అమెరికాలో డెమోక్రాట్ల స్వీప్.. భారతీయుల H-1B కష్టాలకు ఇక చెక్ పడుతుందా?
అమెరికాలో ఉన్న వేలాది మంది భారతీయులకు ఇప్పుడు ఒక కొత్త ఆశ మొదలైంది. ఇప్పటివరకు H-1B వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు భారత ఐటీ నిపుణులను ఆందోళనకు గురిచేశాయి. ముఖ్యంగా కొత్త H-1B దరఖాస్తులపై లక్ష డాలర్ల ఫీజు విధించాలన్న నిర్ణయం అమెరికా కలను ఖరీదైన వ్యవహారంగా మార్చేసింది. అయితే ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో వచ్చిన మార్పు ఈ పరిస్థితిని మార్చగలదా?
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు ప్రతినిధుల సభతో పాటు సెనేట్ను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కాంగ్రెస్‌లో రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది జనవరి నుంచి రెండు సభల్లోనూ డెమోక్రాట్ల ఆధిపత్యం మొదలవుతుంది. ఇది ట్రంప్ వలస విధానాలకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతీయులపై ప్రభావం చూపుతున్న H-1B వీసా నిబంధనలు, భారీ ఫీజుల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం డెమోక్రాట్లకు లభిస్తుంది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలు భారతీయ ఉద్యోగార్థులకు ఎలాంటి అవకాశాలు కల్పించగలవో చూద్దాం.
లక్ష డాలర్ల ఫీజు.. భారతీయులకే ఎందుకంత భారం?
అమెరికాలో ఐటీ, ఇంజినీరింగ్, పరిశోధన వంటి రంగాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే విదేశీయులకు H-1B వీసా ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ నిపుణులకు ఇది అమెరికాలో ఉద్యోగం సంపాదించేందుకు ప్రధాన మార్గాల్లో ఒకటి. H-1B వీసా ఆమోదాల్లో భారతీయుల వాటా ఎక్కువగా ఉండటంతో అమెరికా తీసుకునే ప్రతి కొత్త నిర్ణయం మనవాళ్లపై ప్రభావం చూపుతోంది.
2025 సెప్టెంబర్‌లో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ ఆందోళనను మరింత పెంచింది. అమెరికా వెలుపల ఉన్న కొందరు కొత్త H-1B అభ్యర్థులకు లక్ష డాలర్ల ఫీజు విధించింది. సాధారణ వీసా ప్రాసెసింగ్ ఖర్చులకు ఇది అదనం. దీంతో అమెరికా కంపెనీలు భారతీయ ఉద్యోగులను నియమించుకోవాలంటే భారీ మొత్తాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
2025 ఆర్థిక సంవత్సరంలో ఆమోదం పొందిన H-1B పిటిషన్లలో భారతదేశంలో జన్మించిన అభ్యర్థుల వాటా 69.9 శాతంగా ఉంది. అందుకే ఈ ఫీజు నిర్ణయం భారతీయ ఐటీ నిపుణుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది.
కోర్టు అడ్డంకులతో ఫీజుకు బ్రేక్ పడిందా?
లక్ష డాలర్ల ఫీజు నిర్ణయంపై అమెరికాలోనే న్యాయపరమైన వివాదం మొదలైంది. 20 రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేశాయి. మసాచుసెట్స్ ఫెడరల్ కోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఫీజు పన్ను స్వరూపంలో ఉందని, అలాంటి పన్ను విధించే అధికారం అధ్యక్షుడికి కాకుండా కాంగ్రెస్‌కే ఉంటుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
జూలై 24, 2026 నుంచి ఈ ఫీజు వసూలుపై కోర్టు అడ్డంకులు కొనసాగుతున్నాయి. అయితే సెప్టెంబర్ 18న ట్రంప్ ప్రభుత్వం మరో ప్రకటన ద్వారా ఈ నిబంధనను 2027 సెప్టెంబర్ 21 వరకు పొడిగించింది. దీంతో ఈ వ్యవహారం ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు.
