ట్రంప్‌కు సపోర్ట్ చేసి ఇరుక్కుపోయిన కంపెనీలు ఇవే?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహితంగా ఉంటే వ్యాపారానికి లాభమని భావించిన కార్పొరేట్ దిగ్గజాలకు ఇప్పుడు కొత్త చిక్కులు ఎదురుకానున్నాయా? అంటే అవుననే చెప్పాలి. ట్రంప్‌కు అండగా నిలిచిన టెక్ కంపెనీలు, బడా వ్యాపారవేత్తలు, ఆయన కుటుంబ వ్యాపారాలతో సంబంధాలున్న సంస్థలపై డెమోక్రాట్లు గురిపెట్టారు. అమెరికాలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థల వ్యవహారాలను నిశితంగా పరిశీలించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంతో వ్యాపార ఒప్పందాలు, రాజకీయ విరాళాలు, క్రిప్టో లావాదేవీలు, ఏఐ టెక్నాలజీ వినియోగం.. ఇలా ఒక్కో అంశంపై ప్రశ్నలు సంధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు ముందస్తుగా లాయర్లు, లాబీయిస్టులను నియమించుకుంటున్నాయన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఇంతకీ డెమోక్రాట్ల టార్గెట్ లిస్ట్‌లో ఉన్న కంపెనీలు ఏవి? వాటిపై ఎందుకు విచారణ జరపాలనుకుంటున్నారు?
మొదట టార్గెట్ అయ్యేది వీళ్లేనా?
డెమోక్రాట్ల పరిశీలనలో టెక్నాలజీ రంగంలోని దిగ్గజ సంస్థలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆపిల్, మెటా, ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీల వ్యవహారాలపై విచారణకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు.
ఆపిల్ విషయంలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కార్యకలాపాలకు సంబంధించిన యాప్స్, వాటికి సంబంధించిన టెక్నాలజీ అంశాలు చర్చకు రావచ్చు. మెటా విషయంలో డేటా సెంటర్లు, ప్రభుత్వ విధానాలతో సంబంధాలపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కంపెనీలు ట్రంప్ ప్రభుత్వంతో ఎలాంటి సంబంధాలు కొనసాగించాయి? వాటి ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందాయి? అనే అంశాలను డెమోక్రాట్లు పరిశీలించాలనుకుంటున్నారు.
ఎలాన్ మస్క్ కంపెనీలకు కొత్త తలనొప్పి!
ఈ జాబితాలో అత్యంత ఆసక్తికరమైన పేరు ఎలాన్ మస్క్. ట్రంప్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యాపారవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందిన మస్క్‌కు చెందిన కంపెనీలు కూడా విచారణల పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంది. టెస్లా, స్పేస్ఎక్స్తో పాటు ఆయన ఏఐ సంస్థకు సంబంధించిన వ్యవహారాలపైనా ప్రశ్నలు రావచ్చు.
ముఖ్యంగా మస్క్‌కు చెందిన Grok AI చాట్‌బాట్ వినియోగంపై ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్, అక్కడి సైనిక చర్యలకు సంబంధించిన ప్రణాళికల్లో గ్రోక్‌ను ఉపయోగించారనే ఆరోపణలపై హౌస్ కమిటీ విచారణకు సిద్ధమవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ అంశంపై అధికారిక విచారణ జరిగితే ఏఐ టెక్నాలజీని ప్రభుత్వ సైనిక కార్యకలాపాల్లో ఎలా ఉపయోగిస్తున్నారు? ప్రైవేట్ టెక్ కంపెనీల పాత్ర ఎంత? అనే ప్రశ్నలు కూడా ముందుకొస్తాయి.
ట్రంప్ కుటుంబ వ్యాపారాలపైనా నిఘా!
కేవలం టెక్ కంపెనీలే కాదు.. ట్రంప్ కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు కూడా డెమోక్రాట్ల పరిశీలనలోకి రానున్నాయి. క్రిప్టోకరెన్సీ సంస్థలు, పెట్టుబడి సంస్థలు, ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది.
ముఖ్యంగా World Liberty Financial వంటి ట్రంప్ కుటుంబంతో సంబంధాలున్న క్రిప్టో వ్యాపారాలు చర్చకు వస్తున్నాయి. అలాగే Polymarket, Kalshi వంటి ప్రిడిక్షన్ మార్కెట్ సంస్థలు, ట్రంప్ కుటుంబానికి దగ్గరగా ఉన్న పెట్టుబడి సంస్థల వ్యవహారాలపైనా ప్రశ్నలు రావచ్చు. ప్రభుత్వ విధానాలు, వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాల మధ్య ఏమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలో ఈ వ్యవహారాలను పరిశీలించాలనుకుంటున్నారు.
ఫార్మా కంపెనీలను కూడా వదలరా?
ట్రంప్ ప్రభుత్వం ఫార్మాస్యూటికల్ కంపెనీలతో కుదుర్చుకున్న ఔషధ ధరల ఒప్పందాలు కూడా విచారణల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల వెనుక ఉన్న నిబంధనలు, కంపెనీలకు కలిగిన ప్రయోజనాలు, ట్రంప్ కుటుంబ వ్యాపారాలతో ఏమైనా సంబంధాలున్నాయా? అనే అంశాలను పరిశీలించవచ్చు.
ఇదే సమయంలో ప్రభుత్వ కాంట్రాక్టులు పొందిన సంస్థలు, సహజ వాయువు కంపెనీలు, ప్రైవేట్ జైళ్లను నిర్వహించే సంస్థలు కూడా డెమోక్రాట్ల దృష్టిలో ఉన్నట్లు సమాచారం.
181 పేజీల నివేదిక.. వందలాది కంపెనీల వివరాలు!
ఈ మొత్తం వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశం 181 పేజీల నివేదిక. గ్రౌండ్‌వర్క్ కొలాబరేటివ్ అనే సంస్థ రూపొందించిన ఈ నివేదికను డెమోక్రాట్లు పరిశీలిస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇందులో వందలాది మంది కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, టెక్ దిగ్గజాలు, ఏఐ సంస్థలు, సహజ వాయువు కంపెనీలు, ప్రైవేట్ జైళ్ల నిర్వాహకులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం. ట్రంప్ ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకున్న సంస్థలు, ప్రభుత్వ ఒప్పందాల ద్వారా లబ్ధి పొందిన కంపెనీల వ్యవహారాలను పరిశీలించేందుకు ఈ నివేదిక ఉపయోగపడనుంది.
కంపెనీలు ముందుగానే లాయర్లను ఎందుకు నియమించుకుంటున్నాయి?
డెమోక్రాట్ల విచారణల ప్రణాళికలతో కార్పొరేట్ అమెరికాలో ముందస్తు కదలికలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నుంచి సబ్‌పోనాలు (Subpoenas) వస్తే ఎలా స్పందించాలి? ఏ పత్రాలు సమర్పించాలి? విచారణలను చట్టపరంగా ఎలా ఎదుర్కోవాలి? అనే అంశాలపై కంపెనీలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
కొన్ని సంస్థలు లాయర్లు, లాబీయిస్టులను నియమించుకుంటూ ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మరోవైపు, విచారణల పరిధి, వాటి చట్టబద్ధతపై కోర్టుల్లో సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
ట్రంప్‌కు దగ్గరగా ఉండటం ఇప్పుడు భారంగా మారనుందా?
డెమోక్రాట్ల వ్యూహం వెనుక ప్రధాన ఉద్దేశం ట్రంప్ ప్రభుత్వ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ-కార్పొరేట్ సంబంధాలను పరిశీలించడమేనని వారు చెబుతున్నారు. అయితే ఈ విచారణలు ప్రారంభమైతే వాటి ప్రభావం కేవలం ట్రంప్ ప్రభుత్వంపైనే కాకుండా అమెరికాలోని ప్రముఖ వ్యాపార సంస్థలపైనా పడవచ్చు అనేది నిజం.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







