అప్పట్లో వివాదంతో వదిలేసిన టైటిల్.. 23 ఏళ్ల తర్వాత మళ్లీ పట్టుకున్న కమల్!
ఒకసారి వివాదంలో చిక్కుకున్న టైటిల్‌ను మళ్లీ ముట్టుకోవాలంటే ఎవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అప్పట్లో ఎదురైన విమర్శలు, నిరసనలు గుర్తొచ్చి ఆ పేరు జోలికే వెళ్లరు. కానీ కమల్ హాసన్ మాత్రం అలాంటి లెక్కలేవీ వేసుకున్నట్లు కనిపించడం లేదు. 23 ఏళ్ల క్రితం తమిళనాడులో పెద్ద దుమారమే రేపి, చివరకు తన సినిమా నుంచి తొలగించాల్సి వచ్చిన టైటిల్‌నే ఇప్పుడు మళ్లీ బయటకు తీశారు. ఇన్నేళ్ల తర్వాత కమల్‌కు ఆ పేరే ఎందుకు గుర్తొచ్చింది? అప్పట్లో వదులుకున్న టైటిల్‌ను ఇప్పుడు మళ్లీ పట్టుకోవడం వెనుక కథేంటి?
కమల్ హాసన్ కొత్త సినిమా టైటిల్ ప్రకటించగానే ఇప్పుడు ఈ పాత వివాదం మరోసారి చర్చలోకి వచ్చింది. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న కొత్త చిత్రానికి ‘సండియార్’ (Sandiyar) అనే పేరు పెట్టారు. నవంబర్ 6న మేకర్స్ ఈ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో కమల్ హాసన్ గడ్డంతో, రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్నారు. రక్తంతో కూడిన విజువల్స్, చేతిలో ఆయుధం, ‘Revenge can only be settled in blood’ అనే ట్యాగ్‌లైన్ చూస్తుంటే ఇది ప్రతీకారం చుట్టూ తిరిగే యాక్షన్ డ్రామా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ ప్రకటనలో అసలైన ఆసక్తి పోస్టర్లో కాదు.. దాని వెనుక ఉన్న 23 ఏళ్ల పాత కథలో ఉంది.
2003లో మొదలైన అసలు వివాదం ఇదే!
2003లో కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించారు. ఆ చిత్రానికి మొదట ‘సండియార్’ అనే పేరును ప్రకటించారు. మదురైలో సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది. అయితే సినిమా షూటింగ్ మొదలుకాకముందే టైటిల్ చుట్టూ వివాదం మొదలైంది. తమిళంలో ‘సండియార్’ అనే పదానికి రౌడీ, గొడవలు సృష్టించే వ్యక్తి అనే అర్థాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వీరత్వం, ఆధిపత్యాన్ని ప్రదర్శించే వ్యక్తిని సూచించడానికి కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తారు.
అప్పట్లో పుతియా తమిళగం పార్టీ నాయకుడు కే. కృష్ణస్వామి ఈ టైటిల్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పేరు ఒక సామాజిక వర్గ ఆధిపత్యాన్ని, హింసాత్మక సంస్కృతిని ప్రోత్సహించేలా ఉందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో తేవర్, దళిత వర్గాల మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో ఇలాంటి టైటిల్ మరింత సమస్యలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాలో కొడవలి పట్టుకున్న కమల్ హాసన్ పోస్టర్లు కూడా ఈ వ్యతిరేకతకు మరో కారణమయ్యాయి.
ఈ వివాదం కారణంగా సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది. పరిస్థితి తీవ్రం కావడంతో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కమల్ హాసన్ స్వయంగా కలిశారు. సినిమా షూటింగ్‌కు పోలీసు భద్రత కల్పించాలని కోరినప్పటికీ, అప్పట్లో ఆ విషయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరకు వివాదానికి ముగింపు పలికేందుకు టైటిల్ మార్చుకోవాలని కమల్ నిర్ణయించారు. అలా ‘సండియార్’ కాస్తా ‘విరుమాండి’గా మారింది. 2004లో విడుదలైన ఈ సినిమా కమల్ కెరీర్లోనే గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తెలుగులో ‘పోతురాజు’ పేరుతో విడుదలైంది.
మళ్లీ మొదలైన పాత చర్చ.. ఈసారి కూడా అభ్యంతరాలు!
ఇప్పుడు 23 ఏళ్ల తర్వాత అదే టైటిల్‌ను కమల్ మళ్లీ ఎంచుకోవడంతో అప్పటి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అంతేకాదు, ఈసారి కూడా వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. తమిళ దర్శకుడు, నటుడు లెనిన్ భారతి ఈ సినిమా టైటిల్‌తో పాటు ‘ప్రతీకారాన్ని రక్తంతోనే తీర్చుకోవాలి’ అనే ప్రచార వాక్యంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో కులపరమైన ఘర్షణలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రచారం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.
పుతియా తమిళగం పార్టీ నాయకుడు కే. కృష్ణస్వామి కూడా ఈ టైటిల్‌ను వ్యతిరేకించారు. కులపరమైన ఉద్రిక్తతలకు కారణమయ్యే పదాన్ని సినిమా పేరుగా ఉపయోగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కమల్ హాసన్ ఒక సీనియర్ నటుడిగానే కాకుండా రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారని, ఆయన మరింత బాధ్యతతో వ్యవహరించాలని విమర్శకులు అంటున్నారు. ఈ విమర్శలపై కమల్ హాసన్ లేదా ఆయన నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వచ్చినట్లు సమాచారం లేదు.
మరి ఈసారి కమల్ వెనక్కి తగ్గుతారా?
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కొత్త ‘సండియార్’ సినిమాకు, 2004లో వచ్చిన ‘విరుమాండి’కి కథాపరంగా సంబంధం ఉన్నట్లు మేకర్స్ ప్రకటించలేదు. అంటే ఇది పాత సినిమాకు సీక్వెల్ కాదు. కేవలం అప్పట్లో వదులుకున్న టైటిల్‌ను కొత్త కథ కోసం మళ్లీ ఉపయోగిస్తున్నారు. ‘చిత్తా’, ‘సేతుపతి’, ‘వీర ధీర సూరన్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఎస్.యు. అరుణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, అన్బరివ్ ద్వయం యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు.
అయితే ఇప్పుడు అసలు ప్రశ్న సినిమా కథ ఎలా ఉంటుంది? కమల్ పాత్రను దర్శకుడు ఏ విధంగా చూపించబోతున్నారు? అన్నదానికంటే.. 23 ఏళ్ల క్రితం ఎదురైన పరిస్థితులు మళ్లీ వస్తే కమల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఆసక్తికరంగా మారింది. అప్పట్లో వివాదం కారణంగా టైటిల్ మార్చుకున్న కమల్.. ఈసారి మాత్రం అదే పేరుతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు. మరి ఈసారి ‘సండియార్’ వివాదం ఎక్కడికి దారితీస్తుంది? సినిమా విడుదల వరకు ఇదే టైటిల్ కొనసాగుతుందా? అన్నది చూడాలి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