ఇప్పుడు కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల ఆధిపత్యం ఏర్పడటంతో ఈ అంశంపై మరింత చర్చ జరిగే అవకాశం ఉంది. ఫీజు వల్ల అమెరికా కంపెనీలకు ఎంత భారం పడుతోంది? విదేశీ ఉద్యోగుల నియామకాలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? వంటి ప్రశ్నలను వారు లేవనెత్తవచ్చు.
డెమోక్రాట్లు గెలిచారు.. ఫీజు రద్దు చేస్తారా?
భారతీయులకు ప్రస్తుతం ఉన్న ప్రధాన ఆశ ఇదే. రెండు సభల్లోనూ మెజారిటీ సాధించిన డెమోక్రాట్లు H-1B ఫీజును తగ్గించే లేదా రద్దు చేసే ప్రయత్నం చేయవచ్చు. కానీ అందుకు చట్టపరమైన ప్రక్రియ అవసరం. రెండు సభల్లో బిల్లు ఆమోదం పొందినా ట్రంప్ దాన్ని వీటో చేసే అవకాశం ఉంది. ఆ వీటోను అధిగమించాలంటే రెండు సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి.అయితే ట్రంప్ ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెరిగే అవకాశం మాత్రం ఉంది.
ఇప్పటికే అమెరికాలో ఉన్న భారతీయులకూ ఈ ఫీజు వర్తిస్తుందా?
లక్ష డాలర్ల ఫీజు ప్రతి H-1B వీసాదారుడికీ వర్తించే సాధారణ ఛార్జీ కాదు. ప్రధానంగా అమెరికా వెలుపల ఉన్న వ్యక్తుల కోసం దాఖలు చేసే కొన్ని కొత్త H-1B పిటిషన్లకు సంబంధించినది. ఇప్పటికే అమెరికాలో H-1B హోదాలో పనిచేస్తున్నవారి సాధారణ పొడిగింపులకు ఇది ఆటోమేటిక్‌గా వర్తించదు.
అయితే ఉద్యోగం మారడం, వీసా పొడిగింపు, విదేశాలకు వెళ్లి తిరిగి రావడం వంటి సందర్భాల్లో వ్యక్తిగత పరిస్థితులను బట్టి నిబంధనలు మారవచ్చు. అందుకే ఇప్పటికే అమెరికాలో ఉన్నవారు, కొత్తగా వెళ్లాలనుకునేవారు తమ పరిస్థితులకు వర్తించే నిబంధనలను విడిగా పరిశీలించాలి.
లాటరీ విధానంలోనూ మార్పులు.. ఫ్రెషర్లకు కొత్త సవాళ్లు!
H-1B వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో మార్పు ఎంపిక విధానానికి సంబంధించినది. గతంలో అర్హులైన అభ్యర్థులను ప్రధానంగా లాటరీ ద్వారా ఎంపిక చేసేవారు. కానీ కొత్త విధానంలో అధిక వేతనం పొందే ఉద్యోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వెయిటెడ్ సెలక్షన్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇది 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి వచ్చింది.
అందుకే కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు H-1B విధానాలపై ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది భారత ఐటీ రంగానికి కూడా కీలకం.
భారతీయులకు ఊరట ఎప్పటికి?
మొత్తంగా చూస్తే అమెరికా ఎన్నికల ఫలితాలు H-1B వీసాల విషయంలో కొత్త చర్చకు అవకాశం కల్పించాయి. ట్రంప్ నిర్ణయాలపై కాంగ్రెస్‌లో ప్రశ్నలు పెరగవచ్చు. లక్ష డాలర్ల ఫీజుపై కొనసాగుతున్న న్యాయపరమైన వివాదం, కొత్త లాటరీ విధానం, విదేశీ నిపుణుల నియామకాలపై కంపెనీల ఆందోళనలు.. ఇవన్నీ రాబోయే రోజుల్లో చర్చకు వచ్చే అంశాలే.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







