ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు!
తెలంగాణ రాజకీయాల్లో సంక్షేమ పథకాలు కేవలం ఆచరణకే పరిమితం కాకుండా, ప్రజలతో భావోద్వేగ అనుబంధాన్ని పెంచే సాధనాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా పేదల సొంతింటి కల సాకారం చేసే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం ఇప్పుడు కేవలం ఒక నిర్మాణ కార్యక్రమంగా కాకుండా, రాజకీయ వ్యూహంలోనూ కీలక మైలురాయిగా మారుతోంది. ఈ నేపథ్యంలో పండుగ పూట లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం వెనుక బలమైన రాజకీయ, సామాజిక కోణాలు దాగి ఉన్నాయి.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా క్షేత్రస్థాయిలో పేదల ఆదరాభిమానాలను సంపాదించడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో శాశ్వత విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఆర్థిక పరమైన ఇబ్బందులు, సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ ఈ పథకాన్ని ఆపకుండా ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోంది. తొలి విడతలో మంజూరైన 4.50 లక్షల ఇళ్లలో ఇప్పటికే 2,21,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తికావడం, లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. మరో 1.90 లక్షల ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉండగా, మిగిలిన గృహాలను కూడా వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
ఇవి కూడా చదవండి
ఈ దీపావళికి రాష్ట్రవ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ పేరిట నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజాప్రతినిధులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి దీపాలు వెలిగించాలని సూచించారు. “ఇందిరమ్మ ఇళ్లు చూపించిన తర్వాతే ఓట్లు అడుగుతాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాటలకు అనుగుణంగానే ఈ వేడుకలను రాజకీయ ప్రచార అస్త్రంగా, అదే సమయంలో ప్రజా సంక్షేమ విజయోత్సవంగా కాంగ్రెస్ పార్టీ మలచుకుంటోంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేయడం ద్వారా అవినీతికి తావులేకుండా పారదర్శకతను ప్రదర్శిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.
కేవలం గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కాకుండా, పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల కోసం ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నగరంతో పాటు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ కార్పొరేషన్లలోనూ జీ+5 విధానంలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. సుమారు రూ.40 వేల కోట్ల భారీ వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ బృహత్తర ప్రాజెక్టు ద్వారా పేదల హౌసింగ్ రంగానికి మహర్దశ పట్టనుంది. రాబోయే బోనాల వేడుకలను హైదరాబాద్లోని ఇందిరమ్మ టవర్ల వేదికగా నిర్వహించాలని భావిస్తుండటం, ఈ ప్రాజెక్టుల వేగానికి అద్దం పడుతోంది.
సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి దీపావళి పండుగ రోజున కొత్త ఇంట్లో దీపం వెలగడం అనేది కేవలం వెలుగును ఇవ్వడమే కాదు, వారి జీవితాల్లో భవిష్యత్తుపై భరోసాని నింపుతుంది. ఈ భావోద్వేగ అంశాన్ని రాజకీయాంశంగా, సామాజిక బాధ్యతగా విజయవంతంగా మిళితం చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పేదల ఇళ్లలో వెలిగే ప్రతి దీపం కాంగ్రెస్ పార్టీ పాలనకు ప్రజలనిచ్చే దీవెనలుగా మారుతాయా లేదా అనేది రాబోయే కాలం తేల్చనుంది.







