‘జయంత్ అండ్ ది జింగో పెన్’ ప్రతి విద్యార్థి చూడాల్సిన చిత్రం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్ లో దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మాణంలో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన తెరకెక్కించిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. ఈ సినిమాలో మాస్టర్ జయంత్ బొలిశెట్టి, మన శంకర వర ప్రసాద్ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో టీం బిజీగా ఉంది.
ఈ చిత్రంలోని లిరికల్ వీడియో సాంగ్‌ను డీపీఎస్, పల్లవి విద్యాసంస్థల అధినేత మల్క కొమరయ్య విడుదల చేశారు. డీపీఎస్ స్కూల్లో ఏర్పాటు చేసిన విద్యార్థుల ఇంటరాక్షన్ కార్యక్రమానికి ఆయన ప్రత్యేకంగా హాజరయ్యారు.
*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..* ‘పిల్లల మనస్తత్వం, చదువుపై ఒత్తిడి, ముఖ్యంగా గణితం వంటి సబ్జెక్టుల పట్ల ఉండే భయాలను అధిగమించే మంచి సందేశంతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రతి విద్యార్థి చూడాలి. మార్కులే పిల్లల ప్రతిభకు కొలమానం కాదు. ప్రతి చిన్నారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే’ అని పేర్కొన్నారు.
డీపీఎస్, పల్లవి విద్యాసంస్థల విద్యార్థులందరికీ ఈ చిత్రాన్ని చూపించేలా కృషి చేస్తానని మరోసారి హామీ ఇచ్చి చిత్ర బృందాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సరిత మేడమ్, వైస్ ప్రిన్సిపల్, చిత్ర దర్శకుడు నవీన్ దేశబోయిన, కథానాయకుడు ఆశిష్ గాంధీ, బాలనటులు మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ఊహా, ఇతర నటీనటులు, చిత్ర బృందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులతో చిత్ర బృందం నిర్వహించిన సరదా సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అలాగే బాలనటి ఊహా పుట్టినరోజు వేడుకలను విద్యార్థులు, చిత్ర బృందం సమక్షంలో ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 14 నుంచి థియేటర్లలో ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సందడి చేయనుంది.







