కలెక్టర్ కొంప ముంచిన AI.. కోర్టు ఫైర్! జనగామలో అసలేం జరిగింది?
పాలనలో సాంకేతికత పెరగడం మంచిదే కానీ, అది సామాన్యుల జీవితాలతో ఆటలాడుకునే పరిస్థితికి వస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైళ్లు కదలాలంటే రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నుంచి, కంప్యూటర్లు, ఆన్లైన్ సేవలు వచ్చి పనిని కాస్త వేగవంతం చేశాయి. ఇప్పుడు ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కూడా పాలనలోకి అడుగుపెట్టింది. గంటల తరబడి చేయాల్సిన విశ్లేషణలు, రికార్డుల పరిశీలన, ఉత్తర్వుల ముసాయిదాలు నిమిషాల్లో తయారవుతున్నాయని అధికారులు సంబరపడిపోతున్నారు. కానీ, ముఖ్యమైన విషయాల్లో భూమి, ఆస్ది వంటి వివాదాల్లో అధికారుల విచక్షణను పక్కన పెట్టి పూర్తిగా ఇలాంటి యంత్రాల మీద ఆధారపడితే ఏం జరుగుతుందో తెలంగాణలో జరిగిన ఈ సంఘటన కళ్లకు కడుతోంది.
జనగామ భూ వివాదంలో ఏఐ కలకలం
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామానికి చెందిన మెడిపల్లి కొమురయ్యకు ఒక భూ వివాదం ఉంది. ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్ సెప్టెంబర్ 8న ఒక ఉత్తర్వు జారీ చేశారు. అయితే, ఆ ఉత్తర్వు చూసి కొమురయ్య షాక్ తిన్నారు. అసలు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను, తమ వద్ద ఉన్న రికార్డులను పరిశీలించకుండా, కనీసం తమ వాదన కూడా వినకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆవేదన చెందారు. కలెక్టర్ ఇచ్చిన ఆ ఉత్తర్వు వల్ల తన భూమిపై ఉన్న హక్కులకే ముప్పు వాటిల్లుతోందని గ్రహించిన ఆయన, వెంటనే న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు.
ఇవి కూడా చదవండి
కోర్టులో పిటిషనర్ వాదనలు.. హైకోర్టు తీవ్ర అసంతృప్తి
ఈ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం. మాధవరెడ్డి కోర్టు దృష్టికి ఒక సంచలన విషయాన్ని తీసుకెళ్లారు. కలెక్టర్ కార్యాలయంలో ఈ భూ వివాదానికి సంబంధించిన ఉత్తర్వులను మనుషులు స్వయంగా ఆలోచించి రాయలేదని, ఏఐ సాధనాలను ఉపయోగించి రూపొందించారని ఆరోపించారు. ఒక భూమి విషయంలో ఇరువర్గాల వాదనలు వినకుండా, అసలు హక్కులు ఎవరికున్నాయో పరిశీలించకుండా కేవలం ఏఐ ఇచ్చిన డ్రాఫ్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు.
విచారణ జరిపిన జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలనలో సాంకేతికతను వాడుకోవడంలో తప్పులేదు కానీ, అధికారుల స్వతంత్ర విచక్షణను పక్కనపెట్టి ఏఐపై ఆధారపడటం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.
భూ వివాదాలు అంటే కేవలం సర్వే నంబర్లు, కాగితాల వ్యవహారం మాత్రమే కాదని, ఒక కుటుంబ జీవనాధారమని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే జనగామ కలెక్టర్ జారీ చేసిన ఆ ఉత్తర్వుల అమలుపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, కలెక్టర్, తహసీల్దార్లకు నోటీసులు జారీ చేస్తూ, అడ్వకేట్ జనరల్ ఏ. సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని ఆదేశించింది.
నిర్ణయాలు తీసుకోవాల్సింది అధికారులా? ఏఐయా?
ఏఐ ఎంత తెలివైనదైనా దానికి డేటాను విశ్లేషించే సామర్థ్యం మాత్రమే ఉంటుంది కానీ, మనుషుల బాధలను, క్షేత్రస్థాయి వాస్తవాలను అర్థం చేసుకునే విచక్షణ ఉండదు. ఏఐ ఇచ్చే సమాచారాన్ని కళ్ళు మూసుకుని నమ్మితే సామాన్యుడికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. రేపు పింఛన్లు, సంక్షేమ పథకాలు, ఆస్తి హక్కుల విషయంలో కూడా ఇదే రిపీట్ అయితే సామాన్యుడు ఎవరిని ఆశ్రయించాలి? సాంకేతికత అధికారులకు సహాయకారిగా ఉండాలి తప్ప, అధికారుల విచక్షణకే ఎసరు పెట్టకూడదు. నిర్ణయాలు తీసుకునే అధికారం, బాధ్యత ఎప్పుడూ ప్రత్యక్షంగా పరిశీలించే అధికారుల చేతిలోనే ఉండాలనేది ఈ సంఘటన ఇస్తున్న స్పష్టమైన హెచ్చరిక.
— సూర్య ప్రకాష్ జోశ్యుల







