అమెరికాలో ఎస్బీఐ విస్తరణ.. టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో కొత్త SBIC బ్యాంక్ శాఖ ప్రారంభం!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన అంతర్జాతీయ విస్తరణలో భాగంగా అమెరికాలో మరో మైలురాయిని అధిగమించింది. ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి నేతృత్వంలో టెక్సాస్‌లోని డల్లాస్ ప్రాంతమైన ఫ్రిస్కోలో ఎస్బీఐ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ అయిన ‘ఎస్బీఐసీ బ్యాంక్’ కొత్త శాఖను ప్రారంభించారు. కాలిఫోర్నియా వెలుపల ఎస్బీఐసీ బ్యాంక్‌కు ఇదే మొదటి శాఖ కావడం విశేషం. దీనితో అమెరికాలో ఎస్బీఐసీ బ్రాంచ్‌ల సంఖ్య ఎనిమిదికి చేరగా, ఇప్పటికే న్యూయార్క్, చికాగో, లాస్ ఏంజెల్స్‌లో మూడు ప్రత్యక్ష శాఖలు, వాషింగ్టన్ డీసీలో ప్రతినిధి కార్యాలయం కొనసాగుతున్నాయి.
ఫ్రిస్కో నగరంలో ప్రారంభమైన ఈ కొత్త శాఖ ద్వారా రిటైల్ డిపాజిట్లు, కమర్షియల్ లెండింగ్, గ్లోబల్ రెమిటెన్సెస్ , ప్రత్యేక ఎన్ఆర్ఐ (NRI) సేవలను అందించనున్నారు. భారత్-అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ విస్తరణ దోహదపడుతుందని చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 29 దేశాలలో 245 విదేశీ కేంద్రాలను కలిగి ఉన్న ఎస్బీఐ, 2026 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో తన విదేశీ అడ్వాన్సులు 22.86 శాతం వృద్ధితో రూ. 8,31,332 కోట్లకు, విదేశీ కార్యాలయాల డిపాజిట్లు 22.61 శాతం వృద్ధితో రూ. 2,83,319 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది.







