ట్రంప్ చేతిలో హనుమాన్ చాలీసా.. వైట్‌హౌస్‌లో ఏం జరిగిందంటే?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఓవల్ ఆఫీస్‌లో భారతీయ సంప్రదాయం ప్రకారం దీపాలు వెలిగించి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ వేడుకల్లో ట్రంప్ దీపాలు వెలిగించడం ఒక విశేషమైతే, ఆయనకు అందిన ఓ బహుమతి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకగా భావించే హనుమాన్ చాలీసాను ఓ భారతీయ వ్యాపారవేత్త స్వయంగా ట్రంప్‌కు అందించారు. దీంతో వైట్‌హౌస్‌లో జరిగిన ఈ దీపావళి వేడుకలకు భారతీయ టచ్ మరింత ప్రత్యేకంగా మారింది.
వైట్‌హౌస్‌లో భారతీయ పండుగ సందడి!
సాధారణంగా అమెరికా అధ్యక్షుడి అధికారిక కార్యక్రమాలతో సందడిగా ఉండే ఓవల్ ఆఫీస్‌లో ఈసారి దీపావళి వెలుగులు కనిపించాయి. శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో ట్రంప్ స్వయంగా దీపాలు వెలిగించి భారతీయ పండుగలో భాగమయ్యారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని భారతీయ సంతతికి చెందిన ప్రముఖులతో పాటు ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నవారు కూడా హాజరయ్యారు.
భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా, GOQii వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్, IBM సీఈఓ అరవింద్ కృష్ణ, FBI డైరెక్టర్ కాశ్ పటేల్, అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ జయ్ భట్టాచార్య ఈ వేడుకల్లో కనిపించారు. వీరితో పాటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ కమిషనర్ అర్జున్ మోడి కూడా పాల్గొన్నారు.
A moment of shared light in the Oval Office. 🪔
Honored to celebrate Diwali with President @realDonaldTrump and proud to gift him with a copy of the Hanuman Chalisa, Tulsidas’s hymn to Lord Hanuman that millions of us recite for courage, devotion and strength.
As the diyas were lit, my prayer was for friendship between India and America, and for the triumph of light over darkness.
Jug Jug Jiyo, a blessing many of us grew up hearing, means “may you live for ages.” It is the wish behind everything I do, and today I made it for everyone around the world: peace, prosperity, good health and longevity.
Happy Diwali. Jug Jug Jiyo. 🙏
@TheVikasKhanna @DhallaRuby @WhiteHouse
— Vishal Gondal (@vishalgondal) November 6, 2026
ట్రంప్ చేతికి హనుమాన్ చాలీసా.. ఈ గిఫ్ట్ వెనుక ప్రత్యేకత!
ఈ వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం హనుమాన్ చాలీసా బహుమతి. GOQii వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ ట్రంప్‌ను కలిసి ఈ పుస్తకాన్ని అందించారు. మన దగ్గర చాలామంది ప్రతిరోజూ భక్తితో చదివే హనుమాన్ చాలీసా అమెరికా అధ్యక్షుడి చేతికి చేరడం ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా నిలిచింది.
ఈ విషయాన్ని విశాల్ గొండాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా కోట్లాది మంది భారతీయులకు ఎంతో ప్రత్యేకమైన ప్రార్థన అని ఆయన వివరించారు. ధైర్యం, భక్తి, ఆత్మవిశ్వాసం, శక్తికి ప్రతీకగా భావించే ఈ చాలీసాను ట్రంప్‌కు అందించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు.
భారత్, అమెరికా స్నేహం మరింత బలపడాలని ప్రార్థన!
కేవలం బహుమతి ఇవ్వడంతోనే గొండాల్ ఆగిపోలేదు. దీపాలు వెలిగించిన సమయంలో భారత్, అమెరికా మధ్య స్నేహబంధం మరింత బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు చెప్పారు. చీకటిపై వెలుగు గెలవాలనే దీపావళి సందేశం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ‘జుగ్ జుగ్ జియో’ అనే భారతీయ ఆశీర్వచనాన్ని కూడా గుర్తుచేశారు. అంటే చిరకాలం ఆయురారోగ్యాలతో జీవించాలన్నది దీని అర్థం. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ శాంతి, సంతోషం, సంపద, మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
భారతీయ సంతతి ప్రముఖులతో ట్రంప్ ప్రత్యేక సమావేశం
ఈ కార్యక్రమంలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అమెరికాలో వివిధ రంగాల్లో కీలక స్థానాల్లో ఉన్న భారతీయ సంతతి వ్యక్తులు ఒకే చోట కనిపించడం. టెక్నాలజీ నుంచి వైద్యం, వ్యాపారం, ఆహార రంగం వరకు తమదైన గుర్తింపు తెచ్చుకున్న పలువురు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా, కెనడా మాజీ పార్లమెంట్ సభ్యురాలు రూబీ ధల్లా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇదిలా ఉంటే, వైట్‌హౌస్‌లో ఈ వేడుకలు జరుగుతున్న సమయంలోనే ట్రంప్ పరిపాలనలో కీలక మార్పులు కూడా చోటుచేసుకుంటున్నాయి. తనకు అత్యంత సన్నిహితుడైన స్టీఫెన్ మిల్లర్‌ను వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. సోమవారం నుంచి ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న సుసీ వైల్స్ ఇకపై ట్రంప్ పరిపాలన రాజకీయ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు.
మొత్తానికి, అమెరికా అధ్యక్షుడి అధికారిక కార్యాలయంలో భారతీయ పండుగ వాతావరణం కనిపించడం, అదే వేదికపై హనుమాన్ చాలీసా బహుమతిగా అందడం ఈ ఏడాది వైట్‌హౌస్ దీపావళి వేడుకల్లో ప్రత్యేకంగా నిలిచిన అంశాలు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







