మస్క్‌ను దెబ్బకొట్టేందుకు డెమోక్రాట్లుకు దొరికిన కొత్త ఆయుధం చైనానా?
ట్రంప్ అధికారంలోకి రావడానికి ఎలాన్ మస్క్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎన్నికల ప్రచారానికి కోట్ల డాలర్లు ఖర్చు చేశారు. ట్రంప్ సభల్లో కనిపించారు. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా మారారు. చివరకు అమెరికా ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు చేపట్టారు. ట్రంప్‌తో మస్క్ స్నేహం చూస్తే అమెరికా రాజకీయాల్లో మరో పవర్ సెంటర్ తయారైందనే అభిప్రాయం కలిగింది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ట్రంప్‌కు అండగా నిలిచిన రిపబ్లికన్లకు ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు బలం పెంచుకున్నారు.
దీంతో ఇన్నాళ్లూ అధికారానికి దగ్గరగా ఉంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న మస్క్‌కు కొత్త కష్టాలు మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో డెమోక్రాట్లు ఖచ్చితంగా మస్క్ ని ఇరికించే ప్రయత్నం చేస్తారు. ఈ మేరకు వాళ్లు వ్యూహం పన్నుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా చైనా ని కూడా లాక్కొస్తున్నట్లు తెలుస్తోంది. అసలేం జరుగుతోంది. చైనా..ఎలా ఈ సినేరియాలోకి వస్తుందో చూద్దాం.
ట్రంప్ కోసం రూ.4 వేల కోట్లకు పైగా ఖర్చు.. అయినా ఫలితం దక్కలేదా?
ట్రంప్‌తో మస్క్ స్నేహం వెనుక రాజకీయంగానే కాదు.. వ్యాపారపరంగానూ చాలా లెక్కలున్నాయనే చర్చ చాలాకాలంగా ఉంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మస్క్‌కు ప్రభుత్వంలో కీలక పాత్ర లభించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) బాధ్యతలు చేపట్టి ప్రభుత్వ ఖర్చులను తగ్గించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ ఆయన కంపెనీలకు ప్రభుత్వంతో ఉన్న సంబంధాలు కొనసాగాయి.
ఇక 2026 మధ్యంతర ఎన్నికల విషయానికి వస్తే.. రిపబ్లికన్లకు మద్దతుగా మస్క్ దాదాపు 474 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.4,000 కోట్లకు పైమాటే. అమెరికా రాజకీయ చరిత్రలో ఒక వ్యక్తి ఎన్నికల కోసం ఖర్చు చేసిన భారీ మొత్తాల్లో ఇది ఒకటి.
కానీ ఫలితం మాత్రం ఆయన ఆశించినట్లు రాలేదు. మస్క్ మద్దతిచ్చిన 43 మంది రిపబ్లికన్ హౌస్ అభ్యర్థుల్లో కేవలం ముగ్గురే విజయం సాధించారు. టెక్సాస్‌లోనూ ఆయన మద్దతిచ్చిన కీలక అభ్యర్థులు ఓడిపోయారు. ముఖ్యంగా తన కంపెనీల ప్రధాన కేంద్రాలున్న టెక్సాస్‌లోనే రాజకీయంగా ఎదురుదెబ్బ తగలడం మస్క్‌కు ఇబ్బందికర పరిణామం.
ఇప్పుడు కాంగ్రెస్‌లో డెమోక్రాట్లకు బలం పెరగడంతో మస్క్ కంపెనీలపై పర్యవేక్షణ, విచారణలకు అవకాశం ఏర్పడింది. అంటే ఇన్నాళ్లూ తనకు అనుకూలంగా ఉన్న రాజకీయ వాతావరణం ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది.
డెమోక్రాట్ల అసలు ప్లాన్ ఇదేనా?
మస్క్‌ను ఇరుకున పెట్టడానికి డెమోక్రాట్లు ఎంచుకున్న మార్గం ఆయన వ్యాపార ప్రయోజనాలు, ప్రభుత్వంతో ఉన్న సంబంధాలను ప్రశ్నించడం. ముఖ్యంగా స్పేస్ఎక్స్కు అమెరికా ప్రభుత్వం ఇస్తున్న భారీ కాంట్రాక్టులు ఇప్పుడు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది.
