జాతీయ స్థాయిలో ఏపీ మున్సిపల్ శాఖ సంచలనం..!
ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జాతీయ స్థాయిలో మరోసారి ఘన కీర్తిని సాధించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డులలో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 6 జాతీయ అవార్డులను కైవసం చేసుకుని దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. రాష్ట్రంలోని ఐదు ప్రధాన నగరపాలక సంస్థలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నియోజకవర్గ కేంద్రమైన కుప్పం మున్సిపాలిటీకి ఈ జాతీయ అవార్డులు లభించడం విశేషం. ఈ అద్భుతమైన విజయం పట్ల రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ హర్షం వ్యక్తం చేసారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించిన తాజా వివరాల ప్రకారం.. స్వచ్ఛత, పారిశుధ్య నిర్వహణ, పట్టణాల పరిశుభ్రత, వినూత్న కార్యక్రమాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ఈ పురస్కారాలు దక్కాయి. రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమహేంద్రవరం మరియు తిరుపతి నగరపాలక సంస్థలు ఈ జాతీయ అవార్డుల జాబితాలో నిలిచాయి. వీటితో పాటు గ్రేడ్-3 మున్సిపాలిటీ కేటగిరీలో కుప్పం మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుని అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డులను నవంబర్ 11న న్యూఢిల్లీలో జరిగే అధికారిక ప్రదానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందజేయనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రంలో ‘స్వచ్ఛ మున్సిపాలిటీ’ల స్థాపనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజా భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం పట్టణ పారిశుధ్య రూపురేఖలను మారుస్తోందని ఆయన వివరించారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డులు రావడానికి అహర్నిశలూ శ్రమించిన మున్సిపల్ అధికారులు, కమీషనర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు నగరాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించిన పారిశుధ్య కార్మికులకు మంత్రి నారాయణ తన ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు.
రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలను పూర్తిస్థాయిలో డంపింగ్ యార్డ్ రహిత ప్రాంతాలుగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. ప్రతి నెల మూడో శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలే నేడు జాతీయ స్థాయిలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టాయని అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో వరుసగా అవార్డులు సొంతం చేసుకుంటూ జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మరోసారి తన సత్తా చాటడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ మరియు ప్రశంసల జల్లు కురుస్తోంది.







