పల్నాడులో కూటమి ప్రభంజనం..!
ఆంధ్రప్రదేశ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ పరిషత్ ఎన్నికల ఫలితాల్లో పల్నాడు జిల్లాలో అధికార కూటమి తిరుగులేని విక్టరీని నమోదు చేసింది. జిల్లావ్యాప్తంగా ఎన్నికలు జరిగిన మొత్తం 10 జెడ్పీటీసీ స్థానాల్లోనూ తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించి ప్రత్యర్థులను క్లీన్ స్వీప్ చేశారు. పల్నాడు ఫ్యాక్షన్ రాజకీయ కోటలో కూటమి శ్రేణులు సాధించిన ఈ విజయకేతనం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
నిజానికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలోనే పల్నాడు జిల్లాలోని మొత్తం 28 జెడ్పీటీసీ(ZPTC Results) స్థానాలకు గాను ఏకంగా 18 చోట్ల కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఇక మిగిలిన 10 స్థానాలకు జరిగిన పోలింగ్‌లోనూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా దక్కకుండా కూటమి అభ్యర్థులు పూర్తి పట్టు సాధించారు. జిల్లా పరిషత్ పీఠంపై పసుపు-కాషాయ-సేన జెండాను ఎగురవేయడానికి ఈ ఫలితాలు మార్గం సుగమం చేశాయి. జెడ్పీటీసీ స్థానాల్లోనే కాకుండా గ్రామీణ స్థాయి ఎంపీటీసీ స్థానాల్లోనూ కూటమి ప్రభంజనం స్పష్టంగా కనిపించింది.
పల్నాడు జిల్లా(Palnadu District) పరిధిలోని మొత్తం 419 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏకంగా 400కు పైగా స్థానాలను కూటమి అభ్యర్థులు తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో జిల్లాలోని మెజారిటీ మండల పరిషత్ పీఠాలు కూడా కూటమి పరమవబోతున్నాయి. ఈ చారిత్రాత్మక విజయంతో నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పటాసులు కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ భారీ విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.