ట్రంప్ ప్రభుత్వంలో DOGE బాధ్యతలు నిర్వహించిన సమయంలో మస్క్‌కు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉండేది. అదే సమయంలో ఆయన కంపెనీలు ప్రభుత్వంతో భారీ వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక్కడ ప్రయోజనాల సంఘర్షణ (Conflict of Interest) ఉందా? ప్రభుత్వ వనరులు, సమాచారం, అధికారాలను ప్రైవేట్ వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగించారా? అనే అంశాలపై డెమోక్రాట్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
అంతేకాదు.. మస్క్ వ్యక్తిగతంగా ఎన్నికలకు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసే విధానంపై కూడా నియంత్రణలు తీసుకురావాలని డెమోక్రాట్లు భావిస్తున్నారు. వ్యక్తిగతంగా అపరిమితంగా రాజకీయ ఖర్చులు చేసే అవకాశాన్ని కల్పిస్తున్న నిబంధనను మార్చే ప్రయత్నం కూడా ఇందులో భాగమే.
ఇప్పటికే స్పేస్ఎక్స్కు సంబంధించిన స్టార్‌లింక్ సేవలు ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఎలా ఉపయోగించబడ్డాయి, వాటి పరిమితులపై కంపెనీ తీసుకున్న నిర్ణయాలేమిటి అనే అంశాలపై కూడా చట్టసభ సభ్యులు ప్రశ్నలు సంధిస్తున్నారు. అంటే మస్క్‌కు సంబంధించిన ఒక్క వ్యాపారాన్ని మాత్రమే కాకుండా, ఆయన ప్రభుత్వ సంబంధాలు, రాజకీయ ఖర్చులు, అంతర్జాతీయ వ్యవహారాలను కూడా పరిశీలించే దిశగా అడుగులు పడుతున్నాయి.
ఇప్పుడు తెరపైకి వచ్చిన చైనా.. మస్క్‌కు ఇదే పెద్ద సమస్య!
ఇంతవరకు అమెరికా ప్రభుత్వంతో మస్క్ కంపెనీలకు ఉన్న సంబంధాల గురించి చర్చ జరిగింది. కానీ ఇప్పుడు మరో అంశం మరింత కీలకంగా మారుతోంది. అదే టెస్లాకు చైనాతో ఉన్న అనుబంధం.
ఒకవైపు స్పేస్ఎక్స్ అమెరికా రక్షణ రంగానికి కీలకమైన ఉపగ్రహాలు, అంతరిక్ష సేవలు అందిస్తోంది. మరోవైపు టెస్లా తన ప్రపంచ వ్యాపారంలో చైనాను ప్రధాన తయారీ కేంద్రంగా ఉపయోగించుకుంటోంది. షాంఘై గిగాఫ్యాక్టరీ నుంచి ప్రపంచ మార్కెట్లకు కార్లు సరఫరా అవుతున్నాయి. బ్యాటరీలు, విడిభాగాలు, ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థల కోసం కూడా చైనా సరఫరాదారులపై ఆధారపడుతోంది.
అంతేకాకుండా… అమెరికాలో తన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి దాదాపు 3 బిలియన్ డాలర్ల విలువైన చైనా సోలార్ తయారీ పరికరాలను కొనుగోలు చేసే అంశంపై టెస్లా చర్చలు జరుపుతోంది. ఇప్పుడు డెమోక్రాట్లకు ఇక్కడే ఒక ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. అమెరికా రక్షణ రంగానికి సంబంధించిన కీలక టెక్నాలజీని నిర్వహించే వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న వ్యక్తి.. అదే సమయంలో చైనాపై ఇంతగా ఆధారపడటం ఎంతవరకు సమంజసం?
ఒకవేళ అమెరికా-చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగితే ఈ వ్యాపార సంబంధాల ప్రభావం అమెరికా భద్రతపై పడుతుందా?
టెస్లా-స్పేస్ఎక్స్ విలీనాన్ని కూడా వదలరా?
మస్క్‌కు మరో చిక్కు ఆయన సొంత విలీన ప్రతిపాదన నుంచే రావచ్చు. టెస్లా, స్పేస్‌ఎక్స్‌ను ఒకే వ్యాపార వ్యవస్థగా మార్చే అవకాశాలను రెండు కంపెనీలు పరిశీలిస్తున్నాయి.
కానీ ఈ రెండు సంస్థల వ్యాపార స్వభావం పూర్తిగా భిన్నం. స్పేస్ఎక్స్ అమెరికా ప్రభుత్వ రక్షణ ప్రాజెక్టుల్లో భాగస్వామి. టెస్లా మాత్రం చైనా తయారీ వ్యవస్థతో బలంగా అనుసంధానమై ఉంది.
