బొండపల్లిలో వర్కౌట్ అయిన మంత్రి కొండపల్లి గ్రౌండ్ లెవెల్ స్కెచ్..!
విజయనగరం జిల్లా బొండపల్లి పరిషత్ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని సరికొత్త రాజకీయ సంచలనం నమోదైంది. ఈ నియోజకవర్గంలో దశాబ్దాలుగా తిరుగులేని పట్టున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుటుంబానికి గట్టి రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. భారీ రాజకీయ నేపథ్యం, అంగబలం, అర్థబలం ఉన్న బొత్స కుమార్తె అనూషపై తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగిన ఒక సామాన్య మహిళ పాశల నీరజ ఏకంగా 5,136 ఓట్ల భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు.
ఈ చారిత్రాత్మక విజయం వెనుక రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Kondapalli Srinivas) పక్కా ప్రణాళికతో నడిపిన క్షేత్రస్థాయి ఎన్నికల వ్యూహమే ప్రధాన కారణంగా నిలిచింది. సాధారణంగా పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాల అభ్యర్థులు బరిలో ఉన్నప్పుడు ఆర్భాటపు ప్రచారాలు, భారీ సభలు నిర్వహించడం చూస్తుంటాం. కానీ, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆ సంప్రదాయానికి భిన్నంగా గ్రౌండ్ లెవెల్లో గట్టి స్కెచ్ వేశారు. కూటమి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలను సమర్థవంతంగా సమన్వయం చేస్తూ, ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో నేరుగా మమేకమయ్యేలా ప్రచారాన్ని నడిపించారు.
రాజకీయ పలుకుబడి, వారసత్వ హోదా కంటే తమకు నిరంతరం అందుబాటులో ఉండే ఒక సాధారణ మహిళే ఉత్తమమని బొండపల్లి ఓటర్లు ఈ తీర్పు ద్వారా నిరూపించారు. ఊహించని రీతిలో భారీ మెజారిటీతో పాశల నీరజ గెలవడంతో బొండపల్లి మండలవ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ ఫలితం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీయడమే కాకుండా, రాబోయే రోజుల్లో కూటమి మరింత బలోపేతం కావడానికి గట్టి పునాది వేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.







