ఓటరు నమోదులో వెనుకబడ్డ కాంగ్రెస్!?
వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. వరంగల్- ఖమ్మం- నల్గొండ, మహబూబ్నగర్- రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గాలను కైవసం చేసుకోవడం ద్వారా తమ రాజకీయ ఆధిపత్యాన్ని చాటాలని అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ స్థానానికి సామ రామ్మోహన్ రెడ్డిని, వరంగల్- ఖమ్మం- నల్గొండ స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించి ముందడుగు వేసింది. అయితే ఓటరు నమోదు ప్రక్రియలో మాత్రం కాంగ్రెస్ పార్టీ బాగా వెనుకబడినట్లు వార్తలు అందుతున్నాయి.
ఎన్నికల పోరులో గెలుపోటములను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన ఓటరు నమోదు ప్రక్రియ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పట్టభద్రుల ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి తేదీగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ గడువు ముగిసినప్పటికీ, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని CEO స్పష్టం చేశారు. గతంలో ఓటర్లుగా ఉన్నవారు సైతం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధన ఉండటంతో, పెద్ద ఎత్తున అర్హులను నమోదు చేయించడం పార్టీల ముందున్న అతిపెద్ద సవాలు.
ఇవి కూడా చదవండి
ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత సీరియస్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఓటరు నమోదుపై ప్రారంభం నుంచే పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, యువతను పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం చేసి బలమైన ఓటు బ్యాంకును సృష్టించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కేడర్ ఆశించిన స్థాయిలో వేగం పుంజుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ నాయకత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఓటర్లను నమోదు చేయించడంలో కొంత నిర్లిప్తత ప్రదర్శించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇతర పార్టీలతో పోలిస్తే, అధికారంలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించినంతగా గ్రౌండ్ వర్క్ జరగలేదన్న గుసగుసలు పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశమయ్యాయి.
ఓటరు నమోదులో కేడర్ వెనుకబడిందన్న వార్తలు, నివేదికలు అధిష్టానాన్ని అప్రమత్తం చేశాయి. దీంతో చివరి గడువు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నాయకత్వం మరింత దూకుడు పెంచింది. పార్టీ శ్రేణులకు మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేస్తూ, మిగిలిన సమయంలోనైనా వేగంగా దరఖాస్తులు పూర్తి చేయించాలని ఆదేశించింది. కాలేజీలు, యూనివర్సిటీలు, ఉద్యోగ సంఘాలు, పట్టభద్రులూ అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది.
నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుండగా, ఆ తర్వాత డిసెంబర్ 10 వరకు అభ్యంతరాల స్వీకరణ, డిసెంబర్ 30న తుది జాబితా ప్రచురణ ఉంటుంది. తుది జాబితా వచ్చే వరకు కూడా దరఖాస్తులకు అవకాశం ఉన్నప్పటికీ.. ప్రారంభ దశలో జరిగిన జాప్యాన్ని పూడ్చడంపైనే ఇప్పుడు పార్టీ దృష్టి కేంద్రీకృతమైంది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే పార్టీ బలం ఒక్కటే సరిపోదు. వ్యక్తిగత ప్రభావం, మేధావుల నాడిని పట్టడం చాలా ముఖ్యం. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రభుత్వ విధానాలకు ప్రజామద్దతు ఉందని భావించడానికి ఒక బలమైన సంకేతం దొరుకుతుంది. అయితే, ఓటరు నమోదు ప్రక్రియలో ప్రారంభంలో ఎదురైన ఆటంకాలు, కేడర్ నుంచి రావాల్సినంత స్పందన రాకపోవడం వంటి పరిణామాలు కాంగ్రెస్ అభ్యర్థుల విజయ అవకాశాలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.







