వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా యూఎఫ్ సీ చీఫ్ డేనా వైట్..!
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఓటమి తర్వాత అధ్యక్షుడు ట్రంప్.. తన వైట్ హౌస్ స్టాఫ్ లో కీలక మార్పులు చేస్తున్నారు. దీనిలో భాగంగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవికి..మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) సంస్థ ‘అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్’ (యూఎఫ్‌సీ) చీఫ్ డేనా వైట్ పేరు ప్రతిపాదించారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఆయన్ను ట్రంప్ స్వయంగా ఆహ్వానించారు. ఈ అనూహ్య ప్రతిపాదనతో అమెరికా రాజకీయ, క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
శనివారం తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. “గొప్ప వ్యక్తి, ఒక వయొలెంట్ ఫైటర్, యోధుడు అయిన డేనా వైట్‌కు యునైటెడ్ స్టేట్స్ ప్రెస్ సెక్రటరీ ఉద్యోగాన్ని ఆఫర్ చేసినట్లు ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. డేనా, దయచేసి ఈ ఉద్యోగాన్ని స్వీకరించు!” అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. వైట్‌హౌస్ కూడా తన అధికారిక ఖాతాలో ట్రంప్ పోస్ట్‌ను షేర్ చేయడం ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యం కల్పించింది.
ట్రంప్ ఆఫర్‌పై డేనా వైట్ నేరుగా స్పందించనప్పటికీ, ఒక ఆసక్తికరమైన పోస్ట్‌తో దీనికి బలం చేకూర్చారు. వైట్‌హౌస్ ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌లోని పోడియం వెనుక తాను నిలబడి ఉన్న ఫొటోను షేర్ చేసి, “తదుపరి అధ్యాయానికి సిద్ధం” అని క్యాప్షన్ జోడించారు. దీంతో ఆయన ఈ పదవిని స్వీకరించే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు బలపడ్డాయి. కేవలం వారం రోజులకే కేటీ జకారియా ఆ పదవి నుంచి తప్పుకోవడంతో అక్టోబర్ 16 నుంచి వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పోస్టు ఖాళీగా ఉంది.
ట్రంప్, 57 ఏళ్ల డేనా వైట్ చాలా కాలంగా సన్నిహిత మిత్రులు. తన ‘మాగా’ (MAGA) బ్రాండ్ రాజకీయాలను, ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న యూఎఫ్సీతో ముడిపెట్టడానికి ట్రంప్ తరచూ ప్రయత్నిస్తుంటారు. 2024లో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా గెలిచినప్పుడు ఆయన విజయ ప్రసంగంలో డేనా వైట్ కూడా పక్కనే ఉన్నారు. అంతకుముందు ట్రంప్ 80వ పుట్టినరోజున వైట్‌హౌస్ సౌత్ లాన్లో యూఎఫ్‌సీ కేజ్ ఫైట్‌ను నిర్వహించడం వారి స్నేహానికి నిదర్శనంగా చెప్పవచ్చు
ఈ ప్రతిపాదనతో పాటు ఆరుగురు యూఎఫ్‌సీ ఫైటర్లను వైట్‌హౌస్‌కు సలహాదారులుగా తీసుకురావాలని, వారిలో కొందరు విదేశీయులైనా పర్వాలేదని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. వీరిలో ఇద్దరు రష్యా, ఒకరు బ్రెజిల్ ఫైటర్లు ఉన్నారు.