ఒకవేళ ఈ రెండు కంపెనీలు విలీనమైతే చైనా సరఫరాదారుల ప్రభావం స్పేస్ఎక్స్కు సంబంధించిన సున్నితమైన టెక్నాలజీపై పడకుండా ఎలా నియంత్రిస్తారు? అమెరికా రక్షణ సమాచారానికి భద్రత ఎలా కల్పిస్తారు? అనే ప్రశ్నలు రావచ్చు.
అందుకే ఈ విలీనం కేవలం వ్యాపార నిర్ణయంగా మిగిలిపోకపోవచ్చు. జాతీయ భద్రత, చైనా సంబంధాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల నేపథ్యంలో రాజకీయ చర్చకు దారితీయవచ్చు. ఈ అంశాన్ని ఇప్పటికే డెమోక్రటిక్ నాయకులు లేవనెత్తినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
మరి ఇప్పుడు మస్క్ ఏం చేయాలి?
మస్క్ ముందున్న సవాలు చాలా సంక్లిష్టమైనది. ఆయనకు అమెరికా మార్కెట్ ఎంత ముఖ్యమో, చైనా తయారీ వ్యవస్థ కూడా అంతే ముఖ్యం. అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టులను వదులుకోలేరు. చైనాలో ఉన్న భారీ తయారీ సామర్థ్యాన్ని కూడా ఒక్కసారిగా వదిలేయలేరు.
ఈ పరిస్థితిలో ఆయన ముందున్న కొన్ని కీలక మార్గాలు ఉన్నాయి.
– రాజకీయాలకు కొంత దూరం: ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేయడం, రాజకీయ వ్యాఖ్యలతో వివాదాల్లోకి వెళ్లడం తగ్గించి కంపెనీల కార్యకలాపాలపై దృష్టి పెట్టవచ్చు.
– వ్యాపారాల మధ్య స్పష్టమైన విభజన: టెస్లా చైనా సరఫరా వ్యవస్థకు, స్పేస్ఎక్స్ రక్షణ రంగ కార్యకలాపాలకు మధ్య సాంకేతికంగా, నిర్వహణపరంగా స్పష్టమైన భద్రతా గోడలు ఏర్పాటు చేయవచ్చు.
– అమెరికాలో ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థ: కీలక విడిభాగాలు, బ్యాటరీలు, ఇతర సాంకేతిక పరికరాల కోసం చైనాపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించే ప్రయత్నం చేయవచ్చు.
– ప్రభుత్వ కాంట్రాక్టుల్లో పారదర్శకత: తన కంపెనీలకు వచ్చే ప్రభుత్వ ఒప్పందాలు, DOGEలో తన పాత్రకు సంబంధించిన వ్యవహారాల్లో స్పష్టమైన వివరణలు ఇవ్వడం ద్వారా అనుమానాలను తగ్గించుకోవచ్చు.
అయితే ఇవన్నీ మస్క్‌కు తేలికైన నిర్ణయాలు కావు. చైనాను దూరం చేసుకుంటే తయారీ ఖర్చులు పెరగవచ్చు. అమెరికా ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతింటే రక్షణ రంగ ప్రాజెక్టులు ప్రభావితమవచ్చు. రాజకీయంగా మౌనంగా ఉన్నా, ఇప్పటికే మొదలైన విచారణలను ఎదుర్కోవాల్సిందే.
ట్రంప్ స్నేహం ఎంతవరకు కాపాడుతుంది?
ఇక్కడ మస్క్‌కు ఇంకా ఒక అవకాశం ఉంది. ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రభుత్వ విభాగాలపై ఆయనకు కార్యనిర్వాహక అధికారాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు విచారణలు ప్రారంభించినంత మాత్రాన మస్క్ కంపెనీలకు సంబంధించిన అన్ని ప్రభుత్వ ఒప్పందాలు రద్దవుతాయని చెప్పలేం.
అయితే కాంగ్రెస్ విచారణలు, సబ్‌పోనాలు, ప్రభుత్వ కాంట్రాక్టులపై ప్రశ్నలు కంపెనీలకు అదనపు ఒత్తిడిని కలిగించవచ్చు. అంతేకాదు, ట్రంప్‌తో ఉన్న స్నేహం ఒక్కటే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించలేదు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







