత పార్టీ నాయకులతో పాటు డెమోక్రాట్లు కూడా విమర్శలు గుప్పించారు.
అయితే ఎన్నికల ఫలితాలు ఫ్రెంచ్కు అనుకూలంగా రాలేదు. డెమోక్రటిక్ అభ్యర్థి జాన్ రోసెంతల్ ఆయనను ఓడించి టెక్సాస్ రైల్వే కమిషన్‌లో స్థానం సంపాదించారు. ఈ సంస్థకు టెక్సాస్‌లోని భారీ చమురు, సహజవాయువు పరిశ్రమల నియంత్రణ బాధ్యతలు ఉంటాయి. ఈ విజయం మరో ప్రత్యేకతను కూడా సంతరించుకుంది. దశాబ్దాలుగా రిపబ్లికన్ల ఆధిపత్యంలో ఉన్న ఈ సంస్థలోకి డెమోక్రాట్లు తిరిగి అడుగుపెట్టారు. రోసెంతల్ తన విజయాన్ని విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా అభివర్ణించారు.
వివేక్ రామస్వామి మాటల్లో కనిపించిన ఆవేదన!
మరోవైపు, భారతీయ సంతతికి చెందిన ప్రముఖ రిపబ్లికన్ నాయకుడు వివేక్ రామస్వామికి కూడా ఈ ఎన్నికల్లో పరాజయం తప్పలేదు. ఒహాయో గవర్నర్ పదవికి పోటీ చేసిన ఆయన డెమోక్రటిక్ అభ్యర్థి అమీ ఆక్టన్ చేతిలో ఓడిపోయారు. డొనాల్డ్ ట్రంప్ మద్దతు, జేడీ వాన్స్ ప్రచారంలో పాల్గొనడం, భారీ స్థాయిలో ఎన్నికల ఖర్చు పెట్టడం కూడా ఆయనకు విజయాన్ని అందించలేకపోయాయి.
ఓటమి తర్వాత రామస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రత్యేకంగా చర్చకు వస్తున్నాయి. అమెరికా భవిష్యత్తు దిశపై తనకు తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయని ఆయన చెప్పారు. భిన్నమైన నేపథ్యాలున్న ప్రజలను కొన్ని ఆదర్శాల ఆధారంగా ఒక్కటి చేసిన దేశం అమెరికా అని గుర్తుచేశారు.
అమెరికా వ్యవస్థాపకులు విశ్వసించినట్లుగా మనుషులందరూ సమానంగా సృష్టించబడ్డారని తాను నమ్ముతున్నానని అన్నారు. ఆయన తన ప్రసంగంలో భారతీయులపై వివక్షను నేరుగా ప్రస్తావించలేదు. అయినప్పటికీ, అమెరికా సమానత్వ ఆదర్శాలను గుర్తుచేయడం ప్రస్తుత రాజకీయ వాతావరణంపై ఆయన ఆందోళనను ప్రతిబింబించింది.
భారతీయుల్ని తక్కువ అంచనా వేస్తే కుదరదు!
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఉంది. అమెరికాలో భారతీయులు కేవలం ఉద్యోగులుగానో, విద్యార్థులుగానో మాత్రమే లేరు. వ్యాపారవేత్తలుగా, టెక్నాలజీ నిపుణులుగా, వైద్యులుగా, రాజకీయ నాయకులుగా కూడా తమ స్థానాన్ని సంపాదించుకున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలోనూ వారి పాత్ర పెరుగుతోంది. అలాంటి సమయంలో వారిని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేయడం ఎంతవరకు ఉపయోగపడుతుందన్న ప్రశ్న ఇప్పుడు రిపబ్లికన్ల ముందుంది.
ఒకప్పుడు అమెరికా కలను నిజం చేసుకోవడానికి భారత్ నుంచి వేలాది మంది వెళ్లేవారు. ఇప్పుడు అక్కడే స్థిరపడి, పిల్లలను చదివించి, వ్యాపారాలు నిర్మించి, రాజకీయాల్లోనూ తమ గొంతు వినిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో వారి విజయాలను చూసి భయపడాలా? లేక అమెరికా బలానికి వాటిని మరో ఉదాహరణగా తీసుకోవాలా? అమెరికా రాజకీయ నాయకులు తేల్చుకోవాల్సిన ప్రశ్న ఇదే. భారతీయులపై విద్వేషం రెచ్చగొట్టి ఓట్లు సంపాదించాలనుకుంటే.. ఇకపై ఓటర్లే గట్టిగా బదులిస్తారనే సంకేతం ఈ ఎన్నికలు ఇచ్చాయా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల







